పటిష్ట నిఘాకు జంట హర్మ్యాలు

policeఇప్పటి ఆధునిక సమాజంలో శాంతి భద్రతలనేవి అత్యంత ఆవశ్యమయినవి. వీటి పర్యవేక్షణ నిరంతరం వుండాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం అవసరం. ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రభుత్వ శాఖలను బలోపేతం చేసుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం.

ఈ క్రమంలో పోలీస్‌ శాఖకు వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి మరింతగా బలోపేతం చేయ సంకల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్‌ నగరంలోని బంజారాహిల్స్‌లో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలీస్‌ ట్విన్‌ టవర్స్‌కు ముఖ్యమంత్రి నవంబర్‌ 22 నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ ట్విన్‌ టవర్స్‌ నిర్మాణం కోసం 302 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ప్రకటించారు. రానున్న బడ్జెట్‌లో మరో 700 కోట్లు అందజేస్తామని హామీనిచ్చారు. పోలీసుల వైఖరిలో చెప్పుకోదగినంత మార్పు వచ్చిందని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం పథకంలో పదిశాతం పోలీస్‌ కానిస్టేబుళ్ళు, ఎక్స్‌సర్వీస్‌ సిబ్బందికి కేటాయిస్తామని ప్రకటించారు. మనకు ఏది కూడా ఓవర్‌నైట్‌ పనై పోవాలంటే సాధ్యంకాదు, ఒక్క రోజులో ఏదీ మార్చలేము. సభ్య సమాజాన్ని చూస్తూ, ఎదుగుతూ ఎదుగుతూ అనేక విషయాలు తెలుసుకుంటూ పురోగమిస్తూ వుండాలన్నారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ అద్భుతంగా ముందుకు పోవాల్సిన బాధ్యత మనమీదున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చాలా సందర్భాలలో జాతీయ స్థాయి పోలీస్‌ అధికారులతో హోంశాఖ మంత్రితో, సెంట్రల్‌  హోంశాఖ సెక్రటరీతో మాట్లాడినప్పుడు మీ స్టేట్‌ పోలీస్‌ గొప్పది అని ప్రశంసించినప్పుడు నేను గర్వపడుతుంటానని సీేఆర్‌ అన్నారు.

మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి..

ఈ రోజు ఒక మంచి అధికారి మనకు నగర పోలీస్‌ కమిషనర్‌గా ఉన్నారు. ఆయన జీవితంలో చాలా కష్టపడి పైకి వచ్చారు. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి సర్వేల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో చదువుకొని పట్టుదలతో ఐపీఎస్‌ అధికారిగా ఎదిగి ఈ రోజు మహేందర్‌రెడ్డి పోలీస్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. నిజంగా వారికుండేటటువంటి ఓపిక చూసి కొన్ని సందర్భాలలో నేనే అశ్చర్య పడే పరిస్థితి ఉంటది. సిటీ, శాంతి భద్రతలు, అధునాతన టెక్నాలజీ గురించి అనేక సందర్భాలలో మేం చర్చించుకున్న సందర్భాల్లో వచ్చిన ఆవిష్కరణ.. ఈ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌. దీనికి నిన్ననే రూ. 302 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 700 కోట్ల రూపాయలు వచ్చే బడ్జెట్‌లో సమూరుస్తాం. ప్రపంచంలోనే ఒక బెస్ట్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌గా దీన్ని తీర్చిదిద్దుతాం. ముంబైలో అక్కడి పోలీసులు 9 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మనం ఒక అడుగు ముందుకు వేసి హైదరాబాద్‌, సైబరాబాద్‌లలో 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటున్నాం.

పోలీసులు రోడ్‌ మీద కనిపించరు

నేను ఇటీవల సింగపూర్‌, చైనా వెళ్లాను. సింగిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా రోడ్డు మీద కన్పించరు. కాని వంద శాతం మనం వాచ్‌లో ఉంటాం. చైనాలో కూడా పోలీసులు కన్పించరు. కాని ఫోన్‌ చేస్తే తప్పని సరిగా రెండున్నర నుంచి మూడు నిమిషాలలోపు ఇంగ్లీష్‌ సినిమాలలో చూపించినట్లు వచ్చేస్తారు. అది టెక్నాలజీ వాడకం వల్లనే సాధ్యమవుతున్నది. అటువంటి దిశగా మన పోలీస్‌ కూడా ఎదుగాల్సిన అవసరముంది. మేం ఎక్కడికి పోయినా.. ఆఖరుకు సింగపూర్‌లో బిజినెస్‌ మీట్‌లో మాట్లాడినా వాళ్లు అడిగే మొదటి ప్రశ్న.. రావుగారు మీ దగ్గర శాంతి భద్రతలు ఎలా ఉన్నాయనే. చైనాలో కూడా అదే ప్రశ్న అడిగారు. శాంతి భద్రతలు బాగుంటేనే ఇన్వెస్టర్లు గాని, మంచిగాని చెడ్డగాని రాగలుగుతాయి. అలాంటి శాంతిభద్రతలు కాపాడే మెయిన్‌ టూల్‌ పోలీస్‌ వ్యవస్థ.

హైదరాబాద్‌లో ఉన్న వర్తక, వ్యాపార, వాణిజ్య వేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు, సంపన్నులకు నా మనవి ఒక్కటే. ఈ రోజైనా.. రేపైనా.. ఎల్లుండైనా ఇది మన హైదరాబాదే. దీన్ని మనమే కాపాడుకోవాలి. పోలీసులతో పాటు మీరు కూడా తప్పనిసరిగా ముందుకు రావాలి. కమ్యూనిటీ నుంచి కూడా కొన్ని కెమెరాలను కంట్రిబ్యూట్‌ చేయాలి.

ప్రజలు భాగస్వామ్యం తప్పనిసరి

హైదరాబాద్‌ ప్రజలకు నా విజప్తి.. చైనాలో కాని, సింగపూర్‌లో కానీ ఈ ఇన్నోవేషన్స్‌, టెక్నాలజీస్‌ అన్ని సక్సెస్ఫుల్  జరిగి క్రైం కంట్రోల్‌ అవుతుందంటే దాంట్లో చాలా వరకు ప్రజల పాత్ర కూడా ఉంది. ప్రతిదానికీ పోలీసులమీద నెట్టివేయడం, పోలీసులనే నిందించడం అనే ఒక నెగిటివ్‌ దృక్పథాన్ని వీడాలి. ఫ్రెండ్లీ పోలీస్‌ ఉండాలి అనుకున్నప్పడు ఫ్రెండ్లీ పీపుల్‌ కూడా ఉండాలి. ప్రజలు, పోలీసులు కలిస్తేనే అనుకున్నటువంటి ఫలితాలు వస్తాయి. సింగపూర్‌లో అంత మంచి లా అండ్‌ అర్డర్‌ ఉందంటే అక్కడ నైబర్‌హుడ్‌ పోలీస్‌ ప్రారంభించారు. చైనాలో కూడా అలాంటి ప్రజల భాగస్వామం ఉంది. తొందరలో మన సిటీలో కూడా మన పోలీస్‌ కమిషనర్‌ నైబర్‌హుడ్‌ పోలీసింగ్‌ను చేపడుతున్నారు. హైదరాబాద్‌లో ఉన్న వర్తక, వ్యాపార, వాణిజ్య వేత్తలకు, పారిశ్రామిక వేత్తలకు, సంపన్నులకు నా మనవి ఒక్కటే. ఈ రోజైనా.. రేపైనా.. ఎల్లుండైనా ఇది మన హైదరాబాదే. దీన్ని మనమే కాపాడుకోవాలి. పోలీసులతో పాటు మీరు కూడా తప్పనిసరిగా ముందుకు రావాలి. కమ్యూనిటీ నుంచి కూడా కొన్ని కెమెరాలను కంట్రిబ్యూట్‌ చేయాలి. సీఎస్‌ఆర్‌(కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబులిటీ) కింద ఈ సంవత్సరం వచ్చే నిధులను పూర్తిగా పోలీస్‌ శాఖ టాేయించాలని చీఫ్‌ సెక్రటరీని కోరుతున్నా. పార్లమెంట్‌ సభ్యులు, శాససభ్యులు. శాసనమండలి సభ్యులు వారి వారి కోటా నుంచి సీసీ కెమెరాలకు నిధులను టాేయించాలి. శాసన సభ్యులకు, మండలి సభ్యులకు సంవత్సరానికి రూ. 1.5 కోట్ల నిధులుంటాయి. అందులో తలా ఒక రూ. 50 లక్షలు ఇచ్చినా 100 కోట్ల వరకు అవుతాయి.

మన భవిష్యత్తు కోసమే..

రిఫామ్ అనేది ఒక రోజుతో రాదు.. చేసుకుంటూ చేసుకుంటూ పోతే తప్పని సరిగా ఒకరోజు అంతర్జాతీయ స్థాయికి మన పోలీసు విభాగం కూడా ఎదుగుతది. రేపటి మన బిడ్డల మంచి భవిష్యత్తుకు బాటలు పడుతయి. రిలయన్స్‌ కంపెనీకి అభినందనలు చెబుతున్నా.. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌కు అవసరమైన పైబర్‌ అప్టిక్‌, హైబ్రాండ్‌ విడ్త్‌తో ఐదు సంవత్సరాల పాటు ప్రీగా సర్వీస్‌ చేసేందుకు హామీ ఇచ్చారు. కేశవరావు గారు కమాండ్‌ సెంటర్‌ను జిల్లా కేంద్రాలకు కూడా అనుసంధానం చేయాలని చెప్పారు. ఆ ఆలోచన కూడా ఉంది. ఈ బిల్డింగ్‌ వేలం పోలీస్‌ కమిషనర్‌ బిల్డింగ్‌ కాదు. ఆ కన్ఫ్యూజన్‌ ఎవరికీ అక్కర్లేదు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు ఫ్లోర్లను కేటాయించాం. ప్రకృతి విపత్తులు, ఇతర విపత్తులు, ఇబ్బందులు తలెత్తిన సమయంలో ఇక్కడి నుంచి మొత్తం మానిటరింగ్‌ చేసే విధంగా రాష్ట్రం మొత్తానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన టెక్నాలజీ హబ్‌గా దీన్ని రూపొందించాం. ఇది రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్‌.. మొత్తం రాష్ట్రానికి సంబంధించిన హబ్‌గా ఇది ఉపయోగపడుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు.

ముఖ్యమంత్రి ఆలోచన అద్భుతం: దత్తాత్రేయ

వినూత్న ఆలోచనతో ముఖ్యమంత్రి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయడానికి నిర్ణయించడం ప్రశంసనీయమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. టెక్నాలజీతో అభివృద్ధి సాధ్యమన్నది ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభిప్రాయమని, అదే మార్గంలో ముఖ్యమంత్రి కూడా టెక్నాలజీతో పారదర్శకత పెరుగుతుందని, జవాబుదాదీతనం పెరిగి ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని భావించడం అభినందనీయమన్నారు. భారతదేశం అన్ని మతాలు, కులాల సమ్మేళనమని అభివృద్ధి, గుడ్‌గవర్ననెన్‌స్‌తో ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు.

అపూర్వఘట్టం: హోం మంత్రి నాయిని

ట్విన్‌ టవర్స్‌ భారత దేశ పోలీస్‌ వ్యవస్థలో అపూర్వ ఘట్టమని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. దీని సహాయంతో హైదరాబాద్‌ పోలీసులు టెక్నాలజీలో అంతర్జాతీయ స్థాయికి అప్‌గ్రేడ్‌ అవుతున్నారన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్దిదిద్దాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారని, మహిళల భద్రత కోసం షీ టీమ్స్, పోలీస్‌ శాఖలో 33 శాతం మహిళలకు కోటా, ఎక్స్‌గ్రేషియా పెంపు వంటి ఉన్నతమైన నిర్ణయాలతో సీఎంముందుకు వెళ్తున్నారని కొనియాడారు.

టెక్నాలజీ రక్షణ కవచం: కమిషనర్‌ మహేందర్‌రెడ్డి

టెక్నాలజీని ఉపయోగించుకొని అంతర్జాతీయ స్థాయిలో పోలీసింగ్‌ వ్యవస్థను తీర్చిదిద్దుకునే దిశలో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి అన్నారు. టెక్నాలజీ 99.99 శాతం ప్రజలకు రక్షణ కవచంగా ఉంటుందన్నారు. విదేశాల్లో విద్య, ఉద్యోగాలకు మన పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను ధైర్యంగా పంపించడం అక్కడి సాంతిేకత, శాంతిభద్రతల మీద మనకున్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. అలాంటి పరిస్థితి ఇక్కడా రావాలని అన్నారు. ప్రభుత్వం పోలీస్‌ శాఖకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ సభలోనే ముఖ్యమంత్రి మదిలో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మెదిలిందన్నారు. వాస్తవానికి కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని మేం ఎవరం ముఖ్యమంత్రికి చెప్పలేదని, ముందు చూపుతో ముఖ్యమంత్రే ఈ ప్రతిపాదన చేశారని చెప్పారు. 24 అంతస్తుల భవనం అవసరమా? అనే అనుమానాలున్నాయని, అయితే దీన్ని రాష్ట్ర ప్రభుత్వ టెక్నాలజీ హాబ్‌గా మార్చాలని ముఖ్యమంత్రి ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు ఇది ఒక నాడీమండల వ్యవస్థలా రూపుదిద్దుకుంటుందన్నారు. ఉదాహరణకు నగరంలో రోడ్లు సరిగా శుభ్రం చేశారా లేదా అనే విషయాన్ని కూడా జీహెచ్‌ఎంసీ ప్రతినిధులు నేరుగా ఇక్కడి నుంచే సీసీ కెమెరాలతో పర్యవేక్షించుకోవచ్చని, ఇలాగే ప్రభుత్వ శాఖలన్నింటికి ఇది ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ శర్మ, హోం శాఖ కార్యదర్శి రాజీవ్‌ త్రివేది, ఇన్‌ఛార్జీ సుదీప్‌లఖ్ఠకియా, ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్‌ ఓవైసీ, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ డీజీపీలు, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారులు, పలువురు ఐఏఎస్‌లు, నగర పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పోలీసులను ఆదుకుంటాం..

పోలీసులకు డబ్బులిచ్చి, అవసరమైన చట్టాలిచ్చి, అవసరమైన బలాన్నిచ్చి, అండదండలిస్తే తప్పని సరిగా వాళ్లు తామేంటో ప్రూవ్‌ చేసుకుంటారు. పభుత్వం ఆ దిశగా పనిచేస్తున్నది. ట్రాఫిక్‌లో పనిచేసే సిబ్బందికి అదనంగా 30 శాతం జీతాన్ని చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డబుల్‌ బెడ్‌రూం స్కీమ్ లో  పోలీస్‌ కానిస్టేబుళ్లకు, రాష్ట్రంలో ఉండే ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు ప్రతి సంవత్సరం 10 శాతం రిజర్వు చేస్తాం. ఒక్క రూపాయి అప్పు అవసరం లేకుండా గవర్నమెంటే ఉచితంగా ఇస్తుంది.