|

పాలమూరు చరిత్రకు సాక్షి భూతం ఈ మ్యూజియం

By: యు.వెంకటేశ్వర్లు, మహబూబ్‌ నగర్‌

దేశంలో పాలమూరు జిల్లా పేరు తెలియని వారు ఉండరు. అంతేకాక  అగ్గి పెట్టెలో పట్టె గద్వాల చేనేత చీరలు, కొత్తకోట చేనేతలు, నారాయణపేట కంబళ్లతో పాటు, పాత రాతి యుగం,మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం ఆనవాళ్లకు ఎన్నో శిల్పాలు,శాసనాలు,దేవాలయాలు, పనిముట్లు, మరెన్నో  అద్భుత కట్టడాలకు నిలయం ఈ జిల్లా. నిజాం మీర్‌ మహబూబ్‌ అలీఖాన్‌  అనంతరం పాలమూరుజిల్లా మహబూబ్‌నగర్‌ జిల్లాగా మారింది.

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా ప్రాంతాన్ని పూర్వం నందులు, మౌర్యులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు, కందుకూరు చోళరాజులు, కాకతీయులు, బహుమనీ సుల్తానులు, కుతుబ్‌ షాహీలు, నిజాంలు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ రాజవంశాలతో పాటు అంతకు ముందు పాత, మధ్య, కొత్త రాతి యుగాలకు సంబంధించిన కట్టడాలు, శిల్పాలు, శాసనాలు, ఆనాటి ప్రజలు వాడిన పనిముట్లు, వస్తువులు కోకొల్లలు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో బయటపడ్డాయి.   

జిల్లాలోని అమ్రాబాద్‌ ప్రాంతంలో జరిపిన తవ్వ కాలలో పాతరాతి యుగపు పనిముట్లు దొరికాయి. అంతేకాక ఇక్కడే డాల్మన్‌ సమాధులు కూడా కనుగొన బడ్డాయి. ఇలాంటివి కేవలం తమిళనాడులోని కోయం బత్తూరు జిల్లా ఫలనిలో, మధ్యప్రదేశ్‌లోని దుర్గ జిల్లా ధనోర్‌ వద్ద, ఈజిప్టు దేశంలోని తుమాస్‌లలో మాత్రమే కనుగొన్నారు. అంతేకాక అచ్చంపేట సమీపంలో నడింపల్లి వద్ద జంతువులను వేటాడి చంపి వాటి చర్మాన్ని తీసి ఉపయోగించిన నునుపైన పాతరాతి యుగపు రాళ్లు కనుగొనబడ్డాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా పెద్ద మరూర్‌లో కొత్త రాతియుగం నాటి మృణ్మయ పాత్రలు తవ్వకాలలో బయటపడ్డాయి.

శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని అనేక గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఈ గ్రామాలలోని దేవాలయాలు, శిల్పాలు, శాసనాలు, రాతి పనిముట్లు ముంపుకు గురై వాటి అస్తిత్వాన్ని కోల్పోయే సందర్భంలో వీటన్నిటిని సేకరించి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఒక మ్యూజియంగా ఏర్పాటు చేశారు.

మహబూబ్‌నగర్‌ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఆసియా ఖండంలోనే అరుదైన పిల్లలమర్రి మహావట వృక్షం సమీపంలో 2 ఎకరాల విస్తీర్ణంలో పురావస్తుశాఖ మ్యూజియాన్ని ఏర్పాటు చేసి వీటన్నిటిని భద్రపరిచారు. 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ మ్యూజియాన్ని ప్రారంభించారు. అయితే శిల్పాలు, చిత్రాలు, పనిముట్లు ఎక్కువ సంఖ్యలో ఉండటం, ఇవన్నీ పాత భవనంలో ఉండటం, మరికొన్ని ఆరు బయటనే         ఉండటం, వాతావరణ పరిస్థితుల వల్ల వాటి ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని పసిగట్టి వాతావరణ పరిస్థితులు తట్టుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం 2019లో ఇక్కడే నూతన భవనాన్ని నిర్మించి కొత్త మ్యూజియంను ప్రారంభించి అందులో ఉంచడం జరిగింది. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఈర్లదిన్నె, పూడూరు, కొప్పునూరు, నంది వడ్డేమాన్‌, అలంపూర్‌, ఇంద్రకల్‌, ఆవంచ, పానుగల్‌తో పాటు స్టేట్‌ మ్యూజియం నుండి శిల్పాలను, శాసనాలను, పనిముట్లను, చిత్రాలు, నాణేలను సేకరించి ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది.  

ఈ మ్యూజియంలో క్రీ.శ. 3,4 శతాబ్దాలనుండి 19వ శతాబ్దం వరకు సేకరించిన శిల్పాలు, శాసనాలు, కాంగ్రా చిత్ర లేఖనం, యుద్ధ దృశ్యాలు, అజంతా, ఎల్లోరా చిత్రాలు, సూక్ష్మ రాతి పనిముట్లు, పురాతన నాణేలు, పంచలోహ పాత్రలు, సూక్ష్మ చిత్రాలు, బిద్రి వస్తువులు, ఆయుధాలు, కాంస్య విగ్రహాలు, సున్నపు ప్రతిమలు, పింగాణీ, ఏనామిల్‌, సెలడన్‌ పాత్రలు, ప్రాచీన, అరుదైన నాణేలు ఉన్నాయి.

ఈ మ్యూజియంలో పాత, మధ్య, నూతన  రాతి యుగం, శిలాయుగం నాటి వస్తువులు, పని ముట్లు, పాత్రలు, ఎరుపు, నలుపు సున్నంతో తయారు చేసిన పాత్రలు, ఇనుప వస్తువులు ఉన్నాయి. ఇవే కాక క్రీస్తు శకం 3, 6, 7, 10, 17, 19వ శతాబ్దంలో లభించిన కత్తులు, యుద్ధ సమయంలో వాడే ఆయుధాలు,ఇతర పనిముట్లు, 400 సంవత్సరాల చరిత్ర కలిగిన బిద్రీ వస్తువులు ఇక్కడ ఉన్నాయి. సింధు నాగరికత కాలానికి చెందిన క్రీస్తుపూర్వం 2500 సంవత్సరంలో మొహంజదారో తవ్వకాలలో లభించిన  కాంస్య విగ్రహాల గురించి మనకు తెలుస్తున్నది. అలాంటి కాంస్య విగ్రహాలు ఇక్కడున్నాయి.అదేవిధంగా క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం 3,5 శతాబ్దాల నాటి పనిముట్లు ఉన్నాయి. మరో విశేషం  పింగాణీ పాత్రలు కూడా అతి ముఖ్యమైన వాటిలో ఒకటి. ఇక్కడి మ్యూజియంలో ఉంచిన పింగాణీ పాత్రలు క్రీస్తు శకం 6,7 శతాబ్దాలలో చైనాలో తయారైన వాటిగా చరిత్ర చెబుతున్నది. చైనాలోని మింగు రాజుల కాలంలో పింగాణీపై వేసిన రంగులు పర్షియా, సిరియా, కుమ్మరుల  నుంచి చైనీయులు నేర్చుకున్నట్లు తెలుస్తున్నది. ఇవన్నీ ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి.

అంతేకాక సెలేడన్‌ పాత్రలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, దాదాపు 2000 సంవత్సరాల నుంచి చైనాలో కొనసాగుతున్న కళ ఈ సెలడన్‌ పాత్రలు. ముఖ్యంగా ఈ పాత్రల ప్రాముఖ్యత ఏమిటంటే  విషం కలిపిన ఆహార పదార్థాలు ఈ పాత్రలో వేసినప్పుడు  రంగు మారటం లేదా పగిలిపోవటం జరుగుతుంది. ఇవి హైదరాబాద్‌లోని స్టేట్‌ మ్యూజియంలో కూడా ఉన్నాయి.

ఈ పురావస్తు ప్రదర్శన శాలలో 10వ శతాబ్దానికి చెందిన పార్శ్వనాథుని అతి పెద్దదైన విగ్రహాన్ని చూడవచ్చు. 7 వ శతాబ్దపు  గ్రానైట్‌తో చేసిన చాముండి విగ్రహం, వైష్ణవి, బుద్ధ విగ్రహాలను, భైరవ, కుంబాండ, వీరభద్ర, ద్వార పాలక, స్త్రీ, గణపతి విగ్రహాలను చూడవచ్చు.

అంతేకాక శ్రీశైలం ముంపు గ్రామమైన ఈర్లదిన్నె లో విజయనగర వాస్తు శైలిలో నిర్మాణం చేసిన శ్రీ రాజరాజేశ్వరీ సహిత రామలింగేశ్వర ఆలయాన్ని అక్కడినుండి తరలించి ఇదే  ఆవరణలో పునర్నిర్మించారు. 1983లో పునఃప్రతిష్టించిన ఈ దేవాలయ శిల్ప చాతుర్యం, విశిష్టత, తప్పనిసరిగా ఒక్కసారైనా చూసి తీరాల్సిందే.

మొత్తానికి ఈ మ్యూజియం లో పాత పాలమూరు  జిల్లా చరిత్ర మొత్తాన్ని  తెలుసుకోవచ్చు. అంతేకాక రాజరాజేశ్వరి ఆలయం, 750 ఏండ్ల చరిత్ర కలిగిన అరుదైన  పిల్లలమర్రి, ఆ పక్కనే ఉన్న సైన్సు మ్యూజియం, జింకల పార్కు, మినీ జూ, సందర్శకులకు విజ్ఞానంతో పాటు, వినోదాన్ని కలిగిస్థాయి.

ఈ మ్యూజియం పక్కనే మరో 2 ఎకరాలలో  ఆర్కెయాలాజికల్‌ పార్కును ఏర్పాటు చేయనున్నారు. ఇందులో పాత రాతి యుగం మొదలుకొని ఇప్పటి వరకు మానవుని శిల్ప ప్రదర్శన, ముంపుకు గురైన దేవాలయాలు, కృష్ణా నది  మాడళ్లతో పాటు, ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌,హెరిటేజ్‌ హోటల్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌, ఫుడ్‌ కోర్ట్‌ వంటివి నిర్మించేలా ఒక ప్రాజక్టును మంజూరు చేయించారు రాష్ట్ర పురావస్తు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్‌ వి.శ్రీనివాస్‌ గౌడ్‌.