జాతీయస్థాయిలో మన పల్లెకు గుర్తింపు

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అలాంటి పల్లెలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్ది, పల్లెటూరి సొగసులను ప్రపంచానికి పరిచయం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి పాలకుల వైఫల్యంతో ఎదుగుబొదుగు లేని పల్లెలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొలువు తీరడంతో పచ్చదనంతో వెల్లివిరుస్తున్నాయి.  గత ఎనిమిది సంవత్సరాలుగా సీఎం కేసీఆర్‌ పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. పల్లెలు, గ్రామాల్లో ప్రజలు ఏ సౌకర్యాల లేమితో బాధపడుతున్నారో గ్రహించి వాటిని సమకూర్చడానికి బృహత్తర ప్రణాళికలు రచించారు. అందులోంచి పుట్టిందే పల్లె ప్రగతి.

ఈ పల్లెప్రగతి కార్యక్రమం వల్ల తెలంగాణ పల్లెలు అన్ని రంగాల్లోను దూసుకుపోయి దేశస్థాయిలో ఇచ్చే ఎన్నో బహుమతులు గెలుచుకుని, అవార్డులు అందుకొన్నాయి. సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (ఎస్‌ఏజీవై) పథకం అమలులో జాతీయస్థాయిలో ఇచ్చే ర్యాంకుల్లో దేశంలో టాప్‌ 20లో తెలంగాణ రాష్ట్రంలోని 19 గ్రామాలు బహుమతులు గెలుచుకోవడం గ్రామాభివృద్ధిలో ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. దేశంలోని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో అవార్డులను ప్రకటించినా.. అందులో తెలంగాణ పల్లెలు లేకుండా ఉండటం లేదు. ఆదర్శ గ్రామాలు, సాగి గ్రామాలు, ఈ-పంచాయతీ, ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలు, ఈ-పంచాయతీ, రూర్బన్‌ క్లస్టర్‌, ఆన్‌లైన్‌ ఆడిట్‌.. ఇట్లా పేరు ఏదైనా సరే.. తెలంగాణ పంచాయతీలదే పైచేయి.

ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గ్రామాల్లో నిధుల కొరత రావద్దని,  వీధులు శుభ్రంగా ఉండాలని, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలని, విద్యుత్‌ సరఫరా నాణ్యతతో జరగాలని, మంచినీటి సరఫరా నల్లాల ద్వారా ఇంటింటికీ జరగాలని, గ్రామీణ భారతం ఉజ్వలంగా వెలిగి పోవాలని ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించారు. పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని చేపట్టి అధికారులను గ్రామాల వైపు ఉరుకులు, పరుగులు పెట్టించారు. గ్రామాల్లో, పల్లెల్లో ఎక్కడ చెత్తా, చెదారం కనపడవద్దని, పాత బావులను పూడ్చివేయాలని, మురికి తుమ్మలు కానరావద్దని, మురుగుకాలువల్లో మురుగునీరు నిలువ ఉండకుండా వెల్లిపోవాలని,  గ్రామాల్లో పెద్ద ఎత్తున చెట్లునాటి ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీటికి ఎన్ని వేల కోట్ల నిధులైన వెచ్చించడానికి సిద్దంగా ఉన్నట్లు సీఎం ప్రకటించారు. దీనితో అధికారులల్లోను, గ్రామ సర్పంచ్‌లలోను కదలిక మొదలైంది.

గ్రామ కార్యదర్శులు ప్రతి గ్రామానికి నియమించబడ్డారు. గ్రామాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తు పల్లె ప్రగతి ముందుకు సాగింది.  ఈ కార్యక్రమం మొదటి విడతగా సెప్టెంబరు 6, 2019 నుంచి అక్టోబరు 5 వరకు కొనసాగింది. రెండవ విడత జనవరి 2, 2020 నుంచి జనవరి 10 వరకు సాగింది. మూడవ విడత కార్యక్రమం 2020, జూన్‌ 1 నుంచి 10 వరకు సాగింది. నాలుగో విడత కారక్రమం 2021, జులై 1 నుంచి 10 వరకు సాగింది. అయిదో విడత 2022,  జూన్‌ 3 నుంచి జరగనుంది.

మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా..

పల్లె ప్రగతి కార్యక్రమం ముఖ్యంగా గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. మంచినీటి సరఫరా మెరుగుపరచడం, నాణ్యమైన విద్యత్తు అందించడం, మురుగునీటి కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, అంతర్గత రోడ్ల నిర్మాణం, వీధి దీపాలు, పాత బావులు, బోరుబావులు పూడ్చడం తదితర పనులు ప్రాముఖ్యంగా తీసుకున్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో అంటురోగాలు రాకుండా జాగ్రత్త పడడం, ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం, వైకుంఠ దామాలు (స్మశానవాటికలు), డంప్‌ యార్డులు ఏర్పాటు చేయడం, తడి`పొడి చెత్తను వేరుచేయడం, ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ ఏర్పాటు చేసి ఇండ్లలో చెత్తను తరలించడం, చెట్లకు నీరు పోయడం తదితర కార్యక్రమాలు చేపట్టారు.

రూ. 17,398 కోట్ల ఖర్చు

dav

ఆరు విడతల పల్లె ప్రగతి కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 17,398 కోట్లు ఖర్చు చేసింది. మౌలిక సదుపాయాలు కల్పించింది. దీంతో ప్రతి పల్లె, ప్రతి గ్రామం పరిశుభ్రంగా మారిపోయింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఈ మార్పునకు జీవం పోసింది. ఈ చట్టం అనేక కార్యక్రమాలను తప్పనిసరి చేసింది. నాటిన మొక్కల్లో 85 శాతం బతకాలి. దీని కోసం గ్రీన్‌ బడ్జెట్‌ కింద 10 శాతం నిధులు కేటాయించాలని నిబంధన విధించడంతో ప్రజాప్రతినిధుల జవాబుదారీ పెరిగింది. మొక్కలు బతకకుంటే సర్పంచ్‌లను బాధ్యులను చేయడంతో అలసత్వం తగ్గింది. పల్లెప్రగతి ప్రారంభం నాటి నుంచి అన్ని గ్రామాలకు నగదు రూపంలో.. పథకాల రూపంలో రూ.17,398 కోట్లు అందాయి. వీటిలో అత్యధికంగా రూ.9,560 కోట్లు నేరుగా నగదు రూపంలో ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమఅయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుందో అంతే మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో వేస్తున్నది. అంటే రూ.9,560 కోట్లు రాష్ట్రంనుంచి జమ అయ్యాయి. వైకుంఠధామాల నిర్మాణానికి రూ.1,557 కోట్లు, సీసీ రోడ్లకు రూ.2,265 కోట్లు ఖర్చు చేశారు. ట్రాక్టర్లకు రూ.1,270 కోట్లు ఖర్చు చేశారు.

పెరిగిన ఆస్తిపన్ను వసూలు శాతం

గ్రామాలలో ఆస్తిపన్ను వసూలు కూడా పెరిగింది. 2014ా15 సంవత్సరంలో 63శాతం ఉన్న ఆస్తిపన్ను వసూలు, 2021`22లో 97.18 శాతానికి చేరిందంటే ప్రజల్లో ప్రభుత్వానికి పన్నులు చెల్లించాలనే స్పృహ కూడా పెరిగిందని తెలిసిపోతున్నది. గత ఆర్థిక సంవత్సరంలో సిద్ధిపేట, నారాయణపేట, కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో వందశాతం ఆస్తిపన్ను వసూలైంది. ఇలా పల్లె ప్రగతి గ్రామీణ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపగా, ప్రభుత్వ పరంగా కూడా ఆస్తిపన్ను పెరిగి ఆదాయం కూడా సమకూరిందని చెప్పవచ్చు.