దళితబంధు తొలిఫలాలు
తెలంగాణ రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి ఉద్దేశించి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన దళితబంధు తొలిఫలితాలు లబ్ధిదారుల చేతికి అందాయి. దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులకు తొలిసారిగా నాలుగు యూనిట్ల వాహనాలను పంపిణీచేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేతుల మీదుగా 15 మందికి దళితబంధు మంజూరు పత్రాలను అందించారు. ఈ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలుకు అవసరమైన 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల కూడా చేసింది. ముఖ్యమంత్రి చేతులమీదుగా మంజూరు పత్రాలు అందుకున్న వారిలో నలుగురు లబ్ధిదారులకు కరీంనగర్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్, బి.సి సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్లు యూనిట్లను అందించారు. ఈ సందర్భంగా ఇద్దరు లబ్ధిదారులకు ట్రాక్టర్లు, మరో ఇద్దరికి ట్రాన్స్ పోర్టు, ట్రావెల్ వాహనాలను అందించారు. పథకం ప్రారంభించిన అనతికాలంలోనే తమకు ఫలితాలు అందటం పట్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, దళితబంధు యూనిట్లు గ్రౌండింగ్ కావడం సంతోషంగా ఉన్నదని హర్షం వ్యక్తంచేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే రూ.2,000 కోట్లు కరీంనగర్ కలెక్టర్ దళితబంధు ఖాతాలో జమ అయ్యాయని, దీనినిబట్టి ఈ కార్యక్రమం అమలుకోసం ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్తోందో స్పష్టమవుతోందన్నారు. ఇప్పటికే 15 వేల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని, దళితబంధు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామన్న నమ్మకం దళితుల్లో కనపడిందని మంత్రి చెప్పారు.
బి.సి సంక్షేమ శాఖామంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, దేశంలో వివిధ రాష్ట్రాలు ఈర్ష్యపడే విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ దళితబంధు పథకాన్ని తీసుకు వచ్చి అంబేద్కర్ కన్న కలల్ని నిజం చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి ఏది చెప్పినా వెంటనే అమలు చేస్తారనడానికి ఇదొక నిదర్శనమన్నారు. పథకం ప్రకటించిన వెంటనే యూనిట్లను అందించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడిందని, లబ్ధిదారుల ముఖాల్లో చిరునవ్వు చూసే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ వై.సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, రవాణాశాఖ ఉప కమిషనర్ ఎం.చంద్రశేఖర్ గౌడ్, ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి సురేష్, తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారుల్లో ఆనందం
మంత్రుల చేతులమీదుగా యూనిట్లు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా నేను ఇంకొకరిదగ్గర కారు డ్రైవర్గా పనిచేసిన. దళితబంధు పథకం కింద మాకు కారు మంజూరైంది. మంత్రులు తాళాలు ఇచ్చిన్రు. ఇప్పుడు ఇంకొకరిదగ్గర పనిచేసే అవసరం లేదు. మాకు ప్రభుత్వం ఇచ్చిన కారును నడుపుకుంటం. నెలనెలా డబ్బులకోసం ఇబ్బందిపడే మాకు ఎంతో ధైర్యం వచ్చింది. బ్యాంకు లోన్లు, అప్పులు కట్టే బాధలేదు. కారుతోటి మంచి ఆదాయం సంపాదించుకుంటం. అని రాచపల్లి శంకర్ అనే లబ్ధిదారుడు తెలిపాడు.

దళితబంధు కింద రూ.10 లక్షలు ఇచ్చిన ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మా దేవుడు. కూరగాయల వ్యాపారం చేసుకొని బతికే మాకు అశోక్ లీల్యాండ్ వాహనం మంజూరయింది. వ్యాపారం ఇంకా బాగాచేసుకొని మంచి ఆదాయం పొందే అవకాశం వచ్చింది. అప్పులేకుంట బండి ఇచ్చుడు సంతోషంగా ఉన్నది. ఇప్పటిదాకా ఎవరూ ఇట్ల మాకు ఏం చేయలే. సి.ఎం కె.సి.ఆర్ సాయాన్ని ఎన్నటికీ మరచిపోమని లబ్ధిదారు జి.సుగుణ చెప్పారు.

దళితబంధు కింద మాకు ట్రాక్టర్ మంజూరైంది. వ్యవసాయకూలీ, పాలేరుగా పనిచేసిన మేం ట్రాక్టర్కు యజమాని అయినం. ట్రాక్టర్ తోటి వ్యవసాయం పనులు చేసుకుంట మంచిగ సంపాదించుకుంటం. పథకంతో మాకు ఎంతో మేలుజరిగిందని దాసారపు స్వరూప పేర్కొన్నారు.

కూలిపని చేసుకుంట కూరగాయలు అమ్ముకొని బతికే మాకు దళితబంధు కింద ట్రాక్టర్ ఇచ్చిన్రు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు మా కుటుంబం రుణపడి ఉంటది.కూలిపని చేసుకొనే మేం ట్రాక్టర్ కు ఓనర్ కావడం సంతోషంగా ఉన్నది. అప్పుకట్టే బాధలేదు. ట్రాక్టర్ నడుపుకుంట మంచి ఆదాయం సంపాదించుకుంటం. మాతోటి నలుగురికి పనిదొరికేలా చేస్తం. అని లబ్ధిదారు ఎల్కపల్లి కొమురమ్మ అన్నారు.
