పంచేంద్రియాలు

kcrస్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితుల అభివృద్ధి పేర ఎన్నో కార్యక్రమాలు జరిగినప్పటికీ ఆచరణలో దళితుల పరిస్థితిలో మార్పు రాలేదు. ఇప్పటికీ దళితులు కటిక పేదరికం అనుభవిస్తున్నారు. దళిత వాడల నుంచి దారిద్య్రాన్ని తరిమి కొట్టాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇప్పటికీ ఏ గ్రామానికి వెళ్ళి విూ గ్రామంలో అత్యంత నిరుపేదలు ఎవరు అని అడిగితే, ఖచ్చితంగా దళితులే అని సమాధానం చెబుతారు. దళితుల్లో నేటికీ 90 శాతం మంది నిరుపేదలుగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉండడానికి వీలులేదని ప్రభుత్వం భావిస్తోంది.

భూమి లేని నిరుపేద వ్యవసాయాధారిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మూడు ఎకరాలకు ఎంత తక్కువ భూమి ఉంటే అంత భూమిని ప్రభుత్వమే కొనుగోలు చేసి దళితులకు ఇస్తుంది. ఒక ఎకరం భూమి ఉంటే, మిగతా రెండు ఎకరాలు కొనుగోలు చేసి ఇస్తుంది. అసలే భూమి లేకుంటే మొత్తం మూడెకరాలు కొంటుంది. గతంలో మాదిరిగా ఎందుకూ పనికి రాని భూములు కాకుండా పూర్తిగా వ్యవసాయ యోగ్యమైన భూములు మాత్రమే దళితులకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భూముల్లో బోరు, మోటార్‌, కరెంటు కనెక్షన్‌ లాంటి సౌకర్యాలు కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది. మొదటి ఏడాది పెట్టుబడి కూడా ప్రభుత్వమే పెడుతుంది. సదరు భూముల్లో భూసార పరీక్షలు, భూగర్భ జల పరీక్షలు జరుపుతారు. వాటి ఆధారంగానే ఏ పంటలు వేసుకోవాలో సలహా ఇస్తారు.

జిల్లా కలెక్టర్లు దళితులకు ఇచ్చిన భూముల్లో ఏం జరుగుతుందో ప్రతీ మూడు నెలలకోసారి పరిశీలిస్తారు. ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు తరచూ ఆ భూములను సందర్శించి దళిత రైతులకు చేదోడు వాదోడుగా ఉంటారు. దళితులకు భూ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతుంది. ప్రతీ నిరుపేద దళితుడికీ వ్యవసాయ భూమి అందించే వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ఏదైనా జిల్లాలో వ్యవసాయ భూమి కొనుగోలు చేయడానికి ఇబ్బందులుంటే, అక్కడ దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ కార్యక్రమాలు చేపడతారు. ఎన్‌ఆర్‌ఐలు, హైదరాబాద్‌ లాంటి నగరాల్లో స్థిరపడిన వారు, భూములున్నప్పటికీ వ్యవసాయం చేయని ఉద్యోగులు, వ్యాపారులు తమ భూములు ఇస్తే, మంచి ధర ఇచ్చి కొంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 15న గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు దళితులకు మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. అదే రోజు అన్ని జిల్లాల్లో మంత్రులు కూడా దళిత మహిళలకు భూ పట్టాలిచ్చారు. మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 423 మందికి 1141.60 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.20.93 కోట్లు ఖర్చు చేశారు. ఆదిలాబాద్‌లో 106, కరీంనగర్‌లో 121, నిజామాబాద్‌ లో 16, ఖమ్మంలో 9, వరంగల్‌ లో 13, నల్లగొండలో 102, మెదక్‌ లో 21, రంగారెడ్డిలో 15, మహబూబ్‌ నగర్లో 20 మందికి భూ పంపిణీ జరిగింది.

ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం ప్రభుత్వ బాధ్యత. అయినప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలకు ఇంకా మంచినీరు లేని దుస్థితి నెలకొంది. అందుకే వచ్చే ఐదేండ్లలో తెలంగాణలోని ప్రతీ ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రాష్ట్రంలోని ప్రతీ ఆవాస ప్రాంతానికీ పైపులైను వేసి మంచినీరు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం డ్రింకింగ్‌ వాటర్‌ గ్రిడ్‌ కార్యక్రమం తీసుకుంది. 1,26,036 కిలీవిూటర్ల మేర పైప్‌ లైన్‌ నిర్మిస్తుంది. 5,227 కిలోవిూటర్ల మెయిన్‌ ట్రంక్‌ లైన్‌, 45,809 కిలోవిూటర్ల సెకండరీ నెట్‌ వర్క్‌, 75 వేల కిలోవిూటర్ల డిస్ట్రిబ్యూటరీ నెట్‌ వర్క్‌ పైపు లైన్లు నిర్మిస్తారు. కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉప నదులతో పాటు, స్థానికంగా ఉన్న నీటి వనరులను కూడా వినియోగించుకుంటారు. ప్రాజెక్టుల్లో ఖచ్చి తంగా పది శాతం నీటిని తాగునీటికి కేటాయిస్తారు. గ్రిడ్‌ నిర్వహణ కోసం జలాశయాల్లో డెడ్‌ స్టోరేజి లెవెల్స్‌ను ఖచ్చితంగా మెయింటేన్‌ చేస్తారు. ఆర్‌.డబ్ల్యు.ఎస్‌. ఆధ్వర్యంలో గ్రిడ్‌ పనులు జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న మంచినీటి సరఫరాకు ఎంతనీరు అవసరం? పరిశ్రమలకు ఎంత నీరు కావాలి? హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణ ప్రాంతాలకు ఎంత తాగునీరు కావాలి? గ్రామాలకు ఎంత నీరు పడుతుంది? ఆసుపత్రులు, కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎంత నీరు అవసరమవుతుంది? అనే విషయాలన్నింటిని ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఎన్ని ఓహెచ్‌ఎస్‌ఆర్‌ లు ఉన్నాయి? ఎంత వరకు నీరు అందుతుంది? ఇంకా ఎంత మేరకు పైపు లైను విస్తరించాలి? ఎక్కడ కొత్తగా రిజర్వాయర్లు కట్టాలి? తదితర విషయాలను కూడా పరిశీలిస్తున్నారు. రాబోయే 30 సంవత్సరాల అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రూపొందిస్తారు. సమగ్ర అధ్యయనం తర్వాత గ్రిడ్‌ పనులు ప్రారంభమవుతాయి. హైదరాబాద్‌ నగరానికి దాదాపు 50 టిఎంసిల నీరు అవసరమని, మిగతా రాష్ట్రానికి కనీసం 80 టిఎంసిల నీరు పడుతుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనావేసింది. దాదాపు రూ.25 వేల కోట్ల రూపాయల వ్యయంతో గ్రిడ్‌ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కాకతీయులు తవ్వించిన గొలుసుకట్టు చెరువులతో తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం గతంలో ఎంతో బాగుండేది. వ్యవసాయం మంచిగా ఉండడంతో గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ కూడా పరిపుష్టంగా ఉండేది. కానీ సీమాంధ్ర పాలనలో చెరువులు కుట్రపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయి. చెరువులన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. దాని వల్ల తెలంగాణలో వ్యవసాయం దెబ్బతిన్నది. మళ్లీ చెరువులకు పూర్వకళ వస్తే తప్ప గ్రామాలు బాగుపడవని, భారీ ప్రాజెక్టులను నమ్ముకోవడం కన్నా, చెరువులను పునరుద్దరించుకోవడం ఉత్తమమైన మార్గమని ప్రభుత్వం నిర్ణయించింది.

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు 265 టిఎంసిల వాటా ఉంది. ఆ నీటిని పూర్తి స్థాయిలో వాడుకోవడం లేదు. చెరువులను పునరుద్ధరిస్తే తప్ప మనకు కేటాయించిన నీటిని వాడుకోవడం సాధ్యం కాదు. తెలంగాణలో 45 వేల చెరువులున్నాయి. ఐదేళ్ల కాలంలో ఏడాదికి 9వేల చెరువుల చొప్పున పునరుద్ధరించనున్నారు. దీనికోసం ఐదేళ్లలో రూ.22,500 కోట్లను ఖర్చు చేయనున్నారు.

చెరువుల్లో పూడిక తీత, చెరువుల విస్తరణ, కట్టు కాలువలు సరిచేయడం, పంట కాలువల మరమ్మతులు, తూముల మరమ్మతులు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చెరువుల్లో నుంచి తీసిన నల్లమట్టిని పంటపొలాల్లోకి తరలిస్తారు. మొరం మట్టిని చెరువు కట్టకు పోసి, కట్టను పటిష్టం చేస్తారు. చెరువుల్లో నీరు బాగా నిల్వ ఉండడం వల్ల భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. చెరువులన్నింటిని నీటి పారుదల శాఖ పరిధిలోకి తెచ్చారు. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి సంబంధించి ఏమైనా సందేహాలు, సమస్యలుంటే పరిష్కరించడానికి నీటి పారుదల శాఖ మంత్రి కార్యాలయంలో 7680072440 నెంబరుతో హెల్ప్‌ లైన్‌ ఏర్పాటు చేశారు. చెరువు భూములను కబ్జా చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రతీ చెరువుకు ఎఫ్టిఎల్‌ నిర్ణయిస్తుంది. హద్దు రాళ్లను పాతుతుంది. చెరువులను కాపాడడానికి, పునరుద్ధరించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోకుండా, ప్రజా ఉద్యమంలా నడవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. చెరువు పూడికతీత పనుల్లో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయనున్నారు. ముఖ్యమంత్రి కూడా స్వయంగా తట్టమోసే విధంగా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు.

భూభాగంలో 33శాతం అడవులుంటేనే ప్రకృతి సమతుల్యత సాధ్యం. కానీ తెలంగాణలో ఉన్నదే 25శాతం అటవీభూమి. అందులో కూడా ఏడు శాతం వరకు అడవి వివిధ కారణాల వల్ల అంతరించింది. అడవిలో కూడా చెట్లు లేని దుస్థితి నెలకొంది. దీంతో అడవుల శాతం 18కి పడిపోయింది. ఇది ఉష్ణోగ్రతలు పెరగడానికి, దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడడానికి కారణమవుతున్నది.

ఒకప్పుడు తెలంగాణ దట్టమైన అడవితో అలరారేది. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ లాంటి జిల్లాల్లో దట్టమైన అడవులుండేవి. అప్పుడు వర్షాలు కూడా బాగా పడేవి. తెలంగాణలో మళ్లీ అడవులు అభివృద్ధి చేసేందుకు, సామాజిక వనాలు పెంచేందుకు, చెట్ల సంఖ్య పెంచడానికి ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. మూడేళ్ల కాలంలో తెలంగాణలో 230 కోట్ల మొక్కలు పెంచాలని నిర్ణయించారు. ఇప్పటికే అడవిలో ఉన్న వేర్ల ద్వారా(వయబుల్‌ రూట్‌ స్టాక్‌) 120 కోట్ల చెట్లను పెంచాలని నిర్ణయించారు. పది కోట్ల మొక్కలను హైదరాబాద్‌ నగరంలో పెంచుతారు. మిగతా 110 కోట్ల మొక్కలను జిల్లాల్లో పెంచాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అడవిలో మొక్కల పెంపకానికి కేటాయించిన 110 కోట్లు పోను, గ్రామాలు, నగరాల్లో పెంచడానికి ఉద్దేశించిన 120 కోట్ల మొక్కల్లో ప్రతీ ఏటా 40 కోట్ల మొక్కలను నాటుతారు.

వచ్చే ఏడాది జూలై మొదటి వారం తెలంగాణకు హరితహారం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో నాటడానికి సిద్దంగా ఉంచేందుకు తెలంగాణ వ్యాప్తంగా 3500 నర్సరీలు ఏర్పాటయ్యాయి. ప్రతీ రెండు మూడు గ్రామాలకో నర్సరీ ఉంటుంది. అక్కడి నుంచి గ్రామాలకు మొక్కల పంపిణీ జరుగుతుంది. ప్రతీ ఏటా జూలై మొదటి వారంలో వనమ¬త్సవం నిర్వహించి, మొక్కలు నాటడాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తారు. అన్ని స్థాయిల వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అటవీ ప్రాంతంలో టేకు, వెదురు, నల్లమద్ది, తెల్లమద్ది, తిరుమాను, బండారు లాంటి వృక్షాలు పెంచుతారు. గ్రామాలు, నగరాల్లో నీడనిచ్చే చెట్లు, పండ్ల చెట్లు, పూల చెట్లు, మేతనిచ్చే చెట్లు, ఆకర్షణగా ఉండే చెట్లు పెంచుతారు. ప్రతీ గ్రామం అడవిలో ఉందా అన్నట్లుగా చెట్లు విరివిగా పెంచాలని, తద్వారా తెలంగాణలో వర్షాలు మళ్లీ తిరిగి రావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి అటవీశాఖ నోడల్‌ ఏజన్సీగా ఉంటుంది. డ్వామా, ఐటిడిఏ, ఐటిసి, మున్సిపాలిటీ, పంచాయితీ రాజ్‌, హార్టికల్చర్‌, సెరికల్చర్‌, డిఆర్డిఏ, సింగరేణి లాంటి సంస్థలు, శాఖలు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటాయి.

బలహీన వర్గాల గృహ నిర్మాణం పేరుతో దాదాపు 35 ఏండ్ల నుంచి ఇండ్ల నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 55 లక్షల ఇండ్లు కట్టినట్లు రికార్డులున్నాయి. కానీ ఇంకా చాలా మంది నిరుపేదలకు ఇండ్లు లేవు. మొత్తంగా ఇండ్ల నిర్మాణమే ఓ గోల్‌ మాల్‌ గా మారింది. అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు, అధికారులు కుమ్మక్కై ఇండ్లు కట్టకుండానే బిల్లులు కాజేసిన ఉదంతాలు వెలుగుచూశాయి.

తెలంగాణలో గతంలో జరిగిన గృహ నిర్మాణ పథకాల్లో అవినీతి గుట్టురట్టు చేయడానికి సిబిసిఐడి విచారణ జరుగుతున్నది. ఈ విచారణలో వందలకోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తేలుతున్నది. కొంతమేర ఇండ్ల నిర్మాణం జరిగినా, ఇరుకైన గదులు నిర్మించడం వల్ల అవి ఎందుకూ సరిపోవడం లేదు. ఇంటి నిర్మాణం పేర కేవలం ఒకే గది నిర్మించారు. ఆ గదిలోనే కుటుంబ సభ్యులంతా నివసించలేక, కాపురాలు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇంటి కయ్యే ఖర్చును కూడా కొంత సబ్సిడీ రూపంలో, మరికొంత లోన్‌ రూపంలో ఇచ్చారు. ఈ పరిస్థితిని గమనించిన కేసీఆర్‌, పేదలకు రెండు బెడ్‌ రూములు, హాల్‌, కిచెన్‌ ఉండేలా ఓ గౌరవప్రదమైన ఇల్లు రూ.3 లక్షల వ్యయంతో కట్టించి ఇస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ విషయంపై దృష్టి పెట్టారు. గృహ నిర్మాణ పథకంలో జరిగిన అవినీతిపై విచారణ పూర్తయిన తర్వాత కొత్త గృహ నిర్మాణ పథకం చేపడతారు. పెరిగిన ధరల ప్రకారం రెండు బెడ్‌ రూములు, హాలు, కిచెన్‌, బాత్రూమ్‌, ల్యాట్రిన్‌ కట్టడానికి రూ.3.50 లక్షల వ్యయం అవుతుందని అంచనా. మొత్తం డబ్బును ప్రభుత్వమే భరించి ఇండ్లు కట్టించాలని నిర్ణయించారు. కింది భవనం పిల్లర్లతో నిర్మించడం వల్ల భవిష్యత్తులో మరో అంతస్థు నిర్మించుకోవడం కూడా సాధ్యపడుతుంది.