| |

మన పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు!

By: శ్రీ మార్గం లక్ష్మీనారాయణ

దేశ వ్యాప్తంగా పార్లమెంట్‌ సభ్యులు దత్తత తీసుకున్న సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (ఎస్‌ఎజివై) గ్రామాల్లో మన తెలంగాణ పల్లెలే దేశానికి పట్టు కొమ్మల్లా నిలిచాయి. నిర్ణీత అభివృద్ధి సూచీల ప్రమాణాలతో ఇచ్చిన ర్యాంకుల్లో దేశంలోని మొదటి పది గ్రామాల్లో 7 గ్రామాలు మనవే ఉన్నాయి. మొదటి 20 గ్రామాల్లో 11 గ్రామాలు మన గ్రామాలే ఉత్తమంగా ఎంపికై, దేశానికి ఆదర్శంగా నిలిచాయి. కేవలం పార్లమెంట్‌ సభ్యులు తమ నిధుల ఖర్చుతో చేసిన అభివృద్ధితోనే ఆయా గ్రామాలు అగ్రగామిగా నిలవలేదు. అలాగైతే, దేశంలో ఇంకా అనేక గ్రామాలు మన రాష్ట్ర గ్రామాలను వెనక్కి నెట్టి, మనకంటే ఉత్తమ ర్యాంకులు సాధించి ఉండేవి. కానీ, అలా జరగలేదు.

సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (ఎస్‌ఎజివై) పథకం అక్టోబర్‌ 2014లో ప్రారంభమైంది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం కింద ఒక్కో పార్లమెంట్‌ సభ్యుడు ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటారు. ఆ గ్రామ ప్రజలను అభివృద్ధి లో భాగస్వాములను చేస్తూ సామాజిక స్ఫూర్తితో పార్లమెంట్‌ సభ్యుడి నేతృత్వంలో సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ, శాస్త్రీయ పద్ధతిలో గ్రామ అభివృద్ధిలో భాగంగా, మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల అభివృద్ధి, జీవన అవకాశాల మెరుగు వంటి లక్ష్యాల సాధనకు గ్రామ సమగ్ర అభివృద్ధికి పాటుపడటం ప్రధానం.

గ్రామాల ఎంపిక
గ్రామం ఒక యూనిట్‌గా, 3000 నుంచి 5000 జనాభా కలిగిన, అత్యంత వెనుకబడిన, గిరిజన, కొండ ప్రాంతాలను ఎంపిక చేస్తారు. పార్లమెంట్‌ సభ్యుడు, ఇలాంటి గ్రామాలను ఎంపిక చేసుకోవడానికి స్వేచ్ఛ వుంటుంది. వ్యక్తిత్వ వికాసం, సామాజిక, ఆర్థిక, పర్యావరణ, మానవ వనరుల అభివృద్ధి, సామాజిక భద్రత, మంచి పరిపాలనతో కనీస వసతుల కల్పన వంటి అంశాలకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇవ్వాలి.

తెలంగాణ ఎంపీలు దత్తత తీసుకున్న గ్రామాలు
ఇలా సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (ఎస్‌ఎజివై) పథకం మార్గదర్శకాలతో మన ఎంపీలు తీసుకున్న గ్రామాలే దేశంలో ఉత్తమ గ్రామాలుగా స్కోర్‌ చేశాయి. ఒక్కో గ్రామం 100కు 85.94 పాయింట్ల నుంచి 90.25 పాయింట్ల వరకు స్కోర్‌ చేయడమంటే మామూలు విషయం కాదు.

కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం వెన్నంపల్లి గ్రామం దేశంలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ గ్రామాన్ని ఎంపీ కెప్టెన్‌ ఒడితెల లక్ష్మీకాంత రావు దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌ కుమార్‌ దత్తత తీసుకున్న కరీంనగర్‌ జిల్లా బెజ్జంకి మండలం గన్నేరు వరం, ఇదే జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామాలు కూడా టాప్‌ టెన్‌లో 3,5 స్థానాల్లో నిలిచాయి. ఎమ్మెల్సీ కవిత గతంలో నిజామాబాద్‌ ఎంపీగా దత్తత తీసుకున్న రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామం 4వ స్థానంలో నిలిచింది. జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ దత్తత తీసుకున్న నిజామాబాద్‌ జిల్లా జుక్కల్‌ మండలం కౌలాస్‌ గ్రామం 2వ స్థానంలో నిలిచింది. అలాగే కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్‌ గ్రామం 9వ స్థానాన్ని, నిజామాబాద్‌ జిల్లా నిజామాబాద్‌ మండలంలోని తానాకుర్ద్‌ గ్రామం 10వ స్థానాన్ని దక్కించుకున్నాయి.

మరి తెలంగాణ పల్లెలకే ఇంత స్కోర్స్‌ ఎందుకు వచ్చాయి? దేశంలోని మిగతా గ్రామాలకు సాధ్యం కాని ప్రగతి మన పల్లెలకే ఎందుకు దక్కింది? మన గ్రామాలే దేశానికి ఎందుకు ఆదర్శంగా నిలిచాయి? అంటే, వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. అదే పల్లె ప్రగతి. పల్లెల ప్రగతికి పట్టం కట్టిన పల్లె ప్రగతి పథకం. సిఎం కెసిఆర్‌ మానస పుత్రిక ఈ పథకం.

గాంధీజీ ఆశయం… కెేసీఆర్‌ ఆచరణ
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు… ఇది నానుడి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందు తుంది… ఇది గాంధీజీ నానుడి. మనది గ్రామీణ భారతం కాబట్టి, గ్రామాల స్థాయి నుంచే అభివృద్ధి జరగాలని దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీజీ ఆశించారు. కానీ 70 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎవరూ సాధించలేనిది కేసీఆర్‌ సాధించి చూపారు. గాంధీజీ ఆశయాన్ని ఆచరణలో పెట్టిన అపర గాంధీజీ కేసీఆరే.

60 ఏండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆవిష్కారం చేశారు. పంట పొలాలకు సాగునీరు, ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు, పచ్చదనం, పరిశుభ్రతతో… ప్రత్యేక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సాకారం చేశారు. పల్లె ప్రగతితో పల్లెలకు పట్టం కట్టారు. పచ్చదనం పరిశుభ్రతను పరుచుకున్న పల్లెలు ఈ రోజు స్వయం సమృద్ధిగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి నూతన చట్టాన్ని తేవడమే గాక, అనేక సంస్కరణలు తెచ్చింది. తండాలను పంచాయతీలుగా మార్చి, గ్రామానికో కార్యదర్శిని నియమించడమే గాక, పదోన్నతులు కల్పించి, సిబ్బంది వేతనాలు పెంచింది.

పల్లె ప్రగతి పథకం
ఒకవైపు సంక్షేమ పథకాలతో పేదలను ఆదుకుంటూనే వారి కొనుగోలు శక్తిని బాగా పెంచారు. మరోవైపు అభివృద్ధి పథకాలతో రాష్ట్ర ఆర్థిక ప్రగతిని సాధించారు. దీంతో రాష్ట్రంలో జీవన ప్రమాణాలు బాగా పెరిగాయి. ఈ పురోగతి మహా క్రతువులో భాగంగా అనేక కొత్త పథకాలు పుట్టుకు వచ్చాయి. అందులో ఒకటి పల్లె ప్రగతి. పల్లెప్రగతి కార్యక్రమం 2019 సెప్టెంబర్‌ 6న ప్రారంభమైంది. పల్లెల ప్రగతికి పట్టం కట్టిన ఈ పథకం పల్లెల పాలిట వరంగా మారింది. పల్లెల రూపు రేఖలనే మార్చేసింది. పల్లెప్రగతి ఓ వినూత్న సమగ్ర గ్రామీణ విధానం.

తెలంగాణలోని ప్రతి పల్లె దేశంలోనే ఆదర్శంగా నిలవాలనేది ఆశయం. పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలనేది లక్ష్యం. ప్రణాళికా బద్ధంగా గ్రామాలు అభివృద్ధి చెందాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. 4 విడతలుగా నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని 12,769 గ్రామాల్లో మౌలిక వసతులైన ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్‌, నర్సరీలు, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాలు, పల్లెప్రకృతి వనాలు, బహత్‌ పల్లెప్రకృతి వనాలు ఏర్పాటయ్యాయి. పరిపాలనా సంస్కరణల వల్ల కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక సంఘం నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు జమచేసి, గ్రామ పంచాయతీలకు ఇవ్వడం వల్ల ప్రతిచిన్న పంచాయతీకి కూడా కనీసం 5లక్షల నిధులు సమకూరాయి. పనుల నిర్ణయం, అమలు బాధ్యత గ్రామ పంచాయతీలకే అప్పగించడంతో పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టింది.

పల్లె ప్రగతి సైన్యం
పల్లె ప్రగతి కార్యక్రమం కింద దేశంలోనే తొలిసారిగా, 12,769 గ్రామాల్లో స్టాండిరగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామంలో వర్క్స్‌ కమిటీ, సానిటేషన్‌ కమిటీ, స్ట్రీట్‌ లైట్స్‌ కమిటీ, గ్రీన్‌ కవర్‌ కమిటీలను వేశారు. ఈ కమిటీల్లో 8,20,727 మంది ప్రజలను భాగస్వాములను చేశారు. అందులో 4,03,758 మంది మహిళలు ఉన్నారు.

పల్లె ప్రగతి నిరంతర కార్యక్రమం
పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా నిర్వహిస్తున్నది. పచ్చదనం పరిశుభ్రతను పెంచే విధంగా నిరంతరం గ్రామాల్లో పారిశుధ్యం, మొక్కలు నాటి, వాటిని సంరక్షించే విధంగా చూస్తున్నది. డంపింగ్‌ యార్డుల్లో తడి పొడి చెత్తల ద్వారా ఎరువులు తయారు చేసి గ్రామ పంచాయతీలు ఆర్థికంగా బలపడే విధంగా చేస్తున్నారు. 230 కోట్ల మొక్కలు నాటి అందులో 95శాతం మొక్కలను బతికించి గ్రీనరీని పెంచుతున్నారు. మొత్తం బడ్జెట్‌లో 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌ను ఏర్పాటు చేయడం వల్ల, వినూత్నంగా విశేషంగా నిర్వహించిన హరిత హారానికి తోడై… పల్లెలకు ఆకు పచ్చల హారంగా మొక్కలు ఏర్పడ్డాయి. దేశంలో మరెక్కడా లేని విధంగా మన తెలంగాణలో 4శాతం గ్రీనరీ పెరిగిందనే విషయాన్ని ఈ మధ్యే కేంద్రం ప్రకటించింది. ఈ విజయం వెనుక సిఎం కేసీఆర్‌తోపాటు, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉంది.

నిజానికి పల్లె ప్రగతి కార్యక్రమం లేకపోతే, సన్సద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన పథకానికి ఫలితాలు ఈ విధంగా ఉండేవి కావు. ఈ పథకం కింద తెలంగాణ గ్రామాలే ఇంతగా స్కోర్‌ చేసి ఎంపిక అయ్యేవి కావు. అందుకే దేశంలో పార్లమెంట్‌ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాల్లో మొదటి 10 గ్రామాల్లో ఏకంగా 7 గ్రామాలు, మొదటి 20 గ్రామాల్లో 11 గ్రామాలు తెలంగాణవే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణకు స్వచ్ఛ, ఉత్తమ గ్రామ, మండల, జిల్లా అవార్డులెన్నో మన రాష్ట్రానికి వచ్చాయి. ఆ అవార్డులు రివార్డులే ఇందుకు నిదర్శనం.