ఇష్టా అధ్యక్షుడిగా తెలంగాణ బిడ్డ

ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార సంస్థ ముఖ్య ఉద్దేశం అయిన ‘‘అందరికీ ఆహారం’’ అనే నినాదం కార్యరూపం దాల్చి, ఆహార ఉత్పత్తులు గణనీయంగా పెరిగి ఆహార భద్రత కల్పిచాలంటే వ్యవసాయ రంగంలో ఉత్పత్తుల పరిమాణాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకు కావలసింది నాణ్యమైన విత్తనం అందుకే ‘‘నాణ్యమైన విత్తనం – అధిక దిగుబడులకు మూలం’’ అంటారు.

వ్యవసాయంలో దిగుబడులను పెంచడంలో నాణ్యమైన విత్తనం అనేది ఎంతో కీలకమైన పాత్రను పోషిస్తుంది. కేవలం ఒక నాణ్యమైన విత్తనం 10 నుంచి 20శాతం దిగుబడులను పెంచే అవకాశం ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విత్తనం ప్రమాణాలు, పద్ధతులను నిర్దారించడంలో అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ ప్రముఖ పాత్రను పోషిస్తుంది.

తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారం:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015 లో నిర్వహించిన విత్తన కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారంగా రూపుదిద్దుకోవటానికి ఒక పునాదిని, రోడ్‌ మ్యాప్‌ను వేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం విత్తనాన్ని ఒక ప్రత్యేక అంశంగా పరిగణించి ఎన్నో విత్తన రంగ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విత్తనోత్పత్తిదారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి వర్క్‌ షాప్‌లు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది, అంతేకాకుండా, రాష్ట్రంలో విత్తన సంస్థల బలోపేతానికి కూడా అప్పుడే శ్రీకారం చుట్టింది.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విత్తన భాండాగారంగా విరాజిల్లడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దృష్టి, సహకారంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో సహజ సిద్ధంగా నాణ్యమైన విత్తన తయారీకి కావలిసిన అనువైన వాతావరణ పరిస్థితులు, పుష్కలమైన వనరులు, సాంకేతిక అనుభవం కలిగిన రైతులు ఉన్నారు. అందువల్లనే దాదాపు 400లకు పైగా విత్తన కంపెనీలు తమ కార్పొరేట్‌ ఆఫీస్‌లను, గోదాములను, సీడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను హైదరాబాద్‌ చుట్టుపక్కల నెలకొల్పి వాటి కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం దేశ రైతాంగానికి కావలిసిన 60శాతం విత్తనాలను సరఫరా చేయడమే కాకుండా, విదేశాలకు కూడా విత్తనాలను ఎగుమతి చేస్తూ ‘‘ప్రపంచ విత్తన భాండాగారంగా’’ గుర్తింపు పొందింది.

అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఐఎస్‌టిఎ) అంతర్జాతీయంగా ఒకే రకమైన విత్తన పరీక్ష ప్రమాణాలను నిర్ణయించడం కోసం 1924 లో జ్యురిచ్‌ (స్విట్జర్లాండ్‌)లో ఇష్టా ఆవిర్భవించింది. ఈ సంస్థ ఆయా దేశాల ప్రభుత్వాలకు అనుసంధాన కర్తగా ఉండి, విత్తన శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధనలు జరిపి వివిధ పంటలలో అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాలను, పద్ధతులను రూపొందించి విత్తన వాణిజ్యాన్ని పెంపొందించడంలో ఒక కీలక అంతర్జాతీయ స్థాయి సంస్థగా ISTA పేరొందింది.

ఇష్టా వలన కలిగే ప్రయోజనాలు:

వ్యవసాయ వృత్తిని రైతులకు లాభసాటిగా ఉండేవిధంగా ప్రభుత్వ విధానాలను,  చట్టాలను రూపొందించి నాణ్యమైన విత్తనాలు అందించేందుకు తోడ్పడుతుంది. విత్తనాలలో నాణ్యత పరంగా ప్రపంచవ్యాప్తంగా ఏకీకృతను సాధించి, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విత్తన పరీక్ష చేసి, మంచి నాణ్యమైన విత్తనాలను రైతులకు సరఫరా చేసి అధిక దిగుబడిని సాదించేందుకు తోడ్పడుతుంది. విత్తన పరీక్ష విధానాలను, విత్తన పరీక్షా కేంద్రాలను మెరుగుపరుచుకుని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకోవచ్చు. విత్తన పరీక్ష కేంద్రాలకు అంతర్జాతీయమైన గుర్తింపు లభించటంతో, మన విత్తనాలకు కూడా విదేశాలలో మంచి డిమాండ్‌ పెరిగే ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి చేసే విత్తనాలకు అంతర్జాతీయంగా ఎగుమతి విలువ పెరుగుతుంది. తద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని పొంది, విత్తన వాణిజ్యాన్ని పెంపొందించుకొని, విత్తన పరిశ్రమ అభివృద్ధికి దోహద పడుతుంది. విత్తనోత్పత్తి దారులకు, విత్తన రైతులకు నమూనాల సేకరణ, పరీక్ష పద్ధతులపై అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ ఇవ్వటానికి ఉపయోగపడుతుంది.

ISTA తో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక అనుబంధం:

విత్తన నమూల సేకరణ, విత్తన పరీక్ష పద్ధతులపై ప్రత్యేక వర్క్‌ షాప్‌ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ISTA, తెలంగాణ ప్రభుత్వం అనుబంధంగా పలు విత్తన రంగ అభివృద్ది కార్యక్రమాలను చేపట్టింది. ముఖ్యంగా 2016లో అంతర్జాతీయ విత్తన ప్రముఖులతో ISTA వారి సహకారంతో విత్తన నమూల సేకరణ, విత్తన పరీక్ష పై విత్తనోత్పత్తి దారులకు, విత్తన అనుబంధ ఆఫీసర్లకు ప్రత్యేక వర్క్‌ షాప్‌ నిర్వహించడం జరిగింది. 

తెలంగాణ నుంచి 2ISTA లో ముఖ్యపాత్ర వహించిన డా. కేశవులు:

ISTA వారు నియమించిన ఎన్నో సాంకేతిక కమిటీలు, వర్కింగ్‌ గ్రూపులలో తెలంగాణ నుంచి డా. కేశవులు సభ్యునిగా ఉండి, విత్తన పరిశోధనలు, పరీక్ష పద్దతులు, ప్రమాణాల రూపకల్పనలో పాల్గొని, తరువాత, ISTA కార్యనిర్వాహక కమిటీలో భారత ప్రభుత్వం తరపున సభ్యునిగా కూడా సేవలు అందించటం జరిగింది.

రాష్ట్రంలో ISTA అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం ఏర్పాటు:

తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, విత్తన ఎగుమతికి సంబంధించిన అన్నీ పరీక్షలు చేసి, విత్తనోత్పత్తి దారులకు సేవలు అందించడానికి వీలుగా, హైదరాబాద్‌, రాజేంద్రనగర్‌లో అంతర్జాతీయ హంగులతో ‘‘తెలంగాణ అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం’’ (Telangana International Seed Testing Authority-TISTA) పేరుతో విత్తన పరీక్ష ప్రయోగశాల నిర్మించడం జరిగింది. అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ ISTA 33 వ అంతర్జాతీయ విత్తన సదస్సు, విత్తన పరీక్షలో అధునాతనలు, ఆవిష్కరణలు అనే అంశంపై, అంతర్జాతీయ విత్తన సదస్సు ఈజిప్ట్‌లోని, కైరోలో జరిగింది.

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రికి ISTA ప్రత్యేక ఆహ్వానం ఈజిప్ట్‌ కైరోలో జరిగిన 33వ అంతర్జాతీయ విత్తన సదస్సుకు రావాల్సిందిగా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డికి ISTA ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈజిప్ట్‌ దేశ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచన మేరకు ISTA అధ్యక్షుడిగా డా. కేశవులు ఎన్నికైన ప్రత్యేక సమావేశంలో పాల్గొని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న విత్తన రంగ అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ విత్తన పరిశ్రమ సామర్థ్యం, తెలంగాణలో నాణ్యమైన విత్తనోత్పత్తికి ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాల గురించి మంత్రి నిరంజన్‌ రెడ్డి. ప్రసంగించారు.

ISTA అధ్యక్షుడిగా (2022-25) బాధ్యతలు చేపట్టిన తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. కేశవులు  2019 నుండి 2022 వరకు ISTA వైస్‌ ప్రసిడెంట్‌గా సేవలు అందించిన తెలంగాణ ప్రాంత విత్తన శాస్త్రవేత్త, అంతర్జాతీయ విత్తన నిపుణుడు డాక్టర్‌ కె. కేశవులు ఆసియా ఖండం నుండి మొట్ట మొదటి ISTA అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది.

అదేవిధంగా, అమెరికా నుండి వైస్‌ ప్రెసిడెంట్‌ తో పాటు మరో 9 మంది ISTA మెంబర్లుగా ఉండి, 2022 నుండి 2025 వరకు ప్రపంచ వ్యాప్తంగా విత్తన ప్రమాణాలు, విత్తన నాణ్యతా, విత్తన రంగ అభివృద్ధికి సేవలు అందించనున్నారు.

డా. కేశవులును ప్రశంసించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ :

ఆసియా ఖండంలోనే తొలిసారిగా ఒక అంతర్జాతీయ స్థాయి విత్తన సంస్థకు తెలంగాణ ప్రాంత శాస్త్రవేత్త అధిపతిగా ఎంపికవటం తెలంగాణ విత్తన రంగానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు లభించిందని సీఎం కేసీఆర్‌ అభినందించారు. అదేవిధంగా FAO లాంటి అంతర్జాతీయ స్థాయి ఐక్యరాజ్య సమితి సంస్థ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన భాండాగారంగా గుర్తించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఆసియా ఖండంలో తొలిసారిగా ISTA ప్రెసిడెంట్‌గా తెలంగాణ ప్రాంతం నుంచి ఎంపికవటం, ఒక్క తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్‌ భారతావనికి కూడా విత్తన రంగంలో అంతర్జాతీయంగా మంచి కీర్తి లభించింది. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దాలనే మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిరకాల స్వప్నం ప్రకారం తెలంగాణ నుంచి మరిన్ని విత్తన ఎగుమతులు పెంచటానికి, ముఖ్యంగా, మన రాష్ట్ర రైతాంగానికి అత్యున్నత ప్రమాణాలు కలిగిన నాణ్యమైన విత్తనాలను అందించి, అధిక దిగుబడులు సాధించడానికి ఇది ఎంతగానో తోడ్పడనున్నది

– మంత్రి నిరంజన్‌ రెడ్డి.

ISTA ప్రసిడెంట్‌గా ఎంపికైన సందర్భంగా డా. కేశవులు స్పందన

రాష్ట్ర ఏర్పాటు తరువాత తెలంగాణ ప్రభుత్వం విత్తనాన్ని ఒక ప్రత్యేక అంశంగా భావించి చేపట్టిన ప్రతీ అభివృద్ధి కార్యక్రమంలో వివిధ హోదాల రూపంలో ఎన్నో బాధ్యతలను నిర్వర్తించే అవకాశం నాకు కల్పించడం వలన దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నాకు ఈ గుర్తింపు లభించింది. ఈ రోజు ఒక అంతర్జాతీయ స్థాయి విత్తన సంస్థకు ప్రెసిడెంట్‌గా ఎంపికవటం ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టను పెంచడం జరిగింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, అదేవిధంగా ఎల్లపుడు మాకు దిశ నిర్దేశం చేస్తూ, సలహాలు సూచనలు ఇస్తూ, నేనే ఈ రోజు ఈ స్థాయికి ఎదగడానికి సహకరించిన తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి గారికి, అదే విధంగా భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖకు పేరు పేరున ధన్యవాదాలు.

ప్రస్తుతం భారత దేశంలో విత్తన పరీక్ష ల్యాబ్‌ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది, వాటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా విత్తన పరీక్ష ల్యాబ్‌ లకు కావలిసిన అధునాతన పరికరాలను, మౌలిక సదుపాయాలను కల్పించి విత్తన పరీక్ష సామార్థ్యాన్ని పెంచుకోవాలి