పారిశ్రామిక ప్రగతి సోపానం

జూన్‌ 11న ఉదయం 11.30 గంటలకు పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంఖుస్థాపన. జూన్‌ 12 ఉదయం 11 గంటలకు నూతన పారిశ్రామిక విధానం ప్రకటన. జూన్‌ 12 సాయంత్రం 4 గంటలకు డిండి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన. కేవలం 30 గంటల వ్యవధిలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర గతిని, స్థితిని మార్చే మూడు ముఖ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలో ఎక్కువ మంది ఆధారపడే వ్యవసాయ రంగానికి, తెలంగాణలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే పారిశ్రామిక రంగానికి ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యత ఏపాటిదో ఈ సన్నివేశం చూస్తే అర్థమవుతుంది.

పారిశ్రామిక--ప్రగతి-సోపానంవ్యవసాయాధార దేశమైన భారత్‌లో విధానాలు పారిశ్రామిక ప్రగతికి అనుకూలంగా ఉండాలా? వ్యవసాయానికి అనుకూలంగా ఉండాలా? అనే మీమాంస స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జవహర్‌ లాల్‌ నెహ్రూ సారథ్యంలోని జాతీయ నాయకత్వానికి కలిగింది. ఆనాటి నుంచి చాలా ఏండ్ల వరకు కూడా ప్రభుత్వాలు ఎటూ తేల్చకోలేకపోయాయి. అందుకే అటు పూర్తిగా పారిశ్రామిక రంగంలో, ఇటు వ్యవసాయ రంగంలో మనదేశంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించలేకపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రెండు రంగాల పట్ల పూర్తి అవగాహనతో విధానాలు రూపొందించారు. తెలంగాణలో వ్యవసాయంపై ఆధారపడి బతికే వారి సంఖ్య 60 శాతానికి పైగానే ఉంటుంది. కానీ వ్యవసాయ రంగం వాటా స్థూల జాతీయోత్పత్తి(జిడిపి)లో 17 శాతం మాత్రమే. కానీ పరిశ్రమల విషయానికొస్తే జిడిపిలో దాని వాటా 30 శాతం. అయితే, పరిశ్రమలపై ఆధారపడి జీవించే వారి సంఖ్య చాలా స్వల్పం. తెలంగాణలో అటు ఎక్కువ మంది ఆధారపడే వ్యవసాయాన్ని విస్మరించకుండా, ఇటు ఆర్థికాభివృద్ధికి దోహదపడే పారిశ్రామిక రంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా విధానాలు రూపొందించే విషయంలో కెసీఆర్‌ ప్రభుత్వం సమతూకం పాటించింది. సమన్యాయం చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానంపై దాదాపు పది నెలలకు పైగానే కసరత్తు చేసింది. ప్రపంచంలో ఎక్కడ మంచి పారిశ్రామిక విధానం ఉందో తెలుసుకోవడానికి యూనివర్సిటీల్లో రీసెర్చి చేసిన విధంగా శ్రమించింది. ముఖ్యమంత్రి కెసీఆర్‌ స్వయంగా సింగపూర్‌లో పర్యటించడంతో పాటు దేశ, విదేశాలకు చెందిన అనేక మంది పారిశ్రామిక రంగ ప్రముఖులతో, నిపుణులతో చర్చించారు. పారిశ్రామిక విధానంపై సచివాలయంలోనే దాదాపు 30 సమీక్ష సమావేశాలు జరిగి ఉంటాయి. చివరికి తెలంగాణకు అవసరమైన పారిశ్రామిక విధానం తయారైంది.

పరిశ్రమల అవసరం ఏమిటి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు మారుతాయని ప్రజలు ఎంతో ఆశతో ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయనే నమ్మకంతో ఉన్నారు. కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. ప్రపంచంలోని ఏ దేశంలో చూసినా రక్షణ, పోలీస్‌ రంగాలతో కలుపుకుని కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 20 శాతంగా ఉంటున్నది. మిగతా 80 శాతం ప్రైవేటు రంగంలోనే. సేవా, పారిశ్రామిక రంగాల్లోనే ఎక్కువ ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. ఐటి, సినిమా, మీడియా లాంటి రంగాలను కూడా పరిశ్రమలుగానే గుర్తిస్తున్నందున సేవా రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంలో భాగంగానే గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి 80 శాతం ఉద్యోగాల కల్పన 30 శాతం జిడిపి వాటా కలిగిన పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపై ఏర్పడింది. ఎక్కువ పరిశ్రమలు వస్తేనే ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఎక్కువ ఉత్పత్తులు ఇక్కడి నుంచి వస్తేనే, ఎక్కువ ఎగుమతులు జరుగుతాయి. అటు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇటు ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా, తెలంగాణలో అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు సమకూరాలన్నా పారిశ్రామికాభివృద్ధి మాత్రమే దిక్కు అని ప్రభుత్వం గట్టిగా నమ్మింది. కమ్యూనిస్టు దేశమైన చైనా కూడా ఇప్పుడు పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానానికి మొగ్గుచూపుతుండడం ఇక్కడ గమనార్హం.

కొత్త విధానం ఎందుకు?

సమైక్య ఆంధ్రప్రదేశ్‌ లో కూడా రాష్ట్రానికి ఓ పారిశ్రామిక విధానం ఉంది. దాన్నే యధాతథంగా వినియోగించుకోవచ్చు కదా, మళ్లీ కొత్త విధానం ఎందుకు అనే ప్రశ్న ఉదయించకమానదు. నిజానికి ఇప్పుడు పరిశ్రమల స్థాపన విషయంలో, పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య విపరీతమైన పోటీ ఉంది. ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకుని ప్రతీ రాష్ట్ర ప్రభుత్వం తరచూ విదేశీ పర్యటనలు చేస్తుండడం మనం చూస్తున్నాం. ప్రతీ పర్యటన ఉద్దేశ్యం పెట్టుబడులను ఆహ్వానించడమే. ఇంత పోటీ ఉన్న నేపథ్యంలో ఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉందో, ఏ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనుకూలమో పారిశ్రామిక వేత్తలు ఆ ప్రాంతానికే వస్తారు.

తెలంగాణ రాష్ట్రం, మరీ ముఖ్యంగా హైదరాబాద్‌ నగరం పరిశ్రమలకు చాలా అనుకూలమైన ప్రాంతం. ఇక్కడ భూకంపాల భయం లేదు. భూకంప ప్రభావ రహిత ప్రాంతం. తెలంగాణలో అతి తీవ్ర వాతావరణ పరిస్థితులుండవు. అంటే బాగా వేడి ఉండదు. బాగా చలి ఉండదు. పెను తుఫాన్లు రావు. సమశీతోష్ణ వాతావరణ మండలంలో ఉంది. ఈ వాతావరణం వల్ల పరిశ్రమల్లో పరికరాలు చాలా కాలం పాటు మన్నికతో ఉంటాయి. వాటి సామర్థ్యం కూడా చాలా కాలం ఉంటుంది. ఐటి రంగంలో డాటా కాపాడుకోవడానికి కూడా ఇలాంటి వాతావరణం చాలా అవసరం. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఐటి కంపెనీలు తమ డాటా బేస్‌ను హైదరాబాద్‌లోనే భద్రపరుస్తున్నాయి.

ఎల్‌ఐసి కూడా దేశవ్యాప్తంగా ఉన్న తమ ఖాతాదారుల వివరాలతో కూడిన డాటా బేస్‌ను హైదరాబాద్‌ లోని తమ ప్రధాన కార్యాయంలోనే భద్రపరిచింది. రక్షణ రంగానికి చెందిన పలు పరిశోధనా సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే ఉండడానికి, అమెరికా అధ్యక్షుడు వాడే హెలిక్యాప్టర్‌ విడిభాగాలు కూడా ఇక్కడే తయారు కావడానికి కారణం అదే. ఈ వాతావరణ, భౌగోళిక అనుకూలతలతో పాటు ప్రభుత్వం నుంచి కూడా మద్దతు, ప్రోత్సాహం ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఉండే పారిశ్రామిక వేత్తలు తమ కార్యక్షేత్రాలను హైదరాబాద్‌ కు మార్చుకునే అవకాశం ఉంది.