తెలంగాణ స్వాతంత్య్ర ఫలాలు

By: గన్నమరాజు గిరిజా మనోహరబాబు

భాగవతమ్ములో భక్తిచిందించిన పోతన్నవెలసిన పుణ్యభూమి దుష్టులన్‌ యుద్ధాన దునిమిన రాణి రుద్రమ యేలిన రాజభూమి రాజనీతిజ్ఞుడై రాణకెక్కిన యుగం ధరుడు జన్మించిన ధర్మభూమి శిల్పకళతపస్వియనెడి పేర్గొన్న రామప్ప నెగడిన రమ్యభూమి యిట్టి ఔన్నత్య సంపదకిక్కయైన ఈ తెలంగాణ భూమితోనేది సాటి? కనుక భయమేల సోదరా! కంఠమెత్తి గానమొనరింపరా ! ‘తెలంగాణ ఘనత’ ! (గుండోజు యాదగిరి)

తొలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంగా వందలాది వేదికల నుంచి ప్రతిధ్వనించిన పద్యం ఇది. తెలంగాణాలోని ఊరువాడ ఏకమై వలసాంధ్రుల గుప్పిట్లో నలిగిపోతున్న కమ్మని యీ తెలంగాణను విడిపించుకోవాలనే ఒకే ఒక ధ్యేయంతో నిర్మాణమైన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడి ఇక్కడి అన్ని స్థాయిల్లోని ప్రజలనూ ఏకోన్ముఖంగా సాగిన ఉద్యమం ఈ తెలంగాణ ఉద్యమం.

ఈ పద్యంలోని ఒక్క వాక్యం చాలు మన తెలంగాణా ఔన్నత్యమేమో అర్థం చేసుకోవడానికి ‘..ఔన్నత్య సంపదలకిక్కయైన ఈ తెలంగాణ భూమితో నేది సాటి?’’ అన్న ఈ పాదం మన రాష్ట్ర ఘనతను చాటడమే గాక మనం ఏం పోగొట్టుకున్నామో కూడా తెలుపుతున్నది. తెలంగాణా రాష్ట్ర అవతరణ తరువాత ఆయా విషయాలను సాధించుకుంటున్న విషయాలను కూడా సూచిస్తున్నట్టుంది.

ఈ పద్యంలో కవి మన భూమిని పుణ్యభూమిగా, రాజభూమిగా, ధర్మభూమిగా, రమ్యభూమిగా అభివర్ణించారు. పోతన్న వంటి మహాకవుల వారసత్వం, రాణిరుద్రమ వంటి మహాపరిపాలనా దక్షుల వారసత్వం, మహామేధావులైన మంత్రుల వారసత్వం, గొప్ప గొప్ప కళాకారుల వారసత్వం ఉన్న ఈ నేల నిస్తేజమై పరుల దోసిడీకి గురియౌతున్నతీరు ఇక్కడి ప్రజల హృదయాలను కలచివేసింది. దాన్నుంచి మనల్ని మనం బయటపడటానికే ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. పోలీస్‌ చర్య అనంతరం నుంచి సాగిన వలసలు సమైక్య ఆంధ్ర ఏర్పడిన తరువాత కూడా కొనసాగుతూ, నాటి నుండి ఈ భూమి పుత్రుల వారసత్వాన్నీ, ఇక్కడి వారి హృదయాల్లోని అంతర్వేదనల్నీ ప్రతిబింబించిందే స్వరాష్ట్ర కాంక్ష ఉద్యమమన్నది చరిత్ర చెప్పిన సత్యం. చరిత్రలో నిలిచిపోయే సత్యం. 

అసలు ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ మూలాలను గురించి తెలుసుకోవలసిన అవసరం కూడా ఉంది. మన పుణ్యభూమిని మన రాజభూమిని, మన రమ్యభూమిని, మన ధర్మభూమిని మనం దక్కించుకోవడానికి చేసిన ఈ ఉద్యమ ప్రారంభాలని గురించిన అవసరం, దాని ప్రాధాన్యం కూడా గుర్తిస్తే మనమిప్పుడెంత స్వాతంత్య్ర ఫలాల్ని ఆస్వాధిస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. అందుకే క్లుప్తంగానైనా ఉద్యమం మూలాలను సమీక్షించుకోవాలి.

మన తెలంగాణ ప్రాంతం నాటి పాలకుడైన నిజాం ప్రభువు పాలన నుండి 1948లో భారత ప్రభుత్వం నిర్వహించిన పోలో ఆపరేషన్‌ ఫలితంగా విముక్తమైంది. తరువాత విధింపబడిన మిలటరీ పాలన కారణంగా జనరల్‌ చౌదరి గవర్నర్‌ పాలన రావడం, స్థానికులైన నాటి అధికారులను తొలగించి పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల అధికారలను ఇక్కడి అధికారులుగా నియమించడం నుంచే ఈ ప్రాంతాలకు వలసల వరద మొదలైంది. క్రింది స్థాయి ఉద్యోగుల్లో కొంతమంది స్థానికులు నియమింపబడ్డారు. స్థానికేతర అధికారులు దిగువస్థాయి స్థానికోద్యోగుల విషయంలో చూపిన వివక్ష పలు విభేదాలకు దారి తీసింది. ఆ విభేదాలే క్రమ క్రమంగా పెరిగి ఉద్యమ రూపం దాల్చాయి. 

1949 డిసెంబర్‌ 1 నుండి చౌదరి మిలటరీ పాలన ముగిసింది. ఎం.కె. వెల్లోడి నేతృత్వంలో పౌరపాలన ప్రారంభమైంది. వీరి పాలనలోనూ స్థానికులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఉర్దూ మీడియం తొలగించి ఆంగ్ల మాధ్యమం విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టిన కారణాన్ని నెపంగా చేసుకొని ప్రాంతేతరులను బోధనార్థం తీసుకువచ్చారు. వారు ఇక్కడి పౌరులను అనాగరికుల స్థాయిలో చూడటం, ఇక్కడి వారిలో తీవ్ర అసంతృప్తిని రగిలించింది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చిన ఆంధ్రులు ఎక్కువ సంఖ్యలో రావడం ప్రారంభమైంది. ఇతర ఉద్యోగాల కొరకు తమవారిని తీసుకొని రావడంతో వలసల వరద మరీ ఎక్కువైంది. పాఠశాలల్లోనే గాక పరిపాలనలోనూ ఇంగ్లీషు ప్రవేశపెట్టడం ఈ వలసలను మరింత పెంచింది. 1919లో ఏడో నిజాం ఫర్మానాలోని ముల్కీ రూల్స్‌ను కొంచెం సవరించి 1949లో మరో కొత్త ఫర్మానా జారీ అయి ముల్కీ రూల్స్‌ పెట్టబడ్డాయి.

ఎన్నిరూల్స్‌ తెచ్చినా వరద ఆగకపోవడం, 1952 ఆగస్టు 26 నుండి 28 వరకు హైదరాబాదు విద్యార్థులు సమ్మెకు దిగడంతో దాదాపు ఉద్యమ మూలాలకు బీజం పడ్డట్లైంది. గోడలపై నినాదాలు, ర్యాలీల వంటివి కూడా నిర్వహించబడ్డాయి. క్రమంగా ఈ ఉద్యమం ఈ ప్రాంతంలోని ఇతర నగరాలకు కూడా వ్యాపించింది. అందుకే 1952లోనే వరంగల్‌ పట్టణంలో కూడా సమ్మెలు మొదలయ్యాయి. నాటి వరంగల్‌ సంస్థ పురపాలక సంస్థ సభ్యుడైన బుచ్చయ్య అధ్యక్షతన ఒక విద్యార్థి కార్యాచరణ సమితి కూడా ఏర్పడి, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకి ఒక విన్నపాన్ని వినతిపత్రరూపంలో సమర్పించడం, నాన్‌ ముల్కీలను వెనక్కు పంపమని కోరడం, కాని పక్షంలోఉద్యమం ఉధృతమౌతుందని చెప్పడం ఈ ఉద్యమ మార్గం దాదాపు పూర్తి స్థాయిలో రూపొందినట్లైంది.

1956 నవంబర్‌ 1న ఆంధ్ర రాష్ట్రావతరణను, ఇక్కడి ప్రజాభీష్టానికి విరుద్ధంగా కేంద్రం ఏర్పాటు చెయ్యడం వలన వీరులే నాయకత్వం ఎక్కువ సార్లు వహించడం, చెలరేగిన ఉద్యమాలను పోలీసు బలగాలతో అణచివేయడం వంటివి దాదాపు మన రాష్ట్రం సాకారమయ్యేంత వరకూ సాగుతూనే వచ్చాయి. మరోసారి దావానంలా ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని 1969 నాటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణ హింసాకాండతో అణచివేశారు. కాని తెలంగాణ జనుల హృదయాల్లో నిత్యం రగులుతున్న అగ్నిని మాత్రం ఆర్పలేకపోయారు. ఈ ఉద్యమ రూపాలనన్నింటినీ లోతుగా అధ్యయనం చేసిన నేటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దృఢ సంకల్పంతో ‘‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్‌ సచ్చుడో’’ అనే స్పష్టమైన లక్ష్యంతో కొత్త మార్గంలో ఉద్యమాన్ని ప్రారంభించారు. ఎన్నెన్నో హేళనలకు, ప్రతికూల సందర్భాలనూ నిబ్బరంతో అధిగమించి ఉద్యమ విజయాన్ని సాధించారు.

ఏ ఉద్యమానికైనా దశ దిశ ముఖ్యం. ఉద్యమసారధులకు ఈ విషయంలో చాలా స్పష్టత ఉండాలి గనుక ఆ దిశగా సంపూర్ణమైన అవగాహన చేసుకున్న కేసీఆర్‌ తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న బాధల మూలాలను, ఆయా దశలలో సాగిన ఉద్యమాల దశలను లోతుగా అధ్యయనం చేసి, వాటిల్లోని చిన్న చిన్న లోపాలను సవరించడమేగాక, పాలక వర్గాలకు ఏ చిన్న అవకాశం ఇవ్వకూడదన్న ధ్యేయంతో అసలైన దిశగా ఉద్యమాన్ని నడపడమే తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రధాన కారణం. ఏ ఉద్యమంలోనైనా ఉద్యమనాయకుడు ఆలోచించి ఉద్యమానికి హింస పునాది కారాదన్న విషయంపై అవగాహన కలిగి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో చంద్రశేఖర రావుది వజ్ర సంకల్పమే. అందుకే దాదాపు పదకొండేళ్ళపాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో ఎటువంటి హింసకు చోటు లేకుండా చేయగలిగాడు. మండే గుండెల్లో చెలరేగిన అగ్ని జ్వాలల్లో ఉద్యమకారులే ప్రాణాలర్పించారు తప్ప ఇతరులెవ్వరికీ ఎటువంటి హానిని తలపెట్టకపోవడమే ఉద్యమ విజయానికి మొదటిమెట్టు. దాంట్లో మన నాయకుడు విజయం సాధించి దేశం గౌరవించే నాయకులందరికీ తార్కికంగా విశ్లేషించి ఒప్పించి సుముఖుల్ని చేయడం మరోమార్గం. అందులోనూ కేసీఆర్‌ ఆలోచన ఫలించి కేంద్రనాయకత్వం రాష్ట్ర విభజన చేసిన కారణంగా మనకు నూతన రాష్ట్ర సాకారం జరిగింది. దశాబ్దాల కల ఫలించింది. చిరకాలం నుండి గాఢమైన వాంఛ, ఈ నేల ప్రజానీకపు కల అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచగలగిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావే నూతన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోవడం ఒక చారిత్రక సందర్భం. తమ ఉద్యమాలను ఒక క్రమపద్ధతిలో సాగే నాయకత్వాన్ని నెరపి రాష్ట్రాన్ని ఏలే అవకాశం కూడా 

ఉద్యమ నాయకునిదేనన్న భావనతో తెలంగాణ ప్రజలు తదనంతరం వచ్చిన ఎన్నికలన్నింటిలోనూ కేసీఆర్‌నే సమర్థించిన కారణాలు పరిశీలిస్తే, దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా మనల్ని ప్రగతి మార్గంలో నడిపిస్తున్న తీరు అసామాన్యం.

ఒక రాష్ట్రంగా మహోన్నత స్థాయిలో వెలగడానికి మూలం ఇక్కడి సంపదను అభివృద్ధి చెయ్యడం, ఇక్కడి ప్రజానీకపు కనీస అవసరాలకు తోడ్పడి వాళ్ళ జీవితాలను పురోగతిలోకి నడిపించే ప్రయత్నాలు చేయడం, ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం వంటి అతి ముఖ్యమైన పనులు ఈ పాలనలో తెలంగాణ ప్రజలు అందుకుంటున్నారు. పద్యంలో పేర్కొన్నట్లు దీనికున్న ‘పుణ్యభూమి’ అనే గౌరవం, ‘రాజభూమి’ అన్నగౌరవం, ‘ధర్మభూమి’ అన్నగౌరవం, ‘రమ్యభూమి’ అన్న గౌరవం పునరుద్ధరణ చేసే రీతిలో మనం ఎన్నుకున్న ప్రయత్నం కొనసాగుతూ ఉంది. కొన్ని మంచి పనులు చేస్తున్నప్పుడు అనేక అవరోధాలొస్తుంటాయి. వీటిని అధిగమించడానికి నాయకునికి పాలనాదక్షతతో బాటు చాలా గుండె ధైర్యం కూడా కావాలి. అప్పుడే ఆ ప్రాంతం ‘‘ఔన్నత్య సంపదలకు’’ స్థానమై ప్రపంచంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా కీర్తి గడిస్తుంది. ఇప్పుడు మనం ఆ దిశగానే సాగుతున్నాం.

తమ సాహిత్యం ద్వారా, తమ నిబద్ధత ద్వారా ఈ నేలను ‘పుణ్యభూమి’గా మార్చిన మహాకవులు నాటి పాల్కురికి సోమనాథుని కాలం నుండి, నేటి కాళోజీ వరకూ వేలాది మంది సాహితీ మూర్తులు ఇక్కడ జన్మించి తెలుగు భాషకొక ఘనమైన కీర్తిని కలిగించారు. ఇది గుర్తించిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర తొట్ట తొలి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే మహాకవి దాశరథి స్కృతిలో, ప్రజాకవి కాళోజీ స్మృతిలో రెండు ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను క్రమం తప్పకుండా ప్రతి యేడాది సాహిత్య సేవ చేస్తున్న మహనీయులకు అందిస్తూ రావడం, ఈ నేలలో పుట్టిన కవుల గౌరవాన్ని రెండిరతలు చేయడమే తప్ప మరొకటికాదు. అంతేగాక మన రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాల్లో గత ఎనిమిదేళ్ళలో మహా విద్వన్మూర్తులైన శ్రీ భాష్యం విజయసారధి, శ్రీ మాణిక్యసోమయాజులు, ఆచార్య కోవెల సుప్రసన్నా చార్య, కపిలవాయి లింగమూర్తి వంటి అక్షర మూర్తులను రాష్ట్రం పక్షాన సన్మానాన్ని అందించడం ఆ సరస్వతీ మాతకు అర్చన చేయడమే. దానివల్ల ఈ పుణ్యభూమిలో జనన మందిన జ్ఞానుల గౌరవాన్ని దశదశలా ఉన్న ప్రజలకు తెలపుతున్న కార్యక్రమంగా భావించవచ్చు. ఈ సంస్కృతీ సాహిత్య సమర్చన పాలకుల విధిలో ఒక ప్రధాన భాగమని సూచించినట్లైంది. మన నేల కీర్తి బావుటా రెపరెపల కాంతులు అన్ని దిక్కులకూ ప్రసరిస్తాయి.

భారత దేశంలోని అత్యధిక భాగాన్ని పాలించి పాలనా దక్షతలో, పరాక్రమ ప్రదర్శనలో అసాధారణమైన ప్రతిభ చూపిన రాజులు కాకతీయ రాజులు. తన అపూర్వ శక్తిని లోకానికి సమర్పించి ఏలుబడిలో తనదైన ప్రత్యేక పద్ధతిననుసరించి, తన అసదృశమైన పరాక్రమం ధాటికి శత్రువులు ఎదురు నిలువలేరని నిరూపించిన సామ్రాజ్ఞి కాకతీయరాజ్యాధికారిణి రాణీరుద్రమదేవి. మహిళా శక్తి యొక్క ఘనతకు రుద్రమదేవియే ప్రతీక. లోకంలో ఎన్ని సమస్యలనైనా ఎన్నిఅవరోధాలనైనా అధిగమించి జయించ గలిగే శక్తి మహిళకు ఉంటుందని నిరూపించిన నిరుపమాన పరాక్రమశాలియైన రుద్రమదేవి యేలిన ఈ ‘రాజభూమి’ తొలి తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించిన పిదప పాలనా సూత్రాలను చేతబట్టిన మన ముఖ్యమంత్రి సాహిత్య గౌరవాన్ని సత్కారార్హం చేసి మన రాష్ట్రం మన వాళ్ళను సత్కరించుకునే దారి మనందరి దారిగా భావించాలన్న సత్యాన్ని ఆవిష్కరించిన తరువాత వారి ప్రధాన ప్రజాప్రయోజన కార్యక్రమాలపై దృష్టిసారించారు. కాకతీయులు ప్రధానంగా వ్యవసాయాన్ని సుసంపన్న చేసే విధంగా సముద్రాల వంటి నీటి వనరులుగా రామప్ప, లక్నవరం, మొదలైన ప్రాంతాల్లో అనేకమైన చెఱువులు నిర్మించి ప్రజా ప్రయోజనాన్ని సాధించారు. ‘‘రాజభూమి’’కి ప్రధాన ఆశయం ప్రజా సంక్షేమమే కావాలి. దానికి అడ్డుపడ్డ శత్రువులను నిరోధించాలి. ఇదే పాలకుల కర్తవ్యం. మన ఈ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ‘మిషన్‌ కాకతీయ’ను చేపట్టి ముందుగా చెరువుల్లో పూడికలు తీయించి వాటిని ప్రజా ప్రయోజనార్థం ఉపయోగపడే పెద్ద చెరువులు చేసే ప్రయత్నం చేయడం ప్రశంసనీయం. దానితో బాటు కాకతీయుల కాలంలోనే నిర్వహింపబడ్డ గొలుసు చెఱువుల పద్ధతిని మరింత పటిష్టంగా చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయడం మనం సాధించుకున్న మహా విజయం. ఇది పూర్తిగా మన ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్ధం నిర్వహిస్తున్న మహాకార్యం. అందుకే అన్ని ప్రాంతాల వారి ప్రశంసలను ఇది అందుకుంది.

పూర్వం రాచరికం, ఇప్పుడు ప్రజాస్వామ్యం. అప్పటి రాజులు తమపైకి దండెత్తి వచ్చే శత్రురాజులను యుద్ధాల్లో ఎదుర్కొన్నారు. కాని నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ విధమైన అడ్డంకులకు ఆస్కారం లేదు. కాని చేస్తున్న ప్రయోజనకరమైన పనులకు అడ్డంకులు సృష్టించేవాళ్ళకు మాత్రం మన ప్రజాస్వామ్యంలో కొదవలేదు. తెలంగాణ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించుకున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విషయంలో లెక్కలేనన్ని అవరోధాలు ఏర్పడ్డాయి. ప్రపంచంలోనే పెద్దదిగా నిలబడ్డ ఈ ప్రాజెక్టును కేవలం మూడేళ్ళలోనే పూర్తి చేసి ఒక చరిత్ర సృష్టించింది మన తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి చిత్త శుద్ధి, గట్టిపట్టుదలలే ఈ ఘనతకు కారణాలు. సాగునీటికి లోటురాకూడదన్న దృఢ సంకల్పమే ఈ విజయానికి మూల సూత్రం. 

ప్రజా సంక్షేమమే ధ్యేయం కనుక యీ మార్గంలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌, సీతారామ ప్రాజెక్టుల వంటి మరిన్ని ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. వాటి అవరోధాలను అధిగమించడానికి మన నాయకుల పోరాటాలు తప్పనిసరిగా సత్ఫలితాలను సాధిస్తాయి. ప్రజల ఆశలు నెరవేరుతాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా సంక్షేమ సంకల్పమే ఈ విజయం. 

మన తెలంగాణము రాజనీతిలో అసమానమైన చాతుర్యాన్ని చూపి, రాజ్యపాలన చేసే రాజుల దగ్గర మంత్రాంగం నెరపి నేలను సుసంపన్నం చేసిన మంత్రులున్న ‘ధర్మభూమి’ ` ప్రజాస్వామ్యంలో పాలించే మంత్రులలోనూ అంతటి చాతుర్యం ఉందని నిరూపించిన మన రాష్ట్ర మంత్రివర్గం, మంత్రివర్గ నాయకుడు ఉండటం ఒక విధంగా మన అదృష్టం.

రాష్ట్ర పాలనలోనే గాక, రాష్ట్ర పరిధిలో మాత్రమేగాక దేశ స్థాయిలోనూ గొప్ప వ్యూహకర్తగా పేరెన్నికగన్నవారు మన ముఖ్యమంత్రి. ఎన్ని అడ్డంకులున్నా, ఎన్ని విధాల ఇతర రాజకీయ నేతలు ఇబ్బందులు పెట్టినా తొణకని చిత్త స్థైర్యంతో అవసరాలకు, సందర్భాలకు తగినట్లుగా వ్యూహరచనలు చేసి మన ఆత్మ గౌరవాన్ని చాటిన ధీశాలి మన పాలకుడు కావడం వల్లనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు, వ్యవసాయ ఫలాల్ని రాష్ట్రమే కొనడం, అసరా పింఛన్లు, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, వృత్తి పనివాళ్ళకు కావలసిన సౌకర్యాలు మొదలైన అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు ఒక అపూర్వమైన రీతిలో, సకల ప్రపంచపు మెచ్చుకోళ్ళతో సాగుతున్నాయి. నాటి పాలకులను తలపించే రీతిలో రాజ్య భారాన్ని నిర్వహిస్తూ సమర్థులైన సహచర మంత్రులను తోడు తీసుకొని పురోగతి సాధించిన కారణంగానే ఈ ‘ధర్మభూమి’లో కొనసాగే కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలే గాక, విశ్వవ్యాప్త కీర్తిని కూడా అందుకుంటున్నాయి. అవసరానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటేనే ఇటువంటి విజయాలు సాధ్యమౌతాయి. 24 గంగల కరెంటు, హరిత హారం వంటి కార్యక్రమాల వల్ల ప్రజలకెంత, ప్రకృతికెంత న్యాయం చేస్తున్నాయో మన అనుభవంలోకి వస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలనేవి కేవలం వాగ్దానాలకే పరిమితం చెయ్యకుండా, వాటిని కార్యాచరణలోకి తీసుకొని వచ్చినప్పుడే వాటికి ప్రయోజనం అందుతుంది. గురుకులాల స్థాపన వేలాది మంది సామాన్యులకు నాణ్యమైన విద్యనందించే ప్రణాళిక అయ్యిందంటే దానివెనక ఎంత ఉన్నత లక్ష్యం ఉందో, దాన్ని కార్యాచరణలోకి తీసుకొని రావడంలో ప్రభుత్వ అధినేత దానికి సంబంధించిన మంత్రిత్వ శాఖ, అధికారులు ఎంతగా శ్రమించారో గమనిస్తే ఏవిధమైన సామాజిక న్యాయం ఇక్కడి ప్రజలకందుతున్నదో అవతగమవుతుంది. ఈ భూమిని ‘ధర్మభూమి’గా కీర్తి దక్కించే రాజ్యాధినేత ఆశయం అభినందనీయం, ఆచరణీయం.

ఇటీవలే ప్రపంచవారసత్వంగా కీర్తినార్జించిన ఘనమైన కట్టడం ‘రామప్పగుడి’. రామప్పగుడిలోని శిల్ప ప్రతిభ అసాధారణం. అదే విధంగా కాకతీయుల కాలంలోనూ, తదనంతర కాలంలో ఈ నేలపై వెలసిన కళారూపాలు వెలకట్టలేని అపూర్వ సంపదగా అలరారుతున్నాయి. అందుకే ఇది ‘రమ్యభూమి’గా పేరుగాంచింది. 

ఆ మార్గంలోనే ఇటీవల మనరాష్ట్రం గర్వించదగిన ఒక అద్భుత కట్టడం ‘యాదాద్రి’ ఆలయం. అపూరూప శిల్పనైపుణ్యంతో, అందమైన నిర్మాణ నిపుణతతో అంతర్జాతీయ పర్యాటకులను కూడా అలరిస్తూ తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలిచే కట్టడం సాకారం కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పం, శిల్పుల దీక్షా దక్షత వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. భవిష్యత్కాలంలోనూ తెలంగాణను మరువలేని విధంగా రూపొందిన ఆలయం భక్తులనేగాక, కళా హృదయులకు కూడా పరమానందం కలిగించే అంశం.

అదే విధంగా నాగార్జున సాగరంలోని బుద్ధవనం వంటి మరిన్ని కార్యక్రమాలు మన రాష్ట్రాన్ని ‘రమ్యభూమి’గా మార్చి ప్రపంచమంతా అబ్బురపడే విధంగా రూపుదిద్దుతుండడం ఈ రాష్ట్ర పురోగతిని తెల్పే సంకేతాలని నిస్సంశయంగా చెప్పవచ్చు.

యావద్భారతంలోనే అనేక విషయాల్లో ప్రథమ స్థానాన్ని సాధించుకున్న రాష్ట్రం తెలంగాణం. రాష్ట్ర సాకారానంతరం ఉజ్వల భవిష్యత్తును దర్శిస్తూ, ఆ దార్శనికతలే వెలుగులో మునుముందుకు సాగిపోయే శక్తిని సమకూర్చుకుంటూ, అవరోధాలను చాకచక్యంగా అధిగమిస్తూ సాగిపోతున్న రాష్ట్ర పురోగతికి మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు దక్షత, వారి మంత్రి మండలి పెద్దల సమర్ధతే ప్రధాన కారణం. అందుకే మన రాష్ట్రానికి బడాబడా విదేశీ కంపెనీలు ఇక్కడ తమ సంస్థలు నెలకొల్పడానికి ఆరాటపడుతున్నాయి. అనవసరమైన సాంకేతిక అవరోధాలకు చోటివ్వ కుండా సరళతరం చేస్తూ విధానాలను సవరించాలన్న ప్రభుత్వ నిర్ణయమే దీనికి ప్రేరణ. ఇటువంటి విశిష్ట ప్రగతిని అచిరకాలంలోనే సాధించడానికి ముందుండే ముఖ్యమంత్రి, వారి సహచరమంత్రులు, రాష్ట్ర అధికారులు, ప్రతిపనికి సహకరిస్తున్న తెలంగాణ ప్రజలు ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని, ఈ తెలంగాణం మరిన్ని ‘ఔన్నత్యాలకు’ నిలయమవుతుందని మనసారా కోరుకోవడమే ఇక్కడి పౌరులుగా మన కర్తవ్యం.