ప్రకృతితో అనుబంధమే హోలీ పండుగ పరమార్థం

By: డా॥ భిన్నూరి మనోహరి

హోళీ పండుగ ప్రకృతితో, కాలంతో ముడిపడి ఉన్న పండుగ. కాలగమనంలో వసంతఋతువుకు సంబంధించిన ఈ పండుగ ఫాల్గుణ పూర్ణిమనాడు జరుపుకుంటాము. హోళి, హోళికా పూర్ణిమ, కామ దహనం, హుతాశనీ పూర్ణిమ, డోలికా పూర్ణిమ, వసంతోత్సవం అని ఆయా పేర్లతో పిలువబడే ఈ పండుగనాడు జరుపుకునే విధి విధానాలు ఆయా ప్రాంతీయ ఆచారాలను బట్టి స్థిరపడినాయి. కొన్ని ప్రాంతాల్లో దీన్ని డోలా పూర్ణిమ అని  కూడా అంటారు. మన తెలుగు ప్రాంతాల్లో ఈ పండుగను కాముని పున్నమగా పిలుస్తారు.

చలి తీవ్రత తగ్గి, కొంత వేడి కలిగిస్తూ వసంతఋతువు ప్రారంభమయ్యే సమయంలో చేసుకునే ఈ పండుగ ప్రకృతిలో సహజంగా లభించే పుష్పాల ద్వారా చేసే రంగులు చల్లుకుంటూ వసంతోత్సవాలు నిర్వహించుకుంటారు. ఈ పండుగకు సంబంధించి ప్రధానంగా 3 కథలు ఉన్నాయి.

హిరణ్యకశిపుడు, ప్రహ్లాదులకు సంబంధించిన ఈ కథ హోలీకి సంబంధించి ప్రధానంగా చెప్పబడుతుంది. విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు తండ్రి ఆగ్రహానికి గురై అనేక శిక్షలు అనుభవించినాడు. అయినా నారాయణుని స్మరణ మానలేదు. చివరి ప్రయత్నంగా అతడిని మంటల్లో వేసి చంపాలని నిర్ణయించుకుని, ఆ మంటలనుండి తప్పించుకోకుండా తన సోదరి హోళికకు అప్పగిస్తాడు. హోళిక మంటలు తనకు తగలకుండా మాయా వస్త్రాన్ని కప్పుకుని ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుంటుంది. హరినామస్మరణతో ఆ మాయా వస్త్రం హోళిక మీదనుండి తొలగిపోయి ప్రహ్లాదుడికి చేరి మంటలనుండి అతడు కాపాడ బడతాడు. చాలా సంవత్సరాలుగా ప్రజలందరు ఈ హోళిక వలన కష్టాలు అనుభవిస్తుంటారు. ఆమె చనిపోయింది ఆరోజు కాబట్టి ఆమె పేరు మీదుగానే హోళీ వచ్చిందని అంటారు. ఉత్సవాలు జరుపుకున్నారు. ఒక విధంగా ఇది చెడు మీద మంచి విజయానికి ప్రతీకగా, రాక్షసుల పరాక్రమం హోళికా దహనంతో అంతమైందని చెప్తుంటారు.

శివ పార్వతుల సమాగమ కథ, మన్మథుని దహనాన్ని సూచించే పండుగగా హోలీని వివరిస్తారు. సతీ దేవి మరణం తర్వాత పరమేశ్వరుడు ధ్యానంలో నిమగ్నమైనాడు. తారకాసురుని సంహారానికి శివపార్వతుల అంశతో ఒక పుత్రుడు జన్మించాలి. లోక కల్యాణం కోసం కుమారస్వామి జననం తప్పనిసరి. అటువంటి స్థితిలో ధ్యాననిమగ్నుడైన శివుడికి పార్వతీదేవిపై ప్రేమ జనించడానికి మన్మథుడిని నియమిస్తారు దేవతలందరు. మన్మథుడు ఆయనపై పుష్పబాణాలు ప్రయోగించి పరమేశ్వరుని ధ్యానానికి భంగం కలిగిస్తాడు. శివుడు మూడోకన్ను తెరచి మన్మథుని భస్మం చేస్తాడు. భర్త స్థితికి దుఃఖించి రతీదేవి శివుడిని ప్రార్థించగా కామరూపునిగా జీవించమనే వరమిస్తాడు.

కామరూపుడైన మన్మథుడిని దహించిన రోజు కాబట్టి ఆరోజు కామ దహనాన్ని జరుపుకుంటారు. ఇదే కాముని పున్నమగా ప్రసిద్ధి వహించింది. అయితే మన్మథుడు దహనం కావడం అనేది రతీదేవి దుఃఖానికి కారణం అయితే ఉత్సవం జరుపుకోవడం ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. శివుని వరంవల్ల మన్మథుడు కృష్ణునికి కుమారుడిగా ప్రద్యుమ్నుడిగా జన్మించాడు. అతడి కుమారుడు అనిరుద్ధుడు. వీరిద్దరు రాక్షసుల సంహారానికి కారణమైనారు. కాబట్టి ఈ కామదహనం ఉత్సవానికి కారణమైనట్లు పెద్దల వివరణ. ఈరోజు శివుడు మన్మథుని భస్మం చేస్తాడు. దానికి ప్రతీకగా మనలో ఉన్న అనవసరమైన కామాన్ని అగ్నికి ఆహుతి చేయడమనే ఉద్దేశంతో చాలా ప్రాంతాల్లో వీథుల్లో కట్టెలు, పనికిరాని వస్తువులను వేసి కామదహనం చేస్తారు.

ఉత్తరాది ప్రాంతం వారు ఈ పండుగను శ్రీకృష్ణుని లీలా విలాసాలకు ప్రతీకగా నిర్వహిస్తారు. గుజరాత్‌లోని వ్రజ్‌ ప్రాంతంలోని బర్సానా, రాధ ఉండే ప్రాంతం. ఆక్కడ రాధారాణి ఆలయం ముందు యువకులందరు తమను తాము కృష్ణులుగా భావించుకొని జెండాలు పాతుతారు. యువతులు తాము రాధా స్వరూపాలుగా భావించి యువకులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తారు. ఈ వేడుకను ‘లాత్‌మార్‌ హోలీ’ అంటారు. చివరి రోజు అందరూ రంగులు చల్లుకుంటారు. పశ్చిమ బెంగాల్‌లో ఈరోజు శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాలలో వేసి డోలికోత్సవం నిర్వహిస్తారు. ఈరోజునే శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో పెట్టి రంగులు పూసినట్లు చెబుతారు.

తెలంగాణా ప్రాంతంలో దాదాపు అన్ని జిల్లాల్లో హోలీ పండుగను నిర్వహించుకుంటారు. గ్రామాల్లో కన్నా పట్టణాల్లో ఈ పండుగ ఎంతో ఉత్సాహంగా చేసుకుంటారు. పండుగ వారం రోజులకు ముందుగానే ఈ క్రింది పాటను పాడుకుంటూ హోలీ ఇనాంను అడుగుతారు.

‘‘హోళీ హోళీర రంగ హోళీ – చమకేళిర హోళీ
గుట్టా గుట్టా తిర్గినాడే హోళీ – చమ కేళిర హోళీ
చెట్టూ, చెట్టూ తిర్గినాడే హోళీ – చమకేళిర హోళీ
మోదుగు పువ్వూ తెచ్చీనాడే హోళీ – చమకేళిర హోళీ
రోట్లేసి దంచినాడే హోళీ – చమకేళిర హోళీ
వరుసాలేదు వావిలేదూ – హోళి చమకేళిర హోళీ’’

పాటలోని అంతరార్థాన్ని మనం విశ్లేషించుకుందాం. ఆధునిక కాలంలో అంటే అనేక రసాయనిక రంగులు పూసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పసుపు, సున్నం కలిపి నీళ్ళను ఎర్రరంగులో కలుపుతారు. దాన్ని వసంతం అని అంటారు. వాటితో హోలీ ఆడుతారు. ప్రకృతితో మమేకమైన మానవుడు తనకు అందుబాటులో ఉన్న చెట్లనుండి వాటి పువ్వులు, బెరడులతో వివిధ రంగులను స్వయంగా తయారు చేసుకునేవారు. ఆ క్రమంలో గుట్ట గుట్ట తిరిగి, చెట్టు చెట్టు తిరిగి మోదుగు పూలు తెచ్చుకుని రోట్లో వేసి దంచేవారు. కుమ్మరి ఇంటికి పోయి కుండలు తీసుకువచ్చి అందులో తయారు చేసిన ఈ మోదుగుపూల రంగును పోసి మేదరి వాళ్ళ దగ్గరి నుండి తెచ్చిన గొట్టంలో రంగు పోసి వసంతం తయారు చేసేవారు. పాటలో వావి వరుసలు లేవు అని ఉంది. అక్కల మీద, చెల్లెళ్ళమీద, వదినెల మీద, తల్లి మీద అందరి మీద ఈ వసంతం ఒకరికొకరు చల్లుకుంటారు. అందుకే హిందీలో ‘‘బురా నా మానో హోలీ హై’’ అంటారు.  ఎందుకు వావి వరుసలు లేకుండా వసంతాలు ఆడడం అనేది ఎంతవరకు సమంజసం. ఇందులోని ఆంతర్యం ఏమిటని మనం ఆలోచిస్తే వాసనలేని మోదుగుపూలతో చేసిన శీతల కషాయం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది ఒక వైద్య ప్రక్రియ.  కామాన్ని అదుపులో పెట్టడంలో మోదుగ అద్భుతంగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు.

వరుసా లేదు, వావీ లేదు అంటే ఎవరికీ ఎటువంటి కామ భావనలు లేవు. అటువంటివి కలగకూడదనే ఉద్దేశంతో, అందరికీ మంచి జరగాలనే అర్థం స్ఫురిస్తుంది. అయితే ఆధునిక కాలంలో అనేక రసాయన రంగులు వాడడం వల్ల హోలి ఉత్సవాలు జరుపుకోవడంలోని పరమార్థం నెరవేరడంలేదనిపిస్తుంది.