ట్రిపుల్‌ ఆర్‌ ప్రాజెక్టు నిధులు విడుదల చేయండి

harish-raoచిన్ననీటి వనరులకు సంబంధించి కేంద్ర పథకమైన ట్రిపుల్‌ ఆర్‌ (రిపేర్స్‌, రినోవేషన్‌, రిస్టోరేషన్‌) ప్రాజెక్టు కింద రాష్ట్రానికి నిధులు విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు కేంద్ర జలవనరుల శాఖా మంత్రి ఉమాభారతికి విజ్ఞప్తి చేశారు. నవంబరు 3న ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులు చేపడుతున్న ‘మిషన్‌కాకతీయ’ పథకాన్ని ట్రిపుల్‌ ఆర్‌ ప్రాజెక్టు పరిధిలోకి తీసుకోవాలని ఆయన కోరారు. అలాగే నిజాంసాగర్‌ ప్రాజెక్టు ఆధునీకరణ, మోడికుంట వాగు ప్రాజెక్టులను ‘ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన’లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. వెంటనే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరారు.

దీనితో పాటు రాష్ట్రానికి చెందిన పలు సాగునీటి ప్రాజెక్టులపై ఉమాభారతితో హరీష్‌రావు చర్చించారు. మిషన్‌కాకతీయ మొదటి దశ విజయవంతమైందని, రెండవ దశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలని ఆయన కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. రాష్ట్రంలో మొత్తం 46,531 చెరువులు ఉండగా, మొదటి విడతలో 8,500 చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు. మిషన్‌ కాకతీయను ‘ట్రిపుల్‌ ఆర్‌’ ప్రాజెక్టు కిందికి తేవడానికి త్వరలో జరిగే సాంకేతిక సలహా కమిటీ ముందు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అలాగే భూగర్భజల మట్టం పెంపు కోసం కూడా 42 మండలాల ప్రతిపాదనలు కేంద్ర భూగర్భజల బోర్డు సభ్యుడికి పంపామన్నారు. జలమట్టాన్ని పెంచడానికి రూ. 736.43 కోట్లు ఖర్చుకానున్న ప్రతిపాదనలు ఇచ్చామన్నారు.

దీనిపై ఉమాభారతి స్పందిస్తూ ‘మిషన్‌ కాకతీయ’ సత్పలితాలను సాధించిందని విన్నానన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ‘మిషన్‌కాకతీయ’ గురించి ఇతర రాష్ట్రాలకు కూడా వివరించానని ఆమె మంత్రి హరీష్‌రావుతో అన్నారు. కేంద్ర క్యాబినెట్‌లో కూడా ఈ పథకం ప్రస్థావన తెచ్చినట్లు తెలిపారు. అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ తన ప్రతిపాదనలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్‌, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రుడు ఉన్నారు.