జమ్ముకశ్మీర్ మహిళా సర్పంచ్‌ల ప్రశంసలందుకున్న తెలంగాణ పల్లెలు

రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను జమ్ముకశ్మీర్ మహిళా సర్పంచ్‌లు పరిశీలించి, ప్రశంసించారు. ఇలాంటి పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు జరగాలని వారు ఆకాంక్షించారు. తెలంగాణ పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. తెలంగాణ పల్లెలు సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా ఉన్నదన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని లఢక్‌కు చెందిన 35 మంది మహిళా సర్పంచ్‌లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ రూరల్ మండలం అంకుషాపూర్ గ్రామ పంచాయతీని సందర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పల్లెప్రకృతి వనం, డంపింగ్‌యార్డు, వైకుంఠధామం, నర్సరీలను సందర్శించారు. చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారుచేస్తున్న ప్రక్రియను పరిశీలించారు. పంచాయతీ అభివృద్ధికి నిధుల సమీకరణ, పన్నుల వసూళ్లు, పంచాయతీ రికార్డులు, గ్రామసభల నిర్వహణ తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా కార్యక్రమాల గురించి వీరికి జిల్లా సీఈవో దేవసహాయం, డీఎల్పీవో స్మిత, ఎంపీడీవో అరుణ, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, సర్పంచ్ జలజ, ఉప సర్పంచ్ బాలమణి తదితరులు పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధిని, ప్రభుత్వ ప్రోత్సాహాన్ని వివరించారు.