నగరం సుందరం… ఆహ్లాదం… ఆనందం!
హైదరాబాద్ మహానగరంలో పచ్చదనం (గ్రీనరి) పెంచి, సుందరీకరణ పనులలో భాగంగా వివిధ రకాల మొక్కలు, ఆకర్షణీయ పూల మొక్కలు ఏర్పాటు చేశారు. తద్వారా ఉష్ణోగ్రతను తగ్గించడం, కాలుష్యాన్ని నివారించి ప్రజలకు చక్కటి వాయువును అందించే ప్రయత్నం జరుగుతున్నది. ఫ్లై ఓవర్, స్కైవేల క్రింద మధ్యభాగంలో, పిల్లర్లకు వర్టికల్ గార్డెన్ అలంకరించడం వలన వాహనదారులతో పాటు పాదచారులకు ఆహ్లాదకరంగా మారింది. పచ్చదనంలో భాగంగా వినూత్న పద్ధతిలో వర్టికల్ గార్డెన్లను ముమ్మరంగా చేపట్టారు. ముఖ్యంగా ఫ్లై ఓవర్లు, స్కైవేలలో క్రింది భాగానా పిల్లర్లను వర్టికల్ పద్ధతిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
నగరంలో అందుబాటులోకి వచ్చిన 11 ఫ్లై ఓవర్ లైన ఖైరతాబాద్ జంక్షన్, మూసి బ్రిడ్జి, నాగోల్, కూకట్పల్లి దగ్గర మొత్తం 10 ఫ్లై ఓవర్లకు సంబంధించిన 44 పిల్లర్లను సుందరీకరణ చేయడం మూలంగా కాలుష్య నివారణతో పాటు ఉష్ణోగ్రతను తగ్గించేందుకు దోహదపడుతోంది. అంతేకాకుండా మరి కొన్ని ఫ్లై ఓవర్లు, వివిధ రకాల బ్రిడ్జిలకు, ఫ్లై ఓవర్లు అయిన నల్గొండ x రోడ్డు, టోలిచౌకి, లంగర్ హౌస్, జె.యన్.టి.యు, బయోడైవర్సిటీ, గచ్చిబౌలి (L1, L2) రోడ్డు నంబర్ 45 ఫ్లై ఓవర్లు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ప్రకృతి సిద్ధంగా ఉండే పచ్చదనంతో సుందరీకరణ చేపట్టారు. కొత్తగా ప్రారంభించిన అబ్దుల్ కలాం (మిధాని – ఓవైసీ హాస్పిటల్ జంక్షన్) ఫ్లై ఓవర్ క్రింది భాగంలో వర్టికల్ గార్డెన్ అందరినీ ఆకర్షిస్తున్నది. హైదరాబాద్లో అతి పెద్ద షేక్పేట్ బ్రిడ్జి క్రింది భాగంలో మొట్ట మొదటి సారిగా గార్డెన్ ఏర్పాటు చేశారు. అందులో సిట్టింగ్ కుర్చీలు ఏర్పాటు, వాకింగ్ ట్రాక్ నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉంచారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డిలు హరితహారం కార్యక్రమం అమలులో వందకు వంద శాతం విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. జనవరి మాసం నుండి ప్రతి శుక్రవారం గ్రీన్ డే పాటించేందుకు వీలుగా మేయర్ చర్యలు చేపట్టారు.