|

విద్యుత్‌ పంపిణీలో తెలంగాణ టాప్‌

విద్యుత్‌ పంపిణీలో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది. తెలంగాణకు చెందిన దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రకటించిన అవార్డుల్లో నాలుగు విభాగాల్లో మొదటి ర్యాంకుతో పాటు మరో అవార్డును కైవసం చేసుకుంది. మొత్తంగా ఆరు ర్యాంకులను సాధించింది.

ఇండియా ఎనర్జీ 15వ సమ్మిట్‌లో భాగంగా విద్యుత్‌ పంపిణీ, సంస్కరణలు, సమర్థత అంశాలపై వివిధ రాష్ట్రాల డిస్కం యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులతో ఆన్‌లైన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ క్యాటగిరీల్లో విద్యుత్‌ పంపిణీ సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డుల్లో తెలంగాణకు చెందిన ఎస్పీడీసీఎల్‌కు వివిధ విభాగాల్లో సమష్టి ప్రతిభ కనబరచినందుకు గాను మొదటి ర్యాంకు వచ్చింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలు, వినియోగదారుల సేవ, పనితీరు సామర్థ్యం విభాగాల్లో మొదటి ర్యాంకులు సాధించింది. గ్రీన్‌ ఎనర్జీ విభాగంలో మూడో ర్యాంకు వచ్చింది. ఓవరాల్‌గా మొదటి ర్యాంకు వచ్చింది. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్న వివిధ రాష్ట్రాల ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వాన్ని, రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలను అభినందించారు.

ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ఎస్పీడీసీఎల్‌ సీఎండీ
జీ.రఘుమారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడక ముందు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా మూడు నుంచి ఆరు గంటల వరకు కరంటు కోతలు ఉండేవన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశంతో 24 గంటలు అన్ని కేటగిరీల వారికి విద్యుత్‌ సరఫరా చేయగలుగుతున్నా మన్నారు. ఈ విజయానికి కారణమైన సీఎం కేసీఆర్‌, విద్యుత్‌ మంత్రి జగదీష్‌రెడ్డి, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.