అల్లీపురం గ్రామంలో తొలిసారి ఎగిరిన మువ్వన్నెల జెండా!

By: జి. దేవీప్రసాద్‌రావు

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సిద్ధిపేట తాలూకా అల్లిపురం గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. దేశమంతా స్వేచ్ఛా  వాయువులు పీల్చుకుంటున్న వేళ నిజాం సర్కార్‌ విధించిన నిషాన్‌ గస్తీ 53వ నిబంధన సాకుగా తీసుకొని రజాకార్ల దురాగతాలు అంతులేకుండా పోతున్న సందర్భంలో ముష్కర మూకలకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ  నాయకుల స్ఫూర్తితో 1947 సెప్టెంబర్‌ 1న గ్రామస్తులు సమావేశ మయ్యారు. విలీనానికి వ్యతిరేకంగా నిలిచిన నిజాం సైన్యంపై పోరాడాలని రాధాకిషన్‌ రావు నాయకత్వంలో నిర్ణయించడం జరిగింది. ఆ సమావేశంలో ఆంధ్ర మహాసభ నాయకులు గౌతంరావు, సోమలింగం, బసవ మానయ్య, కంది శ్రీనివాసరావు, గొల్ల లింగయ్య లాంటి నాయకులు ప్రజలకు దిశానిర్దేశం చేశారు. రాధా కిషన్‌రావు నాయకత్వంలో సిద్ధిపేట తాలూకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను చైతన్యవంతం చేయడానికి నాలుగు రోజులపాటు పెద్ద ఎత్తున అన్ని గ్రామాల్లో ప్రదర్శనలు చేశారు.

1947 సెప్టెంబర్‌ 4న కిష్టాపురం, ఎల్లాయిపల్లి, విఠలాపూర్‌, జక్కాపూర్‌, గుర్రాలగొంది, మల్యాల, నారాయణరావుపేట, పుల్లూరు, రామంచ, సికింద్లాపూర్‌, మల్లారం, రామునిపట్ల, మాచాపూర్‌, చిన్నకోడూర్‌, గంగాపూర్‌, అనంతగిరి గ్రామాలకు చెందిన యువకులు, గ్రామస్తులు దాదాపు పదివేల మంది నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న సందర్భంలో నిజాం సైన్యం ప్రదర్శనపై దాడిచేసి కాల్పులు జరిపింది. ఈ సంఘటనలో వడ్ల లక్ష్మయ్య అనే కార్యకర్త కాల్పుల్లో మరణించగా, అనేకమంది కార్యకర్తలకు గాయాలు అయ్యాయి.

నిజాం సైన్యం ముఖ్యమైన 120 మంది నాయ కులను అరెస్టు చేసి సిద్ధిపేటకు తరలించి, ఒక గదిలో నిర్బంధించారు. అందరిపై తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి బెదిరించి హింసించారు. ఇందులో నాయకత్వం వహిస్తున్న 21 మందిని చంచల్‌గూడ, హైదరాబాద్‌ జైలుకు తరలించారు. వీరిలో రాధా కిషన్‌ రావు, ఆదిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు ఉన్నారు. హైదరాబాద్‌ జైలులో అనేక మంది ఉద్యమ కారులను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్న గుండవరం రాధా కిషన్‌రావును ఔరంగాబాద్‌ జైలుకు తరలించి నిర్బంధించారు. ఔరంగాబాద్‌జైల్లో పక్క బ్యారక్‌లో జైలు అధికారులు తీవ్రంగా ఉద్యమ కారులను నిర్భంధానికి, హింసకు గురిచేస్తూన్న తరుణంలో రాధాకిషన్‌ రావు జైలు అధికారులపై దాడి చేయగా జైలు అధికారులు ఆయనను కరెంట్‌ షాక్‌తో హింసించారు. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగినప్పటికీ సిద్ధిపేట ప్రాంతంలో నిర్భందం కొనసాగింది. భారత సైన్యం సిద్ధిపేటలో ప్రవేశించి రజాకార్లను అరెస్టు చేసి తీసుకు వెళ్ళడంతో నిర్భందం ముగిసి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో సిద్ధిపేట ప్రాంతం ఉద్యమంలో ముందుభాగాన నిలబడడం చరిత్రలో నిలిచిపోయింది.

అల్లిపురం గ్రామంలో 1947 సెప్టెంబర్‌ 4న భారత జెండాను రాధా కిషన్‌రావు నాయ కత్వంలో ఎగరవేయడం చరిత్రలో నిలిచి పోయింది. హైదరాబాద్‌ సంస్థానంలో మొదటి జెండాగా నిలిచిపోవడం చరిత్రలో వ్రాయబడింది. స్వాతంత్రోద్యమ ప్రభావంతో తిరిగి 1969 తెలంగాణ ఉద్యమం ఇదే ప్రాంతంలో పెద్ద ఎత్తున కొనసాగింది. మలిదశ తెలంగాణ ఉద్యమం ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నేత కె. చంద్రశేఖర రావు నేతృత్వంలో 2001 నుండి 2014 వరకు పోరాటంలో నిలిచిన ప్రాంతంగా సిద్ధిపేట చరిత్రలో నిలిచి పోయింది. రాధాకిషన్‌రావు అల్లిపురం గ్రామంలో నిర్వహించిన అనేక పోరాటాలు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో నిలిచి పోయాయి. వారి ప్రభావంతో వారి కుమారుడు దేవీప్రసాద్‌రావు తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ఎన్జీవో సంఘం నాయకుడిగా అగ్రభాగాన నిలబడడం మరో చరిత్రగా నిలిచిపోయింది