ఆరోగ్య రంగంలో అగ్రగామి
ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా విద్యా, వైద్యం ముఖ్యమైనవి. ఇది గమనించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ రెండు రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించి వాటికి నిధులు పెంచడమే కాకుండా, సరియైన ప్రణాళికలు రచించి అమలు పరచడం ప్రారంభించారు. అందులో భాగంగా వైద్య రంగంలో ఆసుపత్రులను మెరుగుపరచి, సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా కార్పోరేట్ స్థాయి సేవలు పొందేలా సౌకర్యాలను ఏర్పాటు చేశారు. దీనితో సామాన్యులే కాకుండా మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలను ఉపయోగించుకుని నాణ్యమైన వైద్యాన్ని పొందుతున్నారు. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజల సంఖ్య బాగా పెరిగిపోయింది. దీనితో వైద్య పరంగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్న రాష్ట్రంగా మన రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

ముఖ్యంగా మహిళల ప్రసూతి విషయంలో ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. దేశంలోనే తొలిసారిగా అయిదు మెటర్నిటీ ఐసీయూలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని చాలా చోట్ల ప్రసూతి ప్రత్యేక వైద్య శాలలను నెలకొల్పింది. 102 అమ్మఒడి వాహనాలను ఏర్పాటు చేసి మారుమూల పల్లెల నుంచి కూడా డెలివరీ కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు నిండు చూలాలిని తరలించే ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవిస్తే బాబు పుడితే రూ. 12 వేలు, పాప పుడితే రూ. 13 వేలు అందిస్తూ నగదు ప్రోత్సాహకాలను ఏర్పాటు చేసింది. దీనితో పాటు రూ. 2వేల విలువైన వస్తువులతో కేసీఆర్‌కిట్‌ను అందచేస్తున్నారు. ఈ కిట్‌లో శిశువుకు కావాల్సిన సబ్బులు, బట్టలు, నూనెలు, షాంపూలు సరఫరా చేయడంతో అది వారికి ఎంతో మేలు చేకూర్చింది. ఈ కేసీఆర్ కిట్‌తో జాతీయస్థాయిలో రాష్ట్రం గుర్తింపు తెచ్చుకున్నది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12.14 లక్షల మంది బాలింతలకు రూ. 190 కోట్లు ఖర్చు చేశారు. అలాగే నగదు ప్రోత్సాహకంగా రూ. 1020 కోట్లు అందచేశారు. ఈ పథకంతో మహిళలు ఇండ్లల్లో ప్రసూతి చేసుకునే సంఖ్య బాగా తగ్గిపోయి, ఆసుపత్రుల్లో డెలివరీల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈ చర్యలన్నింటితో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వివిధ సూచీలలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. నవజాత శిశు మరణాలు, బాలింత మరణాలు, అయిదేళ్ళ లోపు శిశువుల మరణాలను అరికట్టడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నది. గతంలో పేదరికం, రవాణా సౌకర్యాల లేమి కారణంగా తల్లి, పిల్లల మరణాలు ఎక్కువగా సంభవించేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక వీటిపై దృష్టి సారించింది. 2014`15 సంవత్సరంలో ప్రతి లక్ష జనాభాకు ప్రసూతి మరణాలు (ఎంఎంఆర్) 92గా ఉండేది. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల ఆ శాతం 2021`21కి 63కు తగ్గింది. ఈ స్థాయిలో తగ్గడం తెలంగాణలోనే సాధ్యమైంది. దేశంలోనే అత్యధికంగా 17.1 శాతం తగ్గుదల నమోదైంది. జాతీయ నగటు ఎంఎంఆర్ ప్రస్తుతం 113 గా ఉన్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడించింది.

శిశి మరణాల రేటు 2014`15లో 39 ఉండగా, 2020`21 నాటికి 26.4 శాతం తగ్గింది. అయిదేండ్ల లోపు చిన్నారుల మరణాల రేటు 25 శాతం నుంచి 16.8 శాతానికి వచ్చింది. సంస్థాగత కాన్పులు నాడు 91 ఉంటే, ఇప్పుడు 97కు పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు నాడు 30 శాతంగా ఉంటే, నేడు గణనీయంగా పెరిగి 97శాతానికి చేరుకున్నాయి. ఇదంతా తెలంగాణలో వైద్య రంగంలో వచ్చిన అభివృద్ధికి, ఆధునిక సౌకర్యాల కల్పనకు నిదర్శనంగా నిలుస్తున్నది. తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదనడంలో అతిశయోక్తి లేదు.