|

టిఎస్‌ కాప్‌ యాప్‌ ప్రారంభం

tsmagazineBy: హర్షభార్గవి
రాష్ట్ర ప్రభుత్వం ”సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరంగా” ప్రకటించిన నేపథ్యంలో పోలీసు శాఖ ముందడుగు వేస్తూ, తొలి రోజున ప్రత్యేకంగా రూపొందించిన ”టి ఎస్‌ కాప్‌” పేరు గల యాప్‌ ను డైరెక్టర్‌ జనరల్‌ అఫ్‌ పోలీస్‌ ఎం.  మహేందర్‌ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా పోలీస్‌ సేవలు మరింత వేగవంతం, సమగ్ర సమాచార పరిశీలన, రియల్‌ టైం పోలీసింగ్‌, దర్యాప్తు అధికారికి పూర్తి సమాచారం, భవిష్యత్తులో మరిన్ని సేవలు అనుసంధానం చేసే అవకాశం ఉంది.

రాష్ట్ర వ్యాప్తంగా సకల నేరస్థుల సర్వే
రాష్ట్ర వ్యాప్తంగా నేరస్థుల సమగ్ర సర్వే ప్రారంభం అయింది. ఈ సర్వే లో డి జి పి స్థాయి నుండి హోమ్‌ గార్డ్‌ అధికారి వరకు సమాచారం సేకరించేందుకు క్షేత్రస్థాయిలో పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలలో నేర చరిత్ర కలిగిన ప్రొఫెషనల్‌ నేరస్థుల వివరాలను సేకరించి నమోదు చేయడానికి వారు ప్రస్తుతం ఉండే నివాసాలను సందర్శించడం జరిగింది. తీవ్రమైన నేరాలు, వ్యవస్థీకత నేరాలు, మహిళలపై నేరాలు చేసిన వారి వివరాలు సేకరించడం జరుగుతోంది. పాత నేరస్థుల సత్ప్రవర్తన, జీవన ఉపాధి, ప్రస్తుత స్థితిగతుల వివరాలు నమోదు చేయడం జరుగుతోంది. ఈ వివరాలలో వేలి ముద్రలు,ఫోటో కూడా తీసుకొని ‘జియో ట్యాగ్‌’ చేయడంతో పాటు ‘డేటా బేస్‌’గా తయారు చేయడం జరుగుతోంది.
tsmagazine

పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ కు అరుదైన గుర్తింపు
దేశం లో ప్రజలకు పోలీసు సేవలు అందుతున్న తీరు, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ , వంటి అంశాల పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ద్వారా 10 ఉత్తమ పోలీస్‌ స్టేషన్లను ఎంపిక చేయడం జరిగింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ కు 2 వ స్థానం లభించింది. ఇటీవల మధ్య ప్రదేశ్‌ రాష్ట్రం లో నిర్వహించిన డి జి పి ల సదస్సులో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేతుల మీదుగా రాష్ట్ర డి జి పి ఎం మహేందర్‌ రెడ్డి సమక్షంలో పంజాగుట్ట ఇన్‌ స్పెక్టర్‌ అవార్డు అందుకున్నారు. డి జి పి ఎం మహేందర్‌ రెడ్డి హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌గా ఉన్నపుడు హైదరాబాద్‌ పోలీస్‌ విధి నిర్వహణతో పాటు పోలీస్‌ స్టేషన్లు సిటిజెన్‌ ఫ్రెండ్లీగా మార్చేందుకు తీవ్రంగా కషి చేసారు. దాదాపు 30కి పైగా అంతర్జాతీయ, జాతీయ అవార్డులతో హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ గుర్తింపు పొందింది. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసులు చేధించడమే కాకుండా, అత్యాధునిక పరికరాల వాడకంతో కేసులు దర్యాప్తు వేగంగా నిర్వహించడం, స్టేషన్‌ కి వచ్చే దరఖాస్తు దారుడితో సత్ప్రవర్తన, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా శాంతి భద్రతల పరిరక్షణ అనే అనేక అంశాలతో ‘ది బెస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌’ గా నిలచింది.