అటవీ సిబ్బంది త్యాగాలు వృధాకావు

అమరులకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నివాళి

ప్రకృతికి సహాయపడి అహర్నిశలూ వనాల సంరక్షణలో తమ ప్రాణాలను సహితం ఫణంగా పెట్టే అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమాజానికి ఎంతగానో తోడ్పాటునందిస్తుంటారు. వీరి సేవలను గుర్తించి విధి నిర్వహణలో అసువులు బాసిన అటవీ సిబ్బందిని స్మరించుకోవడానికి ప్రతి యేటా దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినంగా  పాటి స్తున్నాం. రాజస్థాన్‌లో అడవులను రక్షించడంలో 363 మంది తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలకు గుర్తుగా దేశంలో సెప్టెంబరు 11న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అటవీ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటున్నాం. 

రాష్ట్రంలో 1984 నుంచి ఇప్పటివరకు 21 మంది అటవీ సిబ్బంది దుండగుల చేతిలో వీరమరణం పొందారు. ఈ యేడు అటవీ అమరవీరుల సంస్మరణ దినం సందర్బంగా అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అమరులకు ఘనంగా నివాళులర్పించారు.  జూ పార్కు వద్ద స్మారక చిహ్నంపై పుష్పగుచ్చాలు ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి, అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు. 

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి  ప్రసంగిస్తూ… అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ‘అటవీ అధికారులకు వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను’ అని అన్నారు. అటవీ సంపదను దోచుకునే దొంగలు, మాఫియా ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వృధాపోవన్నారు. వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 21 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో అమరులయ్యారని, ఇది చాలా బాధాకరమని అన్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీశాఖ అధికారులు, సిబ్బంది నిరంతర సేవలందిస్తున్నారన్నారు. ముఖ్యంగా అటవీ సంపదను కాపాడటంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారని తెలిపారు.      

కరోనా మహమ్మారి సంక్షోభం తలెత్తిన తొలి రోజుల్లో, ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొనాలో తెలియక ప్రపంచం యావత్తూ విస్మయం చెందిందని,  అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహితం అటవీ సంపదను కాపాడడంలో  సిబ్బంది తమ విధులను అణుమాత్రం కూడా విస్మరించలేదన్నారు. అటవీ సంపదను కాపాడడానికి అటవీ అధికారులు నిరంతరం సేవలు అందిస్తున్నారని, వారి రక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని, విధి నిర్వహణలో అమరులైన అటవీ అధికారులు, సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు.

‘‘అమూల్యమైన అటవీ సంపదను పరిరక్షించడానికి ప్రజల భాగస్వామ్యంతో ఎన్నో చర్యలు చేపట్టడం జరుగు తుంది జంగిల్‌ బచావో –  జంగిల్‌ బడావో అనే నినాదం ద్వారా ఇప్పటికే ఉన్న అడవుల రక్షణ, క్షీణించిన అడవుల పునరుజ్జీవనం కొరకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు పోలీసు శాఖతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశంతో అడవుల రక్షణ, స్మగ్లింగ్‌ కార్యకలాపాలను అరికట్టడం కోసం అనేక సమగ్ర చర్యలు తీసుకుంటున్నాం. కలప అక్రమ రవాణా అరికట్టడానికి సాయుధ పోలీసు దళాల సహకారం తీసుకోవడం జరుగుతుంది’’ అని మంత్రి తెలిపారు. ఇక అటవీ శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగులను, సిబ్బంది నియామ కాలను చేపట్టింది. ఇప్పటివరకు  90 FSOలను 67 FROలను 1857 FBOలను ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. ఇప్పటివరకు 53 FROలు, 1261 FBOలు 76 FSOలు విధుల్లో చేరారు. అంతే కాకుండా అటవీ అధికారులు, సిబ్బందికి 2173 వాహనాలను అందజేశారు.