సరికొత్తగా బడ్జెట్‌ రూపకల్పన

kcrరాష్ట్రంలోని నిరుపేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేయవలసి ఉన్నది. రైతులకు సాగునీరు అందించడం కోసం ప్రాజెక్టులు నిర్మించాల్సి ఉన్నందున బడ్జెట్‌ రూపకల్పనలో ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉండే విధంగా చూడాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. 2016-17 బడ్జెట్‌ రూపకల్పనపై సచివాలయంలో ముఖ్యమంత్రి డిసెంబర్‌ 29న సమీక్ష నిర్వహించారు.

బడ్జెట్‌ రూపకల్పన సందర్భంగా గతంలో అనుసరించిన మూస పద్ధతిలో కాకుండా తెలంగాణ ప్రజల అవసరాలు, ప్రభుత్వ కర్తవ్యాలను గమనించి నిధుల కేటాయింపు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా అన్ని శాఖలు తాము చేసే పనులపై పూర్తి నివేదిక తయారు చేసి ఆర్థిక శాఖకు సమర్పించాలన్నారు. మంత్రులు ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి గత బడ్జెట్‌ లో కేటాయించిన నిధులు ఎన్ని? వాటిలో ఖర్చయినవి ఎన్ని ? ఇంకా ఏ ఖర్చులు ఉన్నాయి ? తమ శాఖ ద్వారా ఏ పనులు చేయాల్సి ఉంది? వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎన్ని నిధులు కావాలనే విషయంలో పూర్తి స్థాయి అంచనాలు రూపొందించాలని చెప్పారు. వాటికి అనుగుణంగానే బడ్జెట్‌ కేటాయింపులు జరపాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అంతర్గత సామర్థ్యం పెరగాలని, పన్నుల వసూళ్లు వందకు వంద శాతం జరగాలని ఆదేశించారు. దుబారాను బాగా తగ్గించడం ద్వారా ప్రణాళికేతర వ్యయాన్ని అదుపు చేయడం సాధ్యం అవుతుందన్నారు. ప్రణాళికేతర వ్యయాన్ని ఎంత తగ్గించగలిగితే అంత ఎక్కువగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రణాళికా వ్యయంలో రూ.25 వేల కోట్లను నీటిపారుదల ప్రాజెక్టులకు కేటాయిస్తున్నందున మిగతా నిధులను చాలా వ్యూహాత్మకంగా వినియోగించుకోవాల్సి ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించాల్సిన అభివృద్ధి లక్ష్యాలపై ప్రణాళిక శాఖ రూపొందించిన పుస్తకాన్ని ప్రణాళిక శాఖ కార్యదర్శి బిపి ఆచార్య ముఖ్యమంత్రికి అందించారు.

ముఖ్యమంత్రి నిర్వహించిన ఈ సమీక్షాసమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలి, కడియం శ్రీహరి, మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, ఈటెల రాజేెందర్‌, జగదీష్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు బి.ఆర్‌.రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, సిఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌ రావు, ఆర్థిక శాఖ కార్యదర్శులు రామకృష్ణారావు, శివశంకర్‌, ప్రణాళిక శాఖ కార్యదర్శి బిపి ఆచార్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.