ఈ విజేతలను స్ఫూర్తిగా తీసుకోవాలి : సీఎం

విశ్వ క్రీడా వేదికల మీద ఘన విజయాలతో స్వర్ణ పతకాలు సాధించి, తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఇషా సింగ్‌ లను రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఘనంగా సన్మానించి, ఆతిథ్యం ఇచ్చారు. అంతకుముందు పబ్లిక్‌ గార్డెన్‌లో జరిగిన వేడుకల్లో ఘనంగా సన్మానించి, చెరో రూ.2 కోట్ల నగదు బహుమతిని అందించారు. అనంతరం సీఎం వారిని వారి తల్లిదండ్రులను ప్రగతి భవన్‌ కు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చారు. మధ్యాహ్నం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం వారితో కాసేపు ముచ్చటించారు.

బాక్సింగ్‌ క్రీడపట్ల చిన్నతనం నుంచే మక్కువ చూపించడానికి గల కారణాలను, తాను గోల్డ్‌ మెడల్‌ సాధించడానికి పడిన శ్రమను నిఖత్‌ జరీన్‌ ను సీఎం అడిగి తెలుసుకున్నారు. స్వయంగా క్రీడాకారుడైన తన తండ్రి జమీల్‌ అహ్మద్‌ తనకు బాల్యం నుంచే అందించిన ప్రేరణ గురించి ప్రోత్సాహం గురించి నిఖత్‌ సీఎంకు వివరించారు. తాను బాక్సింగ్‌ లో శిక్షణ పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందని నిఖత్‌ జరీన్‌ సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కీలక సమయంలో అన్ని విధాలా సాయం అందించినందుకు సీఎంకు నిఖత్‌ జరీన్‌ ధన్యవాదాలు తెలిపారు.

నిఖత్‌ పట్టుదలను ఆత్మస్థైర్యాన్ని సీఎం అభినందించారు. తెలంగాణ క్రీడాకారులకు తాను ఎల్లవేళలా అండగా వుంటానని, క్రీడారంగాన్ని ప్రోత్సహించి, రేపటి తరాలను శారీరకంగా మానసికంగా ధృఢంగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. పుట్టిన తెలంగాణ గడ్డకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా, నిఖత్‌ జరీన్‌ ఇషా సింగ్‌ లను చూసి తెలంగాణ యువతీ, యువకులు స్ఫూర్తి పొందాలని సీఎం పిలుపునిచ్చారు.

గత 2014 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తనకు నగదు బహుమతిగా 50 లక్షల రూపాయల చెక్కును అందిస్తూ, తన అభ్యర్థన మేరకు బాక్సింగ్‌ ఫోజిచ్చిన గతాన్ని నిఖత్‌ జరీన్‌ సీఎంకు గుర్తుచేసింది. ‘సార్‌ నేను మీరిచ్చిన స్ఫూర్తితోనే ఇంతటి విజయాన్ని సాధించాను. నేను విజయంతో తిరిగి వచ్చినందుకు మరోసారి ఆనాటి మాదిరి బాక్సింగ్‌ పిడికిలి బిగించండి..’ అని నిఖత్‌ జరీన్‌ సీఎంను మరోసారి కోరింది. పట్టుబట్టి విశ్వ విజేతగా నిలిచిన నిఖత్‌ జరీన్‌ పట్టుదలను, బాక్సింగ్‌ బరిలో ఆమె చూపిన ప్రతిభను మెచ్చుకున్న సీఎం నిఖత్‌ కోరిక మేరకు ఆమెతో కలిసి బాక్సింగ్‌ పిడికిలి బిగించి చిరునవ్వుతో అనుకరించారు. ఈ సందర్భంగా అక్కడ నవ్వులు వెల్లి విరిశాయి. తన అభ్యర్థనను మన్నించినందుకు సీఎంకు నిఖత్‌ ధన్యవాదాలు తెలిపింది.

తమ బిడ్డను ప్రోత్సహించి గోల్డ్‌ మెడల్‌ సాధించేందుకు దోహదపడడమే కాకుండా రూ. 2 కోట్ల నగదు బహుమతిని అందించి, విలువైన నివాస స్థలాన్ని ఇస్తున్నందుకు నిఖత్‌ జరీన్‌ తలిదండ్రులు జమీల్‌ అహ్మద్‌, పర్వీన్‌ సుల్తానాలు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

అదే సందర్భంలో… జూనియర్‌ ప్రపంచ కప్‌ షూటింగ్‌ పోటీల్లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఇషాతో కూడా సీఎం ముచ్చటించారు. చిన్నతనంలోనే షూటింగ్‌ క్రీడలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఇషాను అభినందించారు. తమ బిడ్డను గొప్ప క్రీడాకారిణిగా తీర్చిదిద్దిన ఇషా తల్లిదండ్రులు సచిన్‌ సింగ్‌, శ్రీలతను సీఎం మెచ్చుకున్నారు.

దాదాపు గంట పాటు క్రీడాకారులు వారి కుటుంబ సభ్యులకు ప్రేమపూర్వక ఆతిధ్యమిచ్చి, ఘనంగా సన్మానించిన సీఎం కేసీఆర్‌, శోభ దంపతులు, వారికి గౌరవ ప్రదమైన వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, ఎంపీసంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మల్యే గణేశ్‌ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, సీఎం కార్యదర్శి  భూపాల్‌ రెడ్డి, ప్రిన్సిపల్‌ సెక్రెటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.