|

మహాఒప్పందంతో ఊపందుకోనున్న పనులు

cmమహారాష్ట్ర ఒప్పందంతో ఇరిగేషన్‌ శాఖపై మరింత     బాధ్యత పెరిగిందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఆగస్ట్‌ 25 రోజు నాడిక్కడ ఐ.డి.సి. లో కాళేశ్వరంతో పాటు కరీంనగర్‌ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు.

మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలు, పంప్‌ హౌజ్‌లు, మిడ్‌ మానేరు, ఎల్లంపల్లి, తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను మంత్రి సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్‌ మంత్రి హరీష్‌ రావు ఇరిగేషన్‌, రెవిన్యూ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను మంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు భూసేకరణ పై కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌, రెవిన్యూ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల దగ్గర క్యాంప్‌లను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించాలని వర్కింగ్‌ ఏజెన్సీలను కోరారు. బ్యారేజీ, పంపు హౌజ్‌ల సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ పనులన్నీ ఏకకాలంలో జరగాలని సూచించారు. ఆగస్ట్‌ 23న ముంబయిలో తెలంగాణ, మహారాష్ట్ర సీఎంల మధ్య చారిత్రక ఒప్పందం పూర్తయిన నేపధ్యంలో ప్రాజెక్టు పురోగతిని నిరంతరం సమీక్షించాలని ఇంజనీర్లను మంత్రి సూచించారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఇదివరకే చేపట్టిన ప్యాకేజీలు 6,7,8,9లలో భూసేకరణలు పూర్తి చేయాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మరింత ఊపందుకోనున్నాయి. ఈ ప్రాజక్టులో అంతర్భాగంగా గతంలో ప్రారంభించిన పంపుహౌజ్‌ల నిర్మాణం పూర్తి చేయడానికి నిర్ణీత కాలవ్యవధిని ఇదివరకే ఖరారు చేశారు. ఇటీవల రాష్ట్ర నీటిపారుదల మంత్రి టి.హరీష్‌ రావు సెక్రటేరియట్‌లో కాళేశ్వరంపై సుదీర్ఘంగా చర్చించారు. బి.హెచ్‌.ఇ.ఎల్‌, ట్రాన్స్‌ కో, నీటిపారుదల శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరు వరకు చేపట్టిన ప్యాకేజీ – 6, ప్యాకేజీ – 8 లకు సంబంధించిన పంపుహౌజ్‌ల నిర్మాణాన్ని 2017 జూలై చివరి నాటికి పూర్తి చేసి నీరందించాలని మంత్రి హరీష్‌ రావు ఆదేశించడం జరిగింది. అలాగే ప్యాకేజీ – 10, 11, 12ల పంప్‌హౌజ్‌లను 2017 సెప్టెంబర్‌ కల్లా పూర్తి చేస్తారు. ప్యాకేజీ – 20కి చెందిన పంప్‌ హౌజ్‌ నిర్మాణాన్ని 2017 డిసెంబర్‌ లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా వేమునూరు, గంగాధర, మేడారం పంపు హౌజ్‌ల వెట్‌ట్రయల్‌రన్‌ను సెప్టెంబర్‌ 5న ప్రారంభించేందుకు పనులు వేగవంతం చేయాలని మంత్రి హరీష్‌ రావు ఈ సమీక్షలో ఆదేశించారు.

ఎల్లంపల్లిలో మిగిలిపోయిన 920 ఎకరాల భూమిని యుద్ధప్రాతిపదికన సేకరించాలని కోరారు. ఇది పూర్తయితే ఈ ప్రాజెక్టు కింద 1,65,000 ఎకరాలకు ఆయకట్టు జరుగుతుందని మంత్రి గుర్తు చేశారు. తోటపల్లి ప్రాజెక్టు కోసం సేకరించిన 1600 ఎకరాలను తిరిగి గ్రామస్తులకే వాపసు ఇచ్చే అంశాన్ని చర్చించారు. ఇందులో 117 ఎకరాలు లింక్‌ కెనాల్‌ కోసం వినియోగిస్తున్నట్లు మంత్రి తెలిపారు.చందుర్తి, కోనరావుపేట, వేములవాడ, కొడిమ్యాల మండలాల్లో భూసేక రణను పూర్తి చేయాలని ఆదేశించారు. గౌరవెల్లి, గండిపల్లి భూసేకరణ పనులను కూడా సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం పంపు హౌజ్‌లకు సంబంధించి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీష్‌ రావు కోరారు.

ఈ సమావేశానికి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌, ఎంపీలు, బాల్క సుమన్‌, బి.వినోద్‌, ఎంఎల్‌ఏలు పుట్ట మధు, విద్యాసాగరరావు , సతీష్‌, చెన్నమనేని రమేష్‌, గంగుల కమలాకర్‌, చీఫ్‌ ఇంజనీర్లు ఎన్‌.వెంకటేశ్వర్లు, బి. హరిరామ్‌, అనిల్‌, ఇరిగేషన్‌ శాఖ ప్రభుత్వ సలహాదారు ఆర్‌. విద్యాసాగర్‌రావు , ఇఎన్‌ సి మురళీధరరావు ,స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్కే. జోషి , సెక్రటరీ వికాస్‌ రాజ్‌, ఓఎస్‌ డి శ్రీధర్‌ రావు దేశ్‌ పాండే పాల్గొన్నారు.