జీహెచ్‌ఎంసీలో అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జిహెచ్‌ఎంసి)కు జరిగిన ఎన్నికలలో టి.ఆర్‌.ఎస్‌. పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి ముందువరుసలో నిలిచింది. మొత్తం 150 స్థానాలకు జరిగిన ఎన్నికలలో అత్యధిక స్థానాలను దక్కించుకున్న పార్టీగా తెరాస నిలవగా, ద్వితీయ, తృతీయ స్థానాలలో బిజెపి, ఎంఐఎం పార్టీలు నిలిచాయి.

ఈ ఎన్నికలకు డిసెంబరు 1న పోలింగ్‌ జరుగగా, ఫలితాలను డిసెంబర్‌ 4 న ప్రకటించారు. నవంబర్‌ 17 న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిరది. ఆ మరుసటి రోజే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 18, 19, 20 తేదీల్లో నామినేషన్ల స్వీకరణ జరిగింది. 21న వాటిని పరిశీలించారు. 22న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను విత్‌ డ్రా చేశారు. అదే రోజు తుది అభ్యర్థుల జాబితాను, కేటాయించిన గుర్తులను ప్రకటించారు. ఈసారి మేయర్‌ పీఠం జనరల్‌ మహిళకు కేటాయించడం జరిగింది.

డిసెంబర్‌ 1 నాడు మొత్తం 150 స్థానాలలో పోలింగ్‌ ప్రారంభం కాగా, ఓల్డ్‌ మలక్‌ పేట్‌ డివిజన్లో సాంకేతిక కారణాల వల్ల ఓటింగ్‌ నిలిపి వేయడం జరిగింది. ఎన్నికల బరిలో వున్న అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తారుమారు కావడంతో అక్కడ పోలింగ్‌ ను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ డివిజన్లో ఉన్న 69 పోలింగ్‌ కేంద్రాల్లో డిసెంబరు 3న రీ పోలింగ్‌ జరిగింది. నగరంలోని 150 డివిజన్లలో 45.71 శాతం పోలింగ్‌ నమోదైంది. గత ఎన్నికలతో పోల్చితే పోలింగ్‌ శాతం స్వల్పంగా పెరిగింది. 2016 ఎన్నికల్లో 45.27 పోలింగ్‌ శాతం నమోదయింది.

150 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 56 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందగా, 48 స్థానాల్లో బీజేపీ, 44 స్థానాల్లో ఎంఐఎం, 2 స్థానాలలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించాయి. టీఆర్‌ఎస్‌ కూకట్‌పల్లి జోన్‌లో 20, షేరిలింగంపల్లిలో 13, సికింద్రాబాద్‌లో 12, ఎల్బీనగర్‌లో 6, ఖైరతాబాద్‌లో 5 వార్డుల చొప్పున గెలిచింది. బీజేపీ ఎల్బీనగర్‌లో 15, సికింద్రాబాద్‌లో 14, ఖైరతాబాద్‌లో 9, చార్మినార్‌లో 7, కూకట్‌పల్లిలో 2 వార్డులు గెలుచుకుంది. షేరిలింగం పల్లిలో ఒక వార్డులో విజయం సాధించింది.

ఎంఐఎం చార్మినార్‌ జోన్లో 29 వార్డులు, ఖైరతాబాద్‌ జోన్లో 13 వార్డులు గెలుచుకుంది. సికింద్రాబాద్‌, షేరి లింగంపల్లిల్లోనూ ఒక్కో వార్డు చొప్పున సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ ఎల్బీనగర్‌ జోన్లో రెండు వార్డులను గెలుచుకుంది.