|

ప్రధాని మెచ్చిన గిరిజన తాండ

నాడు మారుమూల గిరిజన తాండ..కరువు కాటకాలతో అలమటించి బతుకుజీవుడా అంటూ సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన తండావాసులు ఒక్కసారిగా మన్‌కి బాత్‌ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత మన్ననలు పొందారంటే ఆశ్చర్యమే మరి. కానీ ఇది అక్షరాల నిజం అని ఋజువు చేశారు తిమ్మాయిపల్లి తాండ గిరిజనులు.

పుష్కలంగా వర్షాలు పడితే కానీ మెట్ట పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి నుండి నేడు వేరుశనగ, మొక్కజొన్న, వరితో పాటు కూరగాయలు సాగు చేసే స్థితికి చేరుకున్నారు ఈ తండా వాసులు. ప్రధాన కారణం వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమాలను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అందిపుచ్చుకున్నారు. అందరి దష్టిని ఆకర్షించారు.

44వ నెంబర్‌ జాతీయ రహదారిపై అడ్డాకుల మండలం కాటవరం స్టేజి నుండి పది కిలోమీటర్ల దూరంలో గుట్టల
సమీపాన గల తిమ్మాయిపల్లి తాండాలో 423 కుటుంబాలు ఉంటాయి. అన్నీ గిరిజన కుటుంబాలే కావడం చెప్పుకోదగ్గ విషయం. నాడు తిమ్మాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఈ గిరిజన తండా నేడు పంచాయతీ గా అవతరించింది.

నైసర్గిక స్వరూపాన్ని బట్టి గుట్టలపై నుండి వచ్చే వర్షపునీటిని ఆపుకోగలిగితే భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవచ్చని ఉపాధిహామీ సిబ్బంది, అధికారులు చెప్పిన తర్వాత చాలాకాలానికి దాని పట్ల మొగ్గు చూపిన గిరిజనులు తమ సొంత భూమిలో కొంత భూమి నష్టపోయినా సరే కానీ ఊట కుంటల నిర్మాణం మాత్రం చేయాల్సిందేనని పట్టుబట్టారు. లక్ష్య అనే రైతు ముందుగా సాహసం చేసి రెండు ఎకరాల పొలం లెక్క చేయకుండా ఊట కుంట నిర్మాణానికి ముందుకు రావడంతో ముందుగా అక్కడ ఊట కుంట నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. తండా వాసులకు ఉపాధి హామీలో పని కల్పించారు.

కుంట నిర్మాణం అయ్యాక భూగర్భ జలాల వృద్ధిని గమనించిన మిగతా తండా వాసులు కూడా మనసు మార్చుకుని ఊట కుంటల నిర్మాణానికి ముందుకు వచ్చారు. దానితో ఈ ఒక్క తండాలోనే నాలుగు ఊట కుంటల నిర్మాణం చేపట్ట గలిగారు. 13 లక్షల 74 వేల 785 రూపాయల ఖర్చుతో 14 వేల 607 పని దినాలు కల్పించినట్లు మండల అభివృద్ధి అధికారి కె. ప్రభాకర్‌ చెప్పారు.

వర్షానికి ఒకసారి ఊట కుంటలు నిండితే కోటి 70 లక్షల లీటర్ల నీరు నిలుస్తుంది, రెండుసార్లు కుంటలు నిండితే మూడు కోట్ల 40 లక్షల లీటర్ల నీరు నిలవడం వల్ల ఊట కుంటల పరిసరాలలో ఉన్న బోర్లలో భూగర్భ జలాల వృద్ధి గణనీయంగా కనిపిస్తోంది. దానితోనే గిరిజన రైతులు నేడు వర్షాధారంగా కాకుండా బోర్ల కింద వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. కరువులు వలసల నుండి కర్షకులుగా మారారు. పుష్కలంగా వర్షాలు పడితేనే మెట్ట వ్యవసాయం చేసే దైవాధీన స్థితి నుండి వాననీటి సంరక్షణతో వేరుశనగ, వరి కూరగాయలతో పాటు మెట్ట పంటలు సాగు చేసుకునే స్థితికి చేరుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తిమ్మాయిపల్లి తండావాసులు. అందుకే ప్రధానమంత్రి దృష్టిని సైతం వారు చేపట్టిన జల సంరక్షణ విధానాలు ఆకర్షించాయంటే వర్షపు నీటి సంరక్షణలో అందరికీ వీరు ఆదర్శం అని చెప్పవచ్చు.

బాలస్వామి మల్యాల