నినాదాలు నిజమయ్యాయి

By: శ్రీపాద రమణ

ఏడున్నర దశాబ్ధాల దేశ ప్రగతిలో అధికారం కోసం పార్టీలు ఎంచుకోని నినాదాలు లేవు.. ఇవ్వని హామీలు లేవు. కానీ ఏదైనా పార్టీ అందులో విజయం సాధించిందా అంటే చెప్పలేని పరిస్థితి.. కానీ కేసిఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నమైన కొత్త చరిత్రను లిఖించుకుంటున్నది. ఓటు కోసం కాదు.. జనం కోసం పాటుపడతామని నిరంతరం శ్రమిస్తున్నది. ఆసాంతం నిర్విరామంగా అభివృద్ధి కోసం పరుగులు పెడుతోంది. ఈ ప్రయాణంలో అభివృద్ధి లెక్కల్లో యావత్‌ దేశాన్ని తెలంగాణ అవలీలగా దాటేసింది. తెలంగాణ జీఎస్డీపీ గ్రోత్‌ రేట్‌ దేశం కంటే ఎక్కువ, తెలంగాణ తలసరి ఆదాయం దేశం కంటే ఎక్కువ, తెలంగాణ విద్యుత్‌ వినియోగం దేశం కంటే ఎక్కువ, తెలంగాణ పారిశ్రామిక ప్రగతి రేటు దేశం కంటే ఎక్కువ, వ్యవసాయంలో, సామాజిక అభివృద్ధిలో ప్రతీదాంట్లోనూ తెలంగాణ ఒక నూతన శకానికి నాంది పలికింది. అచేతనులకు, నిరుపేదలకు భవ్యమైన బతుకును, భరోసాను అందిస్తున్నది.

ఈ ప్రస్థానంలో తెలంగాణ సర్కారు సరికొత్తగా పరిపాలన విధానాన్ని కొనసాగిస్తున్నది. కాగితాలపై నిధులు కేటాయించి.. ఇదే అభివృద్ధని నమ్మించిన గత పాలకుల దుర్నితికి చరమగీతం పాడిన కేసిఆర్‌ సర్కారు ‘‘అభివృద్ధిని’’ మానవీయ మార్గంలోకి మళ్లించింది. ప్రతీ పథకంలో, ప్రతీ కార్యక్రమానికి ఒక నిర్ధిష్టమైన సమయం నిర్ధేశించుకొని నిర్విఘ్నంగా పూర్తి చేస్తున్నది. అభివృద్ధి అంటే బరువు కాదు బాధ్యత అని,  ఎన్నికల నినాదాలు కాదు, పాలకుల బాధ్యత అన్నట్టుగా కేసిఆర్‌ సర్కారు కొత్తపంథాలో దూసుకుపోతున్నది. రాజకీయ వ్యవస్థను, అధికార యంత్రాంగాన్ని తరాజులో తూచినట్టు సమానంగా నడపగలిగిన పొలిటికల్‌ జీనియస్‌.. కేసిఆర్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడం వల్ల తెలంగాణ ప్రగతిలో గొప్ప గుణాత్మకమైన మార్పు కనిపిస్తున్నది. దశాబ్ధాలుగా ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోతున్నాయి. సరికొత్త మానవీయ అభివృద్ధి నినాదం పతాకమై తెలంగాణ మాగాణంపై రెపరెపలాడుతున్నది. కేసిఆర్‌ ప్రవేశపెట్టిన ఏ పథకమూ అంత ఆషామాషీగా ప్రకటించింది కాదు.. వేల గంటల మథనం, కోట్ల గుండెలను చేరే మనసుతో పురుడుపోసుకున్న పథకాలవి. ఐక్యరాజ్యసమితి ఈ శతాబ్ధానికి రూపొందించిన ‘‘సస్టనేబుల్‌ డెవలప్‌ మెంట్‌ గోల్స్‌’’ ను అక్షరాల ఆకలింపు చేసుకున్న పథకాలు. అది సూచించిన అంచనాలను అందుకున్న పథకాలు. అందుకే, కేంద్రంలోని ఏ సంస్థ నివేదికలోనైనా తెలంగాణ నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్నది. ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, విద్యా, వైద్యంలో గణనీయమైన ఎదుగుదలను నమోదు చేస్తున్నది.

కిలోమీటర్ల నడక తప్పింది – ఇంటి ముంగిటికే నల్లా వచ్చింది.

తెలంగాణ రాక ముందు ఎండకాలం వస్తే చాలు పేపర్లలో, టీవీల్లో.. బిందెలతో కిలోమీటర్లు నడుస్తున్న ప్రజల కష్టాల ఫోటోలు, లీడర్ల కార్లుకు బిందెలు అడ్డంపెట్టి నిరసనతెలుపుతున్న వీడియోలు. కానీ తెలంగాణ వచ్చాక రిపోర్టర్లు ఆ వార్తలే మరిచిపోయిండ్రంటే అబద్ధం కాకపోవచ్చు. ఈ జనరేషన్‌ పిల్లలకు ఆ నిరసనలు గురించి చెప్తే అవునా.. అని ఆశ్చర్యపోవచ్చు, కానీ అది చరిత్ర మిగిల్చిన, తనలో దాచుకున్న సత్యం, ఆనాటి పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం. దశాబ్ధాలుగా ఎన్నికల నినాదాల్లో నానుతున్న త్రాగునీళ్లను.. మిషన్‌ భగీరథ పథకంతో చెక్‌ పెట్టింది కేసిఆర్‌ సర్కారు. 23,890  గ్రామీణ పల్లెలు (రింగ్‌ రోడ్డు ఆవల) 653 మున్సిపాలీటీలోని వీలిన గ్రామాలు, 121 అర్భన్‌ లోకల్‌ బాడీలతో పాటు.. నిరుపేదల పిల్లలు చదువుకునే 22,882 ప్రభుత్వ పాఠశాలలు, 27,310 అంగన్వాడీ కేంద్రాలకు స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తూ ఔరా అనిపిస్తోంది. ఈ దేశంలో పట్నం నుంచి మారుమూల పల్లెదాక స్వచ్ఛమైన తాగునీటిని అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అంటే అతిశయోక్తి కాదు. 100శాతం మంచినీటి నల్లాలను, అన్ని గ్రామాలకు (Functional Household Tap Connections FHTC) అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్‌ 1. ఆరు దశాబ్ధాల్లో ఏ నాయకుడికి సాధ్యం కాని ఈ అద్భుతాన్ని కేసిఆర్‌ ప్రభుత్వం ఐదేండ్లలోనే చేసి చూపించింది. ఐరాస నుంచి మొదలుకుంటే ప్రపంచంలోని ప్రతీ సంస్థ  మిషన్‌ భగీరథను వేనోళ్ల కీర్తించడం తెలంగాణకు గర్వకారణం అనడంలో సందేహం లేదు.

బడిబాట పట్టిన సర్కారు

ఇప్పుడు తెలంగాణ విద్యార్ధులు, వృత్తి నిపుణులు ప్రపంచంలోని ప్రతీ దేశంలో కనిపిస్తున్నారు. కారణం తెలంగాణలో మెరుగైన విద్యా వసతులు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అనేక గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశంలోకెల్లా అత్యధిక గురుకుల విద్యాలయాలు కలిగిన ఏకైక  రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రవ్యాప్తంగా 973 గురుకుల పాఠశాలల్లో ఐదు లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది. గురుకులాల్లో చదివే ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం యేటా 1 లక్షా 25 వేల రూపాయలు వెచ్చిస్తున్నది. ప్రతీ విద్యాలయాల్లో, హాస్టళ్ళలో సన్నబియ్యంతో భోజనం పెడుతూ, ఉచితంగా పుస్తకాలు, ఏకరూప దుస్తులను అందజేస్తున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ ‘‘మన ఊరు – మన బడి’’ పథకం విద్యావ్యవస్థ రూపురేఖలను సమూలంగా మార్చనున్నది. ఈ కార్యక్రమం క్రింద పాఠశాలలను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్‌ లో 7,289 కోట్ల రూపాయలను కేటాయించింది. ప్రపంచీకరణలో తెలంగాణ బిడ్డలంతా సమాన అవకాశాలు అందుకోవాలంటే ఇంగ్లీషు తప్పనిసరి అయిపోయిన ఈ తరుణంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసి, అమలుకు ఆదేశించింది. ఇవి మాత్రమే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన, మహిళా విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా 46 మహిళా రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను, నర్సింగ్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నది. వరంగల్‌ లో కాళోజీ నారాయణ రావు హెల్త్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ.. తెలంగాణ విద్యా వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నది.

దళితబంధు – వెనకబడ్డ జాతులకు వరం

దళిత జాతి జాతకాన్ని మార్చే దళితబంధు పథకం ఇప్పుడు దేశమంత సంచలనం సృష్టిస్తున్నది. ‘‘దళితబంధు’’ ఓ సామాజిక ప్రయోగం అని దేశంలోని ప్రధాన పత్రికలు, మేథావి వర్గం వేనోళ్ల ప్రశంసిస్తోంది. పూర్తిగా వెనకబాటుకు, అణచివేతకు గురైన దళితుల స్వావలంబన, సమగ్ర అభ్యున్నతి కోసం దళితబంధు ఒక పరిష్కారంగా నిలుస్తున్నది. ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఉచిత గ్రాంటుతో ఉపాధి చూపెడుతున్నది. అంతేకాదు, దళితబంధు ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకం.. బ్యాంకు లింకేజీతో నిమిత్తం లేకుండా, తిరిగి చెల్లించ వలసిన అవసరం లేని పథకం. లబ్దిదారుడు తనకు నచ్చిన, వచ్చిన పనిని ఎంచుకునే అవకాశం కల్పించిన ఏకైక పథకం. పత్రాలు, ఆర్జీలు, ఫైరవీలు లేకుండా పక్కగా లబ్ధిదారుడికి చేరే స్వచ్ఛమైన కార్యక్రమం. అందుకే కేసిఆర్‌ సర్కారు అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తీసుకొని బడ్జెట్‌ కేటాయింపులను చేస్తూనే చక చక లబ్ధిదారులకు ఎంచుకున్న యూనిట్లను అందిస్తోంది. ఇందుకోసం 2021-22 ఆర్ధిక సంవత్సరంలో 4 వేల కోట్ల తో 40  వేల దళిత  కుటుంబాలకు లబ్ధిచేకూర్చింది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 1 లక్షా 75 వేల కుటుంబాలకు ఎంచుకున్న వివిధ యూనిట్లను అందించేందుకు 17,700  కోట్ల రూపాయలను బడ్జెట్‌ లో కేటాయించింది.

రైతుబంధు – రైతన్నల ఆత్మబంధు :

రైతుబంధు పథకం తెలంగాణ రైతన్నల పాలిట కల్పతరువుగా మారింది. ప్రతి పంటకు 5 వేల చొప్పున యేడాదికి ఎకరాకు 10 వేల రూపాయల పంట పెట్టుబడి సహాయం అందిస్తున్నది. స్వతంత్య్ర భారతదేశ చరిత్రలో ఏ పాలకునికి, ఏ నాయకునికి రాని ఆలోచన ఇవ్వాల దేశమంతా ఆచరించే స్థితికి పోయిందంటే పాలకుడిగా కేసిఆర్‌ సాధించిన విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పథకం కింద లబ్ధి పొందే రైతుల్లో 2.5 ఎకరాలున్న రైతులు 72.58శాతం ఉన్నరంటే చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో విమర్శకులు ఆలోచించవల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ పథకం కింది లబ్ధిపొందే రైతుల్లో 53.33శాతం బీసీలు, 13.19శాతం ఎస్సీలు, 12.76శాతం ఎస్టీలు ఉండటం సర్కారు అతిగొప్ప మానవీయ విధానాలకు తార్కాణమని చెప్పక తప్పదు. రైతుబంధు పథకం క్రింద 2021-22 లో తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించిన 7,412 కోట్ల రూపాయల  పెట్టుబడి సహాయంలో బీసీలు 48శాతం, ఎస్టీలు 13శాతం ఎస్సీలు 9శాతం ఉండటం గమనించాల్సిన విషయం. అంటే 5,188 కోట్ల రూపాయలు కేవలం బలహీన వర్గాలు, బడుగులు మాత్రమే అందుకోవడాన్ని మించిన మానవీయ పాలన ఏముంటుంది.?

ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అందరికి అన్నదానం చేయాలని ఉంటుంది. కానీ ఆత్మగౌరవంతో బ్రతికే పల్లెజనం అడుక్కొని తినడానికి ఒప్పుకోరు. దీంతో వ్యక్తిగత పనుల మీద, చికిత్స కోసం హైదరాబాద్‌ కు వచ్చిన అనేకమంది పేదలు.. భోజనం చేయలేక పస్తులుండటం, చివరికి అనారోగ్యం పాలుకావడం జరుగుతున్నదనే సూక్ష్మాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసిఆర్‌ 5 రూపాయల భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం అన్నార్తుల హృదయాలను కదిలిస్తున్నది. ఇప్పటికే దాదాపు 200 కేంద్రాల ద్వారా పెద్ద పెద్ద హాస్పటల్స్‌, బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌, కూలీలు వుండే ప్రాంతాల్లో అమలు చేస్తూ రోజుకు 50,000 మందికి భోజనం అందిస్తూ అన్నార్తుల చేత ప్రశంసలందు కుంటున్నది. రాష్ట్రంలో ‘‘అన్నమో రామచంద్రా’’ అనే మాట వినపడకుండా చేస్తున్నది. అందుకే.. 5 రూపాయలకే కడుపునిండా భోజనం చేసి ‘‘అన్నదాత సుఖీభవ’’ అంటూ అశీర్వదిస్తున్న వారి అశీర్వచనాలు నిస్సందేహంగా సర్కారుకు కొండంత అండగా ఉంటాయనడంలో సందేహం లేదు.

ఇవి మాత్రమే కాదు, పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఆనాదిగా వస్తున్న త్రాగునీళ్లు, సాగునీళ్లు, విద్యా, వైద్యంలాంటి ఎన్నికల నినాదాలను నిజం చేసింది. బంగారు తెలంగాణకు బాటలు వేస్తోంది. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలి.. కేసిఆర్‌ నాయకత్వం, వారి పథకాలు దేశమంతా విస్తరించాలి. దేశానికి వెలుగుబాటలు చూపించాలని ఆశిస్తూ.. సర్వేజన సుఖినోభవంతు.