|

ఉద్యమ గీత

కార్టూన్‌ అంటే హాస్యం పండించేది

కార్టూన్‌ అంటే చురకలంటించేది

కార్టూన్‌ అంటే ఆలోచింపజేసేది

కార్టూన్‌ అంటే కాకపుట్టించేది

కార్టూన్‌ అంటే వాస్తవాన్ని చూపించేది….

ఇక మహోద్యమ హోమగుండం నుంచి పుట్టిన కార్టూన్లు ఎంత వేడిగా, ఎంత వాడిగా ఉంటాయో ఎవరైనా ఊహించుకోవచ్చు.  అలాంటి ఉద్యమాన్ని రగిలించిన కార్టూన్ల కదంబమే ఈ ఉద్యమ గీత.

పుస్తకం: ఉద్యమ గీత
కార్టూన్లు: చిలువేరు మృత్యుంజయ
వెల: రూ,250.
ప్రతులకు: భాషా సాంస్కృతికశాఖ, కళ భవన్, రవీంద్రభారతి, హైదరాబాద్

భగవద్గీత ఎంతో పవిత్రమైనది. కష్టకాలంలో మనకి కర్తవ్యబోధ చేసేది, దారిచూపేది భగవద్గీత. దైనందిన జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకు మనకు భగవద్గీతలో సమాధానాలు లభిస్తాయి. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో దివిటీ పట్టి దారి చూపినందుకే ఈ కార్టూన్ల పుస్తకానికి ‘ఉద్యమ గీత’ అని పేరు పెట్టి ఉండవచ్చు.

యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామంలో చిలువేరు రామలింగం, అనసూయ దంపతులకు జన్మించిన చిలువేరు మృత్యుంజయ గీసిన గీతలే ఈ ఉద్యమ గీత. 1996లో ప్రముఖ సినీ దర్శకుడు దాసరి నారాయణరావు ఆధ్వర్యంలో వెలువడిన ‘బొబ్బిలి పులి’ పొలిటికల్‌  వీక్లీతో కార్టూనిస్టుగా జీవితం ప్రారంభించిన మృత్యుంజయ ఇంతింతై వటుడింతై అన్నట్టుగా చేయి తిరిగిన కార్టూనిస్టుగా ఎదిగి నేడు ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో చీఫ్‌ కార్టూనిస్టుగా పనిచేస్తున్నారు. వివిధ భాషలలో, పత్రికలలో వేసిన కార్టూన్లకు పలు అంతర్జాతీయ, జాతీయ. రాష్ట్రస్థాయి అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. తన తండ్రి, ప్రముఖ చేనేత కళాకారుడు కీ.శే. చిలువేరు రామలింగం దగ్గరే బొమ్మల్లో ఓనమాలు నేర్చుకున్నానని మృత్యుంజయ ఎంతో గర్వంగా చెపుతుంటారు. కార్టూనుకు అవసరమైన ముక్కుసూటి తనం, చురుక్కుమనిపించే గుణాలు మృత్యుంజయ కార్టూన్లలో మనకు దర్శనమిస్తాయి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం  ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అనేక మంది కళాకారులను, కవులను కదిలించి కార్యోన్ముఖులను చేసింది. ఏకం  చేసింది. ఆ ఉద్యమ ప్రేరణతోనే మృత్యుంజయ కూడా ఉద్యమాన్ని మరింత రగిలించే రీతిలో వివిధ సందర్భాలలో, వివిధ అంశాలపై కార్టూన్లు గీయనారంభించారు. తెలంగాణ ఉద్యమం మీద సుమారు 800 కార్టూన్లు గీశారు. ఇవి గాక ఆకలి, నిరుద్యోగం, నక్సల్స్‌, రైతు ఆత్మహత్యలు వంటి వివిధ సామాజిక సమస్యలపైన,  వేలాది కార్టూన్లు గీశారు. రాజకీయ కార్టూన్లు వేల సంఖ్యలోనే ఉన్నాయి. అయితే, వీటిలో తెలంగాణ ఉద్యమం మీద వేసిన కార్టూన్లను ఒక చోట గుదిగుచ్చి ఈ ఉద్యమగీత పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కవులు తెలంగాణ ఉద్యమానికి తమ కలం అందిస్తే, గాయకులు తమ గళం అందిస్తే, మృత్యుంజయ తన కుంచే ద్వారా ఉద్యమ స్ఫూర్తిని రగిలించాడని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, రిటైర్డ్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారి డాక్టర్‌ కె.వి.రమణాచారి ఈ పుస్తకంలో రాసిన తన నా‘నుడి’లో పేర్కొనడం అక్షర సత్యం. కోటి కార్టూన్ల వీణ నా తెలంగాణ అని మృత్యుంజయ నినదించారని ఆయన ప్రశంసించారు. మృత్యుంజయ అందమైన గీతల్లోని జీవ లక్షణానికి, వ్యంగ్యానికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమని ప్రజాకవి గోరటి వెంకన్న జేజేలు పలికారు. 

భూదాన్‌ పోచంపల్లి బిడ్డగా ఎదిగి, తెలంగాణ ఉద్యమంలో ఒదిగి జాతీయ, అంతర్జాతీయ అవార్డులందుకున్న మృత్యుంజయకు ఇంకా ఎంతో భవిష్యత్‌ ఉన్నదని తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తన సందేశంలో ఆకాంక్షించారు. కార్టూన్‌ అంటే ఉదయం పత్రిక రాగానే ఓ నిమిషం చూసి మరిచిపోయేది కాదు. అలాంటి అపురూపమైన గీతల సమాహారం ఈ పుస్తకం అని తెలంగాణ ఆర్‌.టి.ఐ ఛీప్‌ కమిషనర్‌ బుద్దా మురళి అభినందించారు. భవిష్యత్తులో మృత్యుంజయ కుంచె మరిన్ని కార్టూన్లతో తెలంగాణ సమాజాన్ని అలరించాలని ప్రముఖ సంపాదకుడు తిగుళ్ళ కృష్ణమూర్తి ఆశిస్తూ, అభినందనలు తెలిపారు. ఈ పుస్తకం కేవలం కార్టూన్‌లను, రాజకీయ అంశాలను మాత్రమే కాక, తెలంగాణా ఉద్యమ ప్రస్థానాన్ని కార్టూన్‌ల రూపంలో అందించిన అరుదైన డాక్యుమెంటెడ్‌ హిస్టరీగా తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ అభివర్ణించారు.

తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ ప్రచురించిన ఈ ‘ఉద్యమ గీత’లోని కార్టూన్లను తిలకిస్తే, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మన కళ్ళముందు ఒకసారి కదలాడు తుంది. ఉద్యమ సమయంలో ఎప్పుడు ఏమి జరిగింది, ఆయా సందర్భాలలో ఎవరు ఏ విధంగా స్పందించారు, అందుకు ప్రతిస్పందన ఎలా ఉన్నదన్నది కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఉద్యమాన్ని నీరుకార్చేందుకు కొందరు చేసిన ప్రయత్నాలు,వ్యాఖ్యలు,  వాటిని ఉద్యమకారులు తిప్పికొట్టిన తీరు, ఈ దశలో పేలిన మాటల తూటాలు, ఉద్యమకారుల త్యాగాలు, చివరకు విజయం సాధించిన క్షణాలు, ఆయా సందర్భాలలో మృత్యుంజయ కుంచె నుంచి వెలువడిన వ్యంగ్య చిత్రాలు గగుర్పాటు కల్గించి, మనస్సుపై చెరగని ముద్ర వేస్తాయనడంలో సందేహం లేదు. ఉద్యమాభిలాషులే  కాదు, కార్టూన్లను ప్రేమించే ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమగీతను చూసి తప్పక ఆనందిస్తారు,  ఆదరిస్తారు, అభినందిస్తారు.