|

తెల్ల మొకం

తెల్ల మొకంమేము పట్నమొచ్చి ఆర్నెల్లు అయ్యింది. ఆర్నెల్లు అయితె ఆల్లు ఈల్లు అయితరని అంటరు. మేము గూడ పట్నపోల్లమైనము. కాలేజి పట్నపోల్లతోని గూడ సోపతి జెయ్యబట్టినం. అంగ్రేజిల మాట్లాడబట్టినం. మమ్ములను జూస్తె ఊరోల్లని ఎవ్వరనుకోరు. సదువుడు తక్వ. సిన్మల జూసుడు ఎక్వ అయ్యింది. మాకు రమేశ్తోని దోస్తి అయ్యింది. గాడు మాలెక్క ఊరోడు గాదు. పట్నపోడు. గాడు పట్నంలనే బుట్టిండు. గాడు గూడ మా లెక్కనే బిఎస్సి సదువుతున్నడు. గానిల్లు మా కాలేజికి దగ్గర్లనే ఉన్నది. దినం దప్పిచ్చి దినం మేము గాల్లింటికి బోయెటొల్ల౦. గాల్లది ఇల్ల౦టె ఇల్లుగాదు. రొండంత్రాల బంగ్ల.

రమేశ్ ఇంట్ల ఫోన్ ఉన్నది. ఇంతకు ముందు ఎవరింట్ల బడితె గాల్లింట్ల ఫోన్ ఉండేది గాదు. బగ్గ పైసునోల్ల ఇంట్లనే ఫోన్ ఉండేది. గా వాడకట్టు ఒక్క రమేశ్ ఇంట్లనే ఫోన్ ఉన్నది. గా వాడకట్టు శాన మంది దోస్తులకు, సుట్టాలకు గా ఫోన్ గొట్టి మాట్లాడెటొల్లు. గసుంటొల్లు ఎక్వ అయ్యె బట్కె ఫోన్ బిల్లు ఎక్వ కాబట్టింది. ఇగ దాంతోని ఈ ఫోన్ గొట్టేటోల్ల దగ్గర నుంచి రమేశ్గాని నాయిన పైసల్ వసూలు జెయ్యబట్టిండు.

మేము ఎప్పుడు బోయినా ఫోన్ల ఎవరితోనో ఒకరితోని ముచ్చట బెట్టుకుంట రమేశ్ గండ్లబడెటోడు. ఒక్కోసారి రమేశ్గాని ఇంటికాడ పదిమంది గండ్లబడెటొల్లు. గాల్లoదరు ఫోను కోసం వొచ్చినోల్లే.గీడెందుకున్నవు అని గాల్లల్ల ఒగన్ని అడిగితె గీ సైయంనే మా బావ ఫోన్ జేస్తనన్నడు. గాయిన ఫోన్ కాల్ గురించి ఎద్రుజూస్తున్న అని గాడు జెప్పిండు.
ఫోన్ కాల్ కోసం వొచ్చెటొల్లు ఎక్వ అయిండ్రు. గాల్లు జెయ్యబట్కె రమేశ్గాని ఇంట్ల లొల్లి ఎక్వ అయ్యింది. గంతే గాకుంట ఇంట్ల అందరికి నెత్తినొప్పి లెవ్వబట్టింది. గిట్లయితె పనిగాదని ఫోన్‌కాల్ గురించి వొచ్చెటొల్లు గూడ పైసలియ్యాని రమేశ్ గాని నాయిన జెప్పిండు. గాయిన దెబ్బకు ఫోన్ కాల్ గురించి వొచ్చెటొల్లు తక్వ అయ్యిండ్రు. గాని రమేశ్ గాని నాయిన గురించి చెడ్డగ చెప్పుకోబట్టిండ్రు. రమేశ్ గాని ఇంట్ల ఫోన్ బెట్టిపిచ్చి యాడాది అయ్యింది. పోరగానికి బర్త్‌డే జేసిన తీర్గ ఫోన్‌కు గూడ పుట్టిన దినం జేసిండ్రు. గా దినం వాడకట్ట్లోందరిని బిల్సిండ్రు. కేక్ దెచ్చి కోసిండ్రు. అందరికి దావత్గూడ ఇచ్చిండ్రు. ఒకసారి రమేశ్ గాని ఇంటికి ఎవడో ఫోన్ జేసిండు. రమేశ్ గాడే ఫోన్ లేబట్టిండు.

హలో.. హలో.. నేను బావా! మీరు బాగున్నారా? బాగుండకుంటె ఎట్లుంటరు. బాగానే ఉన్నరనుకుంట. వొచ్చే అయితారం మా చెల్లెపెండ్లి ఉన్నది. పిల్లగాడు పట్నం ఇంజినీరు. గాల్లకు ఊర్లె పొలాలున్నాయి. పట్నం ల రొండు బంగ్లలున్నయి. గవ్విటి మీద నెలకు యాబైవేల రూపాల కిరాయొస్తది. పిల్లగానికి ఒక మోటర్ సైకిలే గాకుంట ఒక మోటర్ గూడ ఉన్నది. మీరందరు మూడు దినాల ముంగటనే మా వూరికి రావాలె. పెండ్లి పనులను సూడాలె. ఇంక పెండ్లి పత్రికలే పురాగ బంచలేదు. రేపు బంగారం గొనెతందుకు పట్నమొస్తున్న. ఇద్దరం గల్సి బజార్‌కు బోదాం. బంగారం గొందాం.

ఇంటి ముంగట పందిరి మేపియ్యాలె. ఇంటికి సున్నం గొట్టిపియ్యాలె. బట్టలు గొనాలె. బాజబజంత్రిలను మాట్లాడాలె. ఫోట్వలు గుంజెటోనికి బయాన ఇయ్యాలె. నువ్వు జల్ది మా వూరికి రా. నువ్వు గిన వొస్తె పెండ్లిపనులు జట్నయితయి. మా చెల్లెను తోల్కొనిరా. గామె వొస్తె ఇంటిపనులు జేస్తది. గామె వొస్తె మా అమ్మకు దైర్నమొస్తది. ఇంతకు ఎప్పుడొస్తవు. నేను గింతగనం మాట్లాడుతున్నా సప్పుడు జెయ్యవేంది, అని గాడు అడిగిండు.

రాంగ్ నంబర్ అని రమేశ్ అన్నాడు.

గా సంగతి ముందు గాల్లె జెప్పొద్దా అని గాడు అన్నడు.
నువ్వు నన్ను యాడ జెప్పనిచ్చినవు అని రమేశ్ అన్నడు.
గా దినం అయితారం. మా కాలేజి లేదు. ఇంట్ల గూసోని ఏంజేస్త అని అనుకోని రమేశ్గాని తాన్కి బోయిన, నేనెప్పుడు బోయినా రమేశ్ ఎవరితోని ఫోన్ల మాట్లాడ్తనే ఉంటడు. గాదినం గూడ ఎవ్వరితోనో రమేశ్‌గాడు ఫోన్ల ఒక్కతీర్గ మాట్లాడుతున్నడు.

చార్మినార్ చౌరస్త ఉన్న ఇరానీ హోటల్ల గూసో. నాలుగ్గొట్టంగ నేను వొస్త. ఇద్దరం గల్సి సుదర్శన్‌ల సిన్మా జూద్దాం. సిన్మ జూసినంక ప్యారడైజ్‌కు బోయి బిర్యాని తిందాం అన్కుంట ఎవరితోనో గాడు మాట్లాడుతుండు.

ఇంతల్ల ఒగాయిన ఆడ్కి వొచ్చిండు. గాయినను జూసి
ఏం గావాలె అని రమేశ్ అడిగిండు.
మీ ఫోన్ డెడ్ అయ్యిందని కంప్లేంట్ ఇచ్చిండ్రు గదా. మీ ఫోన్ బాగ జేసెతందుకు వొచ్చిన అని గాయిన అన్నడు.
గప్పుడు రమేశ్ గాని మొకం ఎట్లయ్యిందో జెబ్తె సాలదు. కుద్దు సూడాలె. ఇదువరదాంక డెడ్ ఫోన్ల గాడు ఉత్తుత్తగ మాట్లాడిoడు. ఫోన్ బట్కొని ఫోజిడ్సిండు.