వీధి వ్యాపారులకు రుణాలలో మనమే టాప్‌

ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకి (7శాతం) రుణాలు ఇప్పించడంలో రాష్ట్రం లక్ష్యాలను అధిగమించింది. వంద శాతానికి మించి అమలు చేసింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రంలో ఈ పథకం అమలవుతున్న తీరును కేంద్ర పట్టణ, గృహనిర్మాణశాఖల కార్యదర్శి దుర్గ శంకర్‌ మిశ్రా ట్విటర్‌ ద్వారా ప్రశంసించడమే కాకుండా తెలంగాణను స్ఫూర్తిగా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించారు. ఇదే కాకుండా కర్ణాటక, తమిళనాడు, గోవా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ సహా పలు రాష్ట్రాలకు చెందిన అధికారులు పీఎం స్వనిధి పథకం రాష్ట్రంలో అమలవుతున్న తీరును పరిశీలించడం మన రాష్ట్రంలో పథకం అమలు తీరును తెలియచేస్తున్నది.

ఈ పథకం కింద రాష్ట్రంలో తొలివిడతగా 3.40 లక్షల మందికి రుణాలు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించగా రాష్ట్రంలో అంతకుమించి రుణాలు ఇవ్వడం జరిగింది. పీఎం స్వనిధి పథకం కింద వర్కింగ్‌ క్యాపిటల్‌గా రూ. 364.54 కోట్లను 3,64,549 మందికి మంజూరు చేశారు. నిర్దేశించిన లక్ష్యాలలో ఇది 107.22 శాతం కావడం విశేషం. ఇప్పటి వరకు 3,45,102 (101.50శాతం) మందికి రూ. 342 కోట్లు పంపిణీ చేశారు. మొదటి విడత రుణాలు సక్రమంగా చెల్లించిన వారికి రెండో విడతలో ఒక్కొక్కరికి 20వేల రూపాయల చొప్పున 1.50 లక్షల మందికి రూ. 300కోట్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

ఈ రుణాలు తీసుకున్న లబ్ధిదారుల్లో 50శాతం మంది కూరగాయలు, పండ్ల దుకాణాలు పెట్టుకోవడానికి వెచ్చించారు. 16 శాతం మంది బట్టలషాపులు, 10 శాతం మంది ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. రుణాలు తీసుకున్న వారిలో అత్యధికంగా 66 శాతం మంది మహిళలు ఉండగా, 34 శాతం మంది పురుషులు ఉన్నారు.

పట్టణాలు, నగరాల్లో మనమే ముందంజ

పట్టణాలు, నగరాల్లో అమలవుతున్న వాటిలో మనమే ముందంజలో ఉన్నాము. మెగాసిటీ విభాగాల్లో, 40 లక్షలకు పైబడి జనాభా ఉన్న నగరాల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇదే కాకుండా లక్ష లోపు జనాభా ఉన్న పట్టణాల్లో దేశవ్యాప్తంగా తొలి పది స్థానాల్లో తెలంగాణ పట్టణాలే ఉండడం విశేషం.

డిజిటల్‌ కరెన్సీ ఉపయోగంలో ముందంజ

రుణాలు తీసుకున్న వీధి వ్యాపారుల్లో 90 శాతం మంది క్యూఆర్‌ కోడ్‌ ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వీరికి గరిష్టంగా నెలకు 100 రూపాయలు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. దేశం మొత్తం మీద అందిస్తున్న ప్రోత్సాహకాలలో 31 శాతం మన రాష్ట్రానికే వచ్చాయంటే ఇక్కడి వ్యాపారులు ఏ మేరకు డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నారో అర్థమవుతుంది.

రాష్ట్రం తోడ్పాటు

వీధి వ్యాపారులకు వారి వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తోడ్పాటును అందిస్తోంది. వీరికి ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సర్టిఫికెట్లను అందచేస్తున్నారు. నాణ్యమైన, పరిశుభ్రమైన వంటకాలు చేసేలా శిక్షణ ఇస్తున్నారు. సమీకృత మార్కెట్‌ షెడ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు.

టాప్‌ 10లో నిలిచిన పట్టణాలు, నగరాలు

వరంగల్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ మొదటి స్థానం, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 4వ స్థానం, ఖమ్మం మున్సిపల్‌ కార్పోరేషన్‌ 9వ స్థానంలో నిలిచాయి.

రుణ పంపిణీ వివరాలు

 • రాష్ట్రంలో రిజిష్టరైన వీధి వ్యాపారులు 5,18,912 లక్షల మంది
 • మొదటి విడత రుణ లక్ష్యం 3.40 లక్షల మంది
 • రుణం మంజూరైన వారు 3,64,549 లక్షల మంది
 • రుణాలు పొందిన వారు 3,45,102 లక్షల మంది
 • మంజూరైన రుణాలు రూ. 364.54 కోట్లు
 • పంపిణీ చేసిన రుణాలు రూ. 342 కోట్లు
 • రెండో విడత రుణ లక్ష్యం రూ. 300 కోట్లు

పీఎం స్వనిధి పథకంలో టాప్‌ 10 పట్టణాలు

 • మొదటి స్థానం సిరిసిల్ల
 • రెండవ స్థానం సిద్ధిపేట
 • మూడవ స్థానం కామారెడ్డి
 • నాల్గో స్థానం నిర్మల్‌
 • ఐదో స్థానం బోధన్‌
 • ఆరో స్థానం జహీరాబాద్‌
 • ఏడో స్థానం మంచిర్యాల
 • ఏనిమిదో స్థానం సంగారెడ్డి
 • తొమ్మిదో స్థానం పాల్వంచ
 • పదో స్థానం ఆర్మూర్‌