నగరానికి నాలుగు చెరగులా ‘టిమ్స్’
సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాల లాగానే తెలంగాణ ప్రాంతంలోని వైద్య, ఆరోగ్య రంగానికి కూడా తీరని అన్యాయమే జరిగింది. హైదరాబాద్ నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా నిర్వహిస్తున్న గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నీమ్స్, ఫీవర్ ఆస్పత్రి, చెస్ట్ ఆస్పత్రి, మానసిక చికిత్సాలయం మొదలైనవన్నీ నిజాం పరిపాలనా కాలంలో నిర్మించినవే.సమైక్యపాలనలో ప్రభుత్వ పరంగా కొత్తగా వచ్చిన, చెప్పుకోదగిన ఆస్పత్రులు ఏమీ లేవు.
ప్రత్యేక తెలంగాణ అవతరణ అనంతరం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వివిదరంగాల అభివృద్ధిలో భాగంగా, రాష్ట్రంలోని నిరుపేదలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమలకు రూపకల్పన చేశారు. ముందుగా ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల కల్పన, అధునాతన వైద్యపరికరాలను సమకూర్చడం, వైద్యంతోపాటు 57 వైద్య పరీక్షలు కూడా ఉచితంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి జిల్లాలో డయాగ్నిస్టిక్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.
హైదరాబాద్ మహా నగరంలో బస్తీ దవాఖానాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసి బస్తీలలోని పేదలకు వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చారు. నగర వాసులతోపాటు, ఇరుగుపొరుగు జిల్లాల వారికి కూడా అందుబాటులో ఉండేవిధంగా నగరం నాలుగు వైపులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. దీనిలో భాగంగా గచ్చిబౌలీలోని స్పోర్ట్స్ విలేజ్ భవనాన్ని తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్ ) గా నామకరణం చేసి, 1500 పడకలతో ఇప్పటికే అందుబాటులోకి తేవడం జరిగింది. ఇప్పుడు 2,679 కోట్ల రూపాయలతో మరో మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్రత్రుల నిర్మాణానికి పరిపాలనా అనుమతి మంజూరు చేయడంతోపాటు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేతులమీదుగా ఒకేరోజున ఈ మూడిరటికి శంకుస్థాపన చేయడం కూడా విశేషం. ఎల్.బి.నగర్ లో 900 కోట్లతో, సనత్ నగర్ లో 882 కోట్లతో, అల్వాల్ లో 897 కోట్ల రూపాయల వ్యయంతో టిమ్స్ ఆస్పత్రులుగా వీటిని నిర్మించనున్నారు.
గతంలో కేవలం మూడు మాత్రమే ఉన్న వైద్యకళాశాలలను ఇకపై ప్రతి జిల్లాలో ఏర్పాటుచేయాలన్న లక్ష్యంలో భాగంగా ఇప్పటికే నాలుగు వైద్య కళాశాలు ప్రారంభించుకున్నాం. మరో ఎనిమిది కళాశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. రాగల రెండేళ్ళలో జిల్లాకో వైద్యకళాశాల లక్ష్యం నెరవేరనుంది. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులలో సిటీ స్కాన్, ఎం.ఆర్.ఐ, పరీక్షలు, డయాలసిస్ సేవలు అందుబాటులేకి తేవడంతోపాటు, మరికొన్ని ఆస్పత్రులలో క్యాథ్ ల్యాబ్ సేవలు కూడా అందుబాటులోకి తెచ్చింది.
ప్రభుత్వ ఆస్పత్రులలో పడకల సంఖ్య పెంచడం , ఉత్తమ వైద్య సేవలతోపాటు రోగులకు మంచి పౌష్టికాహారం కూడా అందించేందుకు బడ్జెట్ ను రెట్టింపు చేయడం జరిగింది.కే.సీ.ఆర్ కిట్స్ వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఫలితంగా ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవాల సంఖ్య పెరగటంతోపాటు మాత, శిశు మరణాలు కూడా గణనీయంగా తగ్గడం శుభ పరిణామం. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి త్వరలోనే ఆరోగ్య తెలంగాణ ఆవిష్కృతం కాగలదని ఆశిద్దాం.