మిషన్‌ కాకతీయకు స్పందన అపూర్వం

saeతెలంగాణ సాధన కోసం సాగిన ఉద్యమంలో ప్రజలు ఆనాడు తమకు తోచిన పద్ధతుల ద్వారా ఉద్యమానికి చేయూతనిచ్చినారు. ఇవ్వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ‘మిషన్‌ కాకతీయ’ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి కూడా తెలంగాణ సమాజమంతా అలాంటి సంఫీుభావాన్ని , సహకారాన్ని అందిస్తున్నారు.

రైతులు స్వచ్చందంగా తమ స్వంత ఖర్చుతో పూడిక మట్టిని తమ పొలాల్లోకి తరలించుకపోతున్నారు. ఇదొక అపూర్వమైన సహకారం. కార్యక్రమం రూపకల్పన చేసేటప్పుడు రైతులు పూడిక మట్టిని స్వచ్చందంగా తరలించుకపోతారా లేదా అన్న సంశయం ఉండేది. అయితే సాగునీటి మంత్రి హరీష్‌రావు పది జిల్లాలు తిరిగి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేషాలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజా ప్రతినిధులకు పూడిక మట్టి పొలాల్లో చల్లుకుంటె వచ్చే లాభాలను విపులంగా వివరించి చెప్పడం , జిల్లాల పర్యటనల్లో వందలాది సభల్లో ఈ అంశాన్ని బలంగా వినిపించడంతో పూడిక మట్టి వాడకంపై ప్రజల్లో అవగాహన పెరిగింది. నిజానికి పూడిక మట్టి వాడకం గతంలో వున్నదే. మంత్రి చేసింది పూడిక మట్టి వాడకంపై ఇక్రిసాట్‌ పరిశోధనలను వివరించి రైతులను ఆ పాత పద్ధతికి మళ్ళించడం. వారికి చట్టపరమైన భరోసాని కల్పించడం. గతంలో చెరువులోకి అడుగు పెడితే కేసులు బుక్‌ చేసి వాహనాలను సీజ్‌ చేసి రైతులను వేధించే పరిస్థితి ఉండేది. ‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమం ప్రారంభం అయిన తర్వాత పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. సభలు చెరువు మధ్యలోనే జరుగుతున్నాయి. రైతులు పోటీ పడి మట్టిని తోలుకు పోతున్నారు. రైతుల ఈ స్వచ్చంద సహకారం ‘మిషన్‌ కాకతీయ’ను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నది.

పారిశ్రామికవేత్తల సహకారం!!

మిషన్‌ కాకతీయకు తెలంగాణ సమాజంలోని ఇతర వర్గాలు ఇస్తున్న సహకారం గురించి ముఖ్యంగా ప్రస్తావించుకోవాలి. మొదటగా ప్రస్తావించుకోవాల్సింది తెలంగాణ పారిశ్రామికవేత్తలు. వారు మిషన్‌ కాకతీయ కు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. చెరువులను దత్తత తీసుకొని చెరువు పునరుద్ధరణ పనులను స్వయంగా చేపట్టడం జరుగుతున్నది. మరికొందరు పూడిక మట్టిని తరలించేందుకు అవసరమయ్యే ఖర్చును భరించడానికి ముందుకు వచ్చినారు. హెటిరో డ్రగ్స్‌ కంపెనీ అధినేత పార్థసారథి రెడ్డి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 5 చెరువుల పునరుద్దరణ కోసం 2.5 కోట్ల రూపాయలను విరాళంగా అందజేసినారు. కావేరి సీడ్స్‌ అధినేత భాస్కరరావు కరీంనగర్‌ జిల్లాలో గట్ల నర్సింగాపూర్‌ చెరువు పునరుద్దరణ కోసం 2 కోట్ల రూపాయలను విరాళంగా అందజేసినారు. సైమెడ్‌ ల్యాబ్స్‌ అధినేత దొడ్డా మోహన రావు వరంగల్‌ జిల్లాలోని తమ స్వంత గ్రామం లింగగిరి లోని 3 చెరువుల పునరుద్ధరణకు, కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ చెరువు పునరుద్ధరణకు 1.5 కోట్ల రూపాయలను అందజేసినారు. క్రిడాయ్‌ సంస్థ వారు వివిధ ప్రాంతాల్లో 11 చెరువుల పునరుద్ధరణ ఖర్చుల కోసం ఇప్పటికే 75 లక్షల రూపాయలను ప్రభుత్వానికి అందజేసినారు. మరో 25 లక్షలను త్వరలోనే సమకూరుస్తామని వారు చెప్పినారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వారు వివిధ జిల్లాల్లో 13 చెరువులను దత్తత తీసుకొని పునరుద్దరణ పనులు చేపడుతున్నారు. మధుకాన్‌ షుగర్స్‌ అండ్‌ పవర్‌ ఇండస్ట్రీస్‌ వారు ఖమ్మం జిల్లాలో 10 చెరువుల పునరుద్ధరణ పనులను చేపడుతున్నారు. బైరి వెంకటరాజం గారు ఒక కోటి 16 లక్షల రూపాయలను మిషన్‌ కాకతీయకు విరాళాన్ని ఇచ్చినారు. బి వి రాజు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ చైర్మన్‌ విష్ణురాజు 50 లక్షలు , వరంగల్‌ జిల్లా మడికొండ చెరువు పునరుద్దరణ కోసం శోధన ల్యాబ్స్‌ అధినేత తోట గిరిధర్‌, అరబిందో ఫార్మా తరపున శరత్‌ చంద్రా రెడ్డి 25 లక్షల రూపాయలు విరాళం అందజేసినారు. వీరితో పాటు అనేక మంది తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందజేసినారు.

ఉద్యోగుల సంఫీుభావం

‘మిషన్‌ కాకతీయ’కు తెలంగాణ ఉద్యోగుల సహకారాన్ని, సంఫీుభావాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. తెలంగాణ ఉద్యోగులు రాష్ట్ర సాధనా ఉద్యమంలో చూపించిన తెగువ, పోరాట పటిమ అందరికీ తెలిసిందే. రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా రాష్ట్ర పునర్‌ నిర్మాణంలో కూడా తమ వంతు పాత్ర పోషిస్తామని వారు అప్పుడే ప్రకటించి ఉన్నారు. అన్నట్లుగానే మిషన్‌ కాకతీయకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. టి ఎన్‌ జి వో లు , టి జి ఓ లు , తెలంగాణ ఇంజనీర్లు, నాల్గవ తరగతి ఉద్యోగులు, మైన్స్‌ శాఖ ఉద్యోగులు ఇట్లా తెలంగాణ సమస్త ఉద్యోగ వర్గం తమ ఒక రోజు జీతాన్నిమిషన్‌ కాకతీయకు విరాళంగా అందజేసినారు. తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారులు ఒకటిన్నర రోజుల జీతాన్ని విరాళంగా అందజేసినారు. ఈ మొత్తం సుమారు 30 కోట్లు ఉంటుందని అంచనా. ఏప్రిల్‌ 19వ తేదీన తెలంగాణ జె ఎ సి , తెలంగాణ ఉద్యోగుల జె ఎ సి తెలంగాణ వ్యాప్తంగా చెరువుల్లో నిర్వహించిన ఒక రోజు శ్రమదానం కార్యక్రమం విజయవంతం అయ్యింది. వేలాది మంది శ్రమదానంలో పాల్గొన్నారు. ఖమ్మంజిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో లక్కారం చెరువు పునరుద్ధరణ పనుల ప్రారంభానికి ముందు లక్కారం రన్‌ నిర్వహించడం జరిగింది. మెదక్‌ , కరీంనగర్‌ జిల్లా పోలీస్‌ ఎస్‌ పి లు , డి ఎస్‌ పి ల ఆధ్వర్యంలో పోలీసుల శ్రమదానం కార్యక్రమాలు జరిగినాయి. వారి స్ఫూర్తితో అన్నిజిల్లాల్లో పోలీసులు చెరువు పునరుద్దరణలో పాలుపంచుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చిన్నారుల కిడ్డీ బ్యాంక్‌ విరాళం

ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం మిషన్‌ కాకతీయకు సిద్దిపేట చిన్నారులు రాగిని, నవ్యలు మంత్రి హరీశ్‌ రావు గారికి సమర్పించిన కిడ్డీ బ్యాంక్‌ విరాళం. కిడ్డీ బ్యాంక్ తెరిచినప్పుడు అందులో నుంచి బయటపడిన మొత్తం 443 రూపాయలు మాత్రమే. అయితేనేమి అది వెల కట్టలేని విరాళం. మిషన్‌ కాకతీయకు అందిన అద్భుతమైన సంఫీుభావం. ఆ చిన్నారులకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలియజేసినారు. వారి ఆదర్శం మరెందరికో స్పూర్తిని ఇస్తుందని ఆయన అన్నారు.

సాహిత్య సేవ :

తెలంగాణ కవులు , రచయితలు చెరువు పై టన్నుల కొద్ది సాహిత్యం వెలువరిస్తున్నారు. పాటలు రాస్తున్నారు. ఇప్పటికే డజనుకు పైగా కవిత్వ సంపుటాలు చెరువుపై వెలువడినాయి. పాటల సీడీలు వెలువడినాయి. పత్రికలలో అనేక వ్యాసాలు అచ్చయినాయి. టీవీల్లో ప్రత్యేక కథనాలు ప్రసారమయినాయి. జాతీయ స్థాయి పత్రికలు మిషన్‌ కాకతీయపై ప్రత్యేక కథనాలు ప్రచురించినాయి. యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిగతులపై, ముఖ్యంగా పూడిక మట్టి వినియోగం వలన పంట దిగుబడి, రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం, భూగర్భ జలాల పెరుగుదలపై మిషన్‌ కాకతీయ కార్యక్రమం సృష్టించే ప్రభావాలపై పరిశోధనలు చేస్తున్నారు. ప్రొ. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, జె ఎన్‌ టి యు ( హెచ్‌ ) వారు కుడా మిషన్‌ కాకతీయపై విద్యార్థులచే పరిశోధనలు చేయిస్తున్నారు. ఉస్మానియా ఇంజనీరింగ్‌ కాలేజీ సివిల్‌ డిపార్ట్‌ మెంట్‌ వారు ప్రతీ సంవత్సరం నిర్వహించే నిర్మాణ్‌ జాతీయ స్థాయి సింపోజియంలో మిషన్‌ కాకతీయపై రెండు ప్రత్యేక ఉపన్యాసాలను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో కార్యక్రమంపై అవగాహన కల్పించడానికి కృషి చేసింది. చివరి సంవత్సరం విద్యార్థులకు మిషన్‌ కాకతీయపై ప్రాజెక్ట్‌ వర్క్‌ అప్పగిస్తున్నట్లు సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ సింపోజియంలో ప్రకటించినారు. తెలంగాణ రాష్ట్ర గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌ మెంట్‌ కూడా మిషన్‌ కాకతీయ అనంతరం భూగర్భ జలాల పెరుగుదల , భూగర్భ జలాల నాణ్యత తదితర అంశాలపై విస్తృత పరిశోధనలు జరుపుతున్నది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే పునరుద్దరణకు ఎంపిక చేసిన చెరువుల మట్టి సార పరీక్షలు నిర్వహించి వాటి రిపోర్టులు జారీచేసినారు. వారు కూడా పూడిక మట్టి వాడకం వలన చేకూరే ప్రయోజనలను రైతులకు వివరిస్తున్నారు. దేశమంతా ‘మిషన్‌ కాకతీయ’ కార్యక్రమం అమలుపై , అది సృష్టించే ప్రభావాలపై ఆసక్తితో తెలంగాణ వైపు చూస్తున్నారు.

పలువురు ఎన్‌.ఆర్‌.ఐ.లు కూడా ఈ కార్యక్రమంపట్ల ఆకర్షితులై తమ తమ స్వగ్రామాలలోని చెరువుల పునరుద్ధరణకు, దత్తతకు ముందు వస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో జయప్రదంగా ముందుకు నడుస్తున్నది. ఇది రానున్న అయిదేండ్లలో తెలంగాణను హరిత తెలంగాణగా మారుస్తుందనడంలో సందేహం అవసరంలేదు.