అగ్రభాగాన నిలిస్తే పది కోట్ల నజరానా !

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్
పంచాయతీరాజ్‌ ఉద్యమ స్ఫూర్తితో గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ప్రగతి సాధనలో క్రియాశీల పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధికి పంచాయతీ రాజ్‌ ఉద్యమం, సహకార ఉద్యమం ఎంతగానో దోహదపడ్డాయని, ఆ ఉద్యమానికి పూర్వ వైభవం రావాలని చెప్పారు. నిర్ధేశిత లక్ష్యాలను ఛేదించి, గ్రామాల వికాసానికి కృషి చేయడంలో అగ్రగామిగా నిలిచిన జిల్లా పరిషత్‌లకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రగతినిధి నుంచి రూ.10 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు గంగదేవిపల్లి, ముల్కనూర్‌, అంకాపూర్‌ లాంటి ఆదర్శ గ్రామాల మాదిరిగా మారాలని సీఎం ఆకాంక్షించారు. కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్లు, వైస్‌ ఛైర్మన్లకు త్వరలోనే హైదరాబాద్‌లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వర్ధిల్లాలనే ప్రధాన లక్ష్యంతో రూపొందించిన కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం అమలులో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు.

కొత్తగా ఎన్నికైన జిల్లా పరిషత్‌ ఛైర్‌ పర్సన్లు, వైస్‌ ఛైర్‌ పర్సన్లతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమావేశ మయ్యారు. పంచాయతీ రాజ్‌ సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను, ప్రజాప్రతినిధుల బాధ్యతలను ముఖ్యమంత్రి కూలంకశంగా వివరించారు.

”జిల్లా పరిషత్‌ ఛైర్మన్లుగా, వైస్‌ ఛైర్మన్లుగా ఏకపక్ష విజయం సాధించినందుకు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మీరు పనిచేయబోయే ఈ ఐదేళ్ల కాలంలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, పనిచేసే ధైర్యాన్ని, అభినివేశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. మీరింకా ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షిస్తున్నాను. మీకు లభించిన పదవిని ఎంత గొప్పగా నిలబెట్టుకుంటే అంత మంచిది. ఎవరు కూడా పుట్టినప్పుడు అన్నీ నేర్చుకోలేదు. పరిస్థితులను బట్టి నేర్చుకుంటూ పోతారు. మనిషి చివరి శ్వాస విడిచేవరకు కూడా జ్ఞాన సముపార్జన చేసుకుంటూ పోవాలి. మన జీవితం చాలా చిన్నది. ఆ కాస్త సమయంలోనే మంచి పేరు తెచ్చుకోవాలి. అజ్ఞాని ఏ రోజైనా జ్ఞాని కాగలుగుతాడు కాని, మూర్ఖుడు జ్ఞాని కాలేడు. వాడు తనకే అన్నీ తెలుసు అనుకుంటాడు. అలా కాకుండా అన్ని విషయాలపై అవగాహన పెంచుకున్న వారే తాము ఎంచుకున్న రంగంలో ముందడుగు వేయగలరు. అన్ని విషయాల్లాగానే పంచాయితీ రాజ్‌ విషయాలను కూడా నేర్చుకునే ప్రయత్నం చేయాలి” అని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.

”పదవి వచ్చిన తరువాత మన సహజత్వాన్ని కోల్పోకూడదు. అలా చేస్తే మన వెనుక వున్న జనం నవ్వుతారు. లేనిపోని దర్పం తెచ్చుకోకూడదు. పదవి రాగానే మీరు మారిపోకూడదు. మనకు రావాల్సిన, దక్కాల్సిన గౌరవం ఆటోమేటిక్‌ గా అదే వస్తుంది. పెట్టుడు గుణాల కంటే, పుట్టుడు గుణం మంచిది అంటారు పెద్దలు. మన వ్యవహార శైలే మనకు లాభం చేకూరుస్తుంది. ప్రజలకు అనేక సమస్యలుంటాయి. వారు ఆ సమస్యల పరిష్కారం కొరకు మీదగ్గరికి వస్తారు. నాయకుల మంచి లక్షణం ఒకరు చెప్పింది వినడం. అదే మీరు చేయండి. ఓపికగా వారి సమస్యలను సావధానంగా వినండి. వాళ్ళను కూచోబెట్టి మర్యాద చేయండి. అప్పుడే వాళ్లకు రిలీఫ్‌ వస్తుంది. ఆ తరువాత వారి సమస్యలను ఎలా పరిష్కరించాలో ప్రయత్నం చేయండి. సహజత్వాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తే మంచి పేరు వస్తుంది. మంచిపేరుతోనే ఉన్నత స్థాయి వస్తుంది” అని సీఎం అన్నారు.

”మీలో ప్రతివారు మీమీ సామర్ధ్యాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి ఈ పదవుల్లోకి వచ్చారు. ఇదంతా మీమీ సత్ప్రవర్తన వల్లే. మంచి పనులు చేయడానికి పెట్టుబడులు అవసరం లేదు. సరళంగా మాట్లాడడమే ఏ రోజునైనా మనకు పెట్టని కోట. ప్రజా సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు ఎంతటి శ్రద్ధ కనబరుస్తున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. దీనివల్ల మనకు ఇంకా ఉన్నతావకాశాలు వస్తాయి. విజయాలు, అపజయాలు సర్వసాధారణం. కానీ, రాజకీయాల్లో ఉన్న వారు ప్రజలతో నిత్య సంబంధాలు కలిగి ఉండడం ప్రాథమిక లక్షణం” అని సీఎం చెప్పారు.

”గతంలో జడ్పీ ఛైర్మెన్లకు పెద్దగా పనిలేదు. ఇటీవల కేంద్ర ఆర్థిక సంఘాన్ని కలిసినప్పుడు మన వ్యవస్థ గురించి వివరించాను. ఇక్కడ జడ్పీ ఛైర్మెన్లకు మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ రాంక్‌ ఇచ్చామని చెప్పాను. వాళ్ళు ఇక ముందు క్రియా శీలకంగా పని చేస్తారని కూడా చెప్పాను. అవసరమైన సహాయం చేస్తామని ఆర్థిక సంఘం అధ్యక్షుడు మాట ఇచ్చాడు. ఏ విధంగానైనా మీ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆలోచన చేస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అన్ని అధికారాలు సంక్రమింప చేస్తాం. ఇంత ఏక పక్షంగా 32 జిల్లా పరిషత్‌ల ఎన్నిక ఫలితాలు ఎప్పుడూ రాలేదు. దాంతో పాటే మీకు బరువు, బాధ్యత పెరిగాయి. మీ పాత్ర ఉన్నతంగా వుండాలి. జిల్లాపరిషత్‌ క్రియాశీలకం కావాలి. మీ విధులు, బాధ్యతలు పటిష్టం కావాలి” అని సీఎం వివరించారు.

”పంచాయతీరాజ్‌ ఒక అద్భుతమైన ఉద్యమం. స్వాతంత్య్రం వచ్చిన ఆరంభ రోజుల్లో దీన్ని రూపకల్పన చేశారు. రాష్ట్రాలకు పాలనలో స్వతంత్రత వుండాలని, అది వికేంద్రీకరణ జరగాలని స్థానిక స్వపరిపాలనకు శ్రీకారం చుట్టారు. కేంద్రీకృత పాలన క్షేత్రస్థాయిలో ఫలితాలు రాబట్టలేదు. ఎక్కడికక్కడే అభివృద్ధి జరగాలని ఒక అద్భుతమైన ఉద్యమానికి ప్రాణం పోశారు. దీని మొట్టమొదటి పేరు కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌. జవహర్‌ లాల్‌ నెహ్రూ ప్రధానిగా వున్న కొత్త రోజుల్లో అమెరికా వెళ్ళినప్పుడు ఆ దేశాధ్యక్షుడు ఐసన్‌ హోవర్‌ ఆయనకు ఎస్కే డేను పరిచయం చేశారు. ఆయన భారతీయుడని, గ్రామీణ అమెరికా అభివద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాడని, అవి అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయని ఐసన్‌ హోవర్‌ నెహ్రూకు చెప్పాడు. ఆయన్ను అమెరికా అధ్యక్షుడు పొగడడం పట్ల సంతోషం వ్యక్తపరిచిన నెహ్రూ భారత దేశానికి రమ్మని ఎస్కే డేను ఆహ్వానించాడు. నెహ్రూ ప్రథమ పంచవర్ష ప్రణాళికలో భారతదేశ అవసరాలకు భిన్నంగా సత్వర పారిశ్రామికీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం తనకు అభ్యంతరమని, అది తప్పనీ, మొదట సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఆహార రంగంలో స్వయం సమద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనిడే సూచించారు. నెహ్రూ ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించాడు.


నెహ్రూ స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత మంత్రి మండలిలో, పార్టీలో ఎస్కే డే సలహా మీద చర్చించాడు. ఫలితంగా రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతాక్రమం మారింది. ఆధునిక దేవాలయాల పేరిట భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. అప్పటి ఆ మార్పువల్ల ఈ రోజున ఆహార రంగంలో స్వావలంబన వచ్చింది. నెహ్రూ తీసుకువచ్చిన మార్పువల్ల సంతోషించిన ఎస్కే డే భారత దేశానికి వస్తానని నెహ్రూకు లేఖ రాశాడు. అలా ఆయన ఇండియాకు వచ్చాడు. ఆయన్ను తక్షణమే రాజ్యసభ సభ్యుడిగాను, కాబినెట్‌ మంత్రిగానూ నెహ్రూ చేశారు. ఆయనకు కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ శాఖను కేటాయించారు. గ్రామీణ భారతాన్ని ఆయన చేతుల్లో పెట్టారు. ఆయన వెంటనే కార్యక్రమం మొదలుపెట్టారు. సరాసరి హైదరాబాద్‌ నగరానికి వచ్చి ఎన్‌ఐఆర్డీలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌ నుంచే యావత్‌ భారతదేశానికి పంచాయతీరాజ్‌ ఉద్యమాన్ని విస్తరింప చేశారు. అప్పట్లో ఆయన దేశంలోనే మొట్టమొదటి సమితి (పటాన్‌ చెరువు) అధ్యక్షుడిగా పి. రామచంద్రారెడ్డిని నియమించారు. అలా మొదలైంది పంచాయతీరాజ్‌ ఉద్యమం” అని సి.ఎం వివరించారు.

”చాలా కాలం పంచాయతీరాజ్‌ ఉద్యమ స్ఫూర్తితో స్థానిక సంస్థలు పనిచేశాయి. పారిశుధ్య కార్యక్రమం బ్రహ్మాండంగా వుండేది. దురదృష్ట వశాత్తు ఆ స్ఫూర్తి ఇప్పుడు కొరవడింది. 70 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా ఏ గ్రామానికి పోయినా అపరిశుభ్ర వాతావరణం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. గ్రామాల్లో మంచిగా ఏదీ జరగడం లేదు. పల్లెలు పెంటకుప్పల లాగా తయారయ్యాయి. ఎందుకీ క్షీణత? మంచినీళ్ల గోస ఎందుకు? తెలంగాణ ఎక్కడో లేదు…గ్రామాల్లోనే వుంది. గ్రామాలు మనం అద్భుతంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. మీరంతా విద్యాధికులు. పరిస్థితులను అర్థం చేసుకోగలరు. మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. భయంకరమైన గ్రామాల పరిస్థితులలో మార్పు రావాలి. అది గుణాత్మకమైన మార్పు కావాలి”.

”నేను స్వయంగా పంచాయతీ రాజ్‌ విషయంలో అవగాహనకు రావడానికి, ఎమ్మెల్యే గా వున్నప్పుడు ఎన్‌ఐఆర్డీలో శిక్షణకు పోయాను. అక్కడే హాస్టల్‌ లో ఆరు రోజులుండి ఏడురోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యాను. అలా పోవడం వల్ల నాకు పూర్తి అవగాహన వచ్చింది. మీరు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి”.

”గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించాం. పంచాయతీ రాజ్‌ చట్టం చాలా కఠినంగా వుంది. కార్యదర్శి చక్కగా పనిచేస్తేనే, అనుకున్న ఫలితాలను సాధిస్తేనే, మూడేళ్ళ తరువాత ఆయన సేవలను క్రమబద్దీకరిస్తాం. పంచాయతీ కార్యదర్శుల మీద పూర్తి నియంత్రణ మీదే. అలాగే డీపీవో, డీఎల్పీవో, ఈవోఆర్డీ, ఎంపీడీవోలతో బాగా పనిచేయించాలి. దీనికి సంబంధించిన ఆర్థిక, పరిపాలన, ఆజమాయిషీ అధికారాలను త్వరలోనే నిర్ణయిస్తాం. ఆర్నెల్లలో పూర్తి మార్పు కనబడాలి” అని సీఎం చెప్పారు.

ఏ జిల్లా పరిషత్‌ అగ్రభాగాన పోతే, ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి రు. 10 కోట్లు మంజూరు చేస్తాం. ఒకటి కంటే ఎక్కువ పరిషత్‌లు ముందుకు పొతే వాళ్ళకూ మంజూరు చేస్తాం. 32 జిల్లాలు కూడా అగ్రభాగాన నిలవాలి. దీనికి కొన్ని మార్గదర్శక ప్రమాణాలు ఏర్పాటు చేస్తాం.

”ఏ జిల్లా పరిషత్‌ అగ్రభాగాన పోతే, ఆ జిల్లాకు ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుండి రు. 10 కోట్లు మంజూరు చేస్తాం. ఒకటి కంటే ఎక్కువ పరిషత్‌లు ముందుకు పొతే వాళ్ళకూ మంజూరు చేస్తాం. 32 జిల్లాలు కూడా అగ్రభాగాన నిలవాలి. దీనికి కొన్ని బెంచ్‌ మార్క్స్‌, ప్రమాణాలు ఏర్పాటు చేస్తాం. నా కోరిక ఏమిటంటే మొత్తం అందరూ కలిసి రు.320 కోట్లు పొందాలని. ప్రతి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కు కొత్త కార్లు కొని ఇస్తాం. మీరు చాలా మంచి మార్పు తీసుకు రాగలమని ప్రజల్లో భావన తీసుకు రాగలిగితే అంతకన్నా గొప్ప లేదు. ప్రజల్లో బాగా తిరిగి పంచాయతీరాజ్‌ సంస్థను బలోపేతం చేయాలి. క్రియాశీలకంగా ఏ గ్రామానికి ఆ గ్రామమే అభివృద్ధి జరగాలంటే మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు నాయకత్వం వహించాలి. మీ కిందివారికి స్ఫూర్తి కావాలి. ఎలాగైతే తెలంగాణ సాధించామో అలాగే గ్రామాల అభివృద్ధి జరగాలి”

”మన ప్రభుత్వం మానవీయ కోణంలో ప్రవేశ పెట్టిన పెన్షన్‌ పథకం, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఆదరణ పొంది, ఎన్నికల్లో విజయానికి కారణమయ్యాయి. అందుకే వాళ్ల ఋణం మనం తీర్చుకోవాలి. దీనికి ఎక్కువ పాత్రధారులు మీరే. మండలాధ్యక్షులను మీలాగే తయారు చేయండి. నాలాగా మీరు కూడా వారికి అవగాహన కలిగించాలి. మీరు సందేశాత్మకంగా మాట్లాడాలి. ఆ స్థాయి రావడానికే మీకు శిక్షణ ఇప్పిస్తున్నాం. ఏ ఉద్యమ స్ఫూర్తితో ఎస్కే డే పంచాయతీరాజ్‌ను ప్రారంభించాడో, దాన్ని మనం ముందుకు తీసుకు పోవాలి. 60శాతం జనాభా వున్న గ్రామీణ ప్రజలకు మీరు నాయకత్వం వహించాలి. గ్రామాలను పట్టుకొమ్మల్లాగా చేయడంలో నిమగ్నమై పోవాలి. అలా చేసి మీ జీవితాలను ధన్యం చేసుకోండి. గొప్ప పేరు సంపాదించుకోండి. అందులో వున్న తృప్తి మరెందులోనూ లేదు. గ్రామీణ తెలంగాణను అన్ని రకాల బాగుచేయడానికి మీ శక్తి యుక్తులను ఉపయోగించండి. ప్రతి గ్రామం ఒక గంగదేవి పల్లి, ఒక అంకాపూర్‌, ఒక ముల్కనూర్‌ కావాలి” అని సి.ఎం. ఆకాంక్షించారు.

పదవి వచ్చిన తరువాత మన సహజత్వాన్ని కోల్పోకూడదు. అలా చేస్తే మన వెనుక వున్న జనం నవ్వుతారు. లేనిపోని దర్పం తెచ్చుకోకూడదు. పదవి రాగానే మీరు మారిపోకూడదు. మనకు రావాల్సిన, దక్కాల్సిన గౌరవం ఆటోమేటిక్‌ గా అదే వస్తుంది.

ఈ సమావేశంలో మంత్రులు మహమూద్‌ అలీ, అల్లోల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, జగదీశ్‌ రెడ్డి, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.