| |

వెలుగు చూస్తున్న అడవిబిడ్డల కళ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగాక గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ముఖ్యంగా అడవులతో మమేకమై జీవిస్తున్న గోండులను అన్ని విధాలుగా మెరుగుపరిచి వారికి సౌకర్యవంతమైన జీవన విధానాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగా వారి కళలకు కూడా గుర్తింపు తేవాలని సంకల్పించింది. గోండు కళాకారులు తయారు చేసే కళాకృతులకు బహుళ ప్రాచుర్యం కల్పించి, మంచి మార్కెటింగ్‌ చేయించి, వారి కళలకు ప్రోత్సాహంతో పాటు వారికి ఆర్థికంగా కూడా లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నిస్తున్నది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ యువ కళాకారులకు అండదండలు అందిస్తున్నది. గోండు, కోయ, నాయక్‌పోడ్‌ జీవన సంస్కృతిని ప్రతిబింబించే పెయింటింగ్స్‌, డోక్రా మెటల్‌ క్రాఫ్ట్‌, పడిగెలు, మాస్క్‌ల వంటి కళాకృతులు మరుగునపడిపోకుండా వెలుగులోకి తెస్తున్నది. ఈ కళాకృతులకు విస్తృతస్థాయిలో మార్కెట్‌ను కల్పించేందుకు గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నాయక్‌పోడ్‌, ఓజా గోండు కళాకారులకు రూ.32.15 కోట్లతో సూక్ష్మ చెక్క ప్రతిమలు, డోక్రా మెటల్‌ క్రాఫ్ట్‌ యూనిట్లను ప్రభుత్వం మంజూరుచేయడం వల్ల భద్రాచలం, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలోని ఆ జాతి కళాకారులు రూపొందించే కళాకృతులు, పెయింటింగులకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరిగింది. ఎమ్మెస్సీ, బీఈడీ, సివిల్‌ ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువులు చదివిన గిరిజనులు, కళాత్మక వస్తువుల తయారీ యూనిట్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారంటే వారి కళలకు ప్రభుత్వం ఎంతగా ప్రోత్సాహం ఇస్తున్నదో తెలిసిపోతున్నది. వారు కళాకృతులు రూపొందించడమే కాకుండా ఇతరులకు జీవనోపాధి కల్పిస్తున్నారు. యువకళాకారులు సరికొత్త జీవనోపాధి పొందుతున్నారు. 

ఆదరణ పెరుగుతున్నది

గతంలో తమ కళలు బయటి ప్రపంచానికి తెలిసేవి కాదని నాయక్‌పోడ్‌ కళాకారుడు పసుల అంజన్‌కుమార్‌ తెలిపారు. ప్రభుత్వ సహకారంతో నాయక్‌పోడ్‌ కళకు ఇప్పుడిప్పుడే ఆదరణ వస్తున్నదని తెలిపారు. 

అమెజాన్‌లోనూ నా పెయింటింగ్స్‌

జైనూర్‌, ఆసిఫాబాద్‌కు చెందిన గోండు పెయింటర్‌ మడావి రాజేశ్వర్‌ మాట్లాడుతూ తాను వేసిన పెయింటింగ్స్‌ అమెజాన్‌లో కూడా అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. నా పేయింటింగ్స్‌ కావాలనుకునే వారు అమెజాన్‌లో ఆర్డర్‌ ఇవ్వొచ్చన్నారు.  ఇంత గొప్ప అదృష్టం నాకు ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ మా కళలో మార్పులు తెచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. 

మాకు ప్రత్యేక గుర్తింపు

ములుగు జిల్లా కన్నాయిగూడెంకు చెందిన కుస్రం శ్రీధర్‌ మాట్లాడుతూ.. డ్రాయింగ్‌లో టీటీసీ చేసిన. మా కథలు, గాథలను మా పెద్దవాళ్లు చెప్తుంటే విని వాటికి చిత్రరూపం ఇవ్వాలనుకున్నా. గండభేరుండ పక్షి పెయింటింగ్‌కు మంచి ఆదరణ లభిస్తున్నదని పేర్కొన్నారు. 

ప్రభుత్వ ప్రోత్సాహంతో కొత్త ఉపాధి

ములుగు జిల్లా, మంగపేటకు చెందిన వట్టం నవీన్‌ మాట్లాడుతూ తమ కళల్ని ప్రభుత్వం వెలుగులోకి తెస్తున్నదన్నారు. ఐటీడీఏల్లోనే కాకుండా హైదరాబాద్‌లోనూ ప్రభుత్వం తమ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిందని, అది ఎంతో ఉపయోగపడిరదని ఆనందం వ్యక్తం చేశారు.

‘నాయక్‌’ కళాకృతులను చూసి ముచ్చటపడ్డ రాష్ట్రపతి 

నాయక్‌పోడ్‌ గిరిజన కళాకారులు రూపొందించిన కళాకృతులను చూసి రాష్ట్రపతి ముచ్చటపడ్డారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా నాయక్‌పోడ్‌ కళాకృతులైన ‘శిరస్సు’లను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర గిరిజనశాఖకు పంపింది. అక్కడి నుంచి అవి రాష్ట్రపతికి చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తమ కళకు ఈ స్థాయి గుర్తింపు, గౌరవం లభించిందని నాయక్‌పోడ్‌ కళాకారులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.