సివిల్స్‌లో మెరిసిన తెలంగాణ యువత
సివిల్ సర్వీసెస్ (యుపీఎస్‌సీ) పరీక్షల్లో తెలంగాణ యువత జయ కేతనం ఎగురవేసింది. 2020 సంవత్సరం సివిల్ సర్వీసెస్ తుది ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన శ్రీజ జాతీయస్థాయిలో 20వ ర్యాంకు సాధించి రాష్ట్ర ప్రాభవాన్ని చాటింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించి సివిల్స్‌కు ఎంపికయ్యారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి విజయం సాధించిన వారిలో హైదరాబాద్ ప్రగతి నగర్‌కు చెందిన మౌనిక 75వ ర్యాంకు సాధించింది. అలాగే హైదరాబాద్‌కు చెందిన కంకణాల రాహుల్‌రెడ్డి 218వ ర్యాంకు, అందాసు అభిషేక్ 616వ ర్యాంకు సాధించారు. హన్మకొండ జిల్లాకు చెందిన ఆడెపు వర్షిత 413వ ర్యాంకు సాధించారు.

20వ ర్యాంకు సాధించిన శ్రీజ మాట్లాడుతూ ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచి 2019లో మెడిసిన్ పూర్తి చేసినట్లు తెలిపారు. మెడికల్ సైన్స్ ఆప్షనల్‌గా సివిల్స్‌కు ప్రిపేరయ్యానని తెలిపారు. తాను ఆడుతూ, పాడుతూ సివిల్స్ పూర్తి చేశానని, ఇష్టపడితే కష్టమనిపించదని అన్నారు. సివిల్స్ సిలబస్ కూడా తాను చదువుతున్న కొద్ది ఆసక్తిని రేకెత్తించిందన్నారు. ‘‘నేను కలెక్టర్ కావాలని మా నాన్న శ్రీనివాస్ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు’’ అని శ్రీజ తెలిపారు.

413వ ర్యాంకు సాధించిన ఆడెపు వర్షిత మాట్లాడుతూ.. ‘‘మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. నాన్న రాజకట్టమల్లు చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతుంటారు. అమ్మ రాధారాణి గృహిణి. టైలరింగ్ చేస్తూ నన్ను, అక్కను చదివించారు. మాది హన్మకొండ జిల్లా సూర్యరాయపుర’’ అని తెలిపారు. నేను 2017లో సీబీఐటీలో బీటెక్ చేశాను. సివిల్స్ రాయడం ఇది మూడో సారి. ఈసారి ఢల్లీిలో పది నెలల పాటు శిక్షణ తీసుకున్నాను. 413వ ర్యాంకుతో ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది. కానీ నా లక్ష్యం ఐఏఎస్ కొట్టడం. అందుకే మరోసారి సివిల్స్ రాయాలను కుంటున్నాను. అని చెప్పింది.
ఐఎఎస్ కావడమే తన లక్ష్యమని, ఇప్పుడు తనకు వచ్చిన ర్యాంకు 616తో ఐఎఎస్ రాదని, అందుకే మరోసారి సివిల్స్ రాయాలనుకుంటున్నానని 616 ర్యాంకు సాధించిన హైదరాబాద్‌కు చెందిన అందాసు అభిషేక్ తెలిపారు.

ఐఎఎస్ కావాలన్నది తన లక్ష్యమని 218వ ర్యాంకు సాధించిన కంకణాల రాహుల్‌రెడ్డి తెలిపారు. తనకు మొదటి ప్రయత్నంలో తాను అనుకున్న ర్యాంకు రాలేదని, రెండవ ప్రయత్నంలో విజయం సాధించానని తెలిపారు. నాన్న ఎల్‌ఐసీ ఏజెంట్ కాగా, అమ్మ గృహిణి అని తెలిపారు.