ఉజ్వల ప్రస్థానం తెలంగాణ చరిత్ర – ఉద్యమం – ప్రగతి

తెలంగాణ ప్రాంతం ఆదినుంచీ పోరాటాల పోరుగడ్డ. అన్యాయాలను ఎదిరించి, రొమ్ముచూపి ముందుకురికి రక్తతర్పణంచేసిన పవిత్ర భూమి ఇది. ఆ పోరాటాల స్ఫూర్తే నేడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు నాందిపలికింది.నేడు మనం అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రం కూడా అంత సులభంగా రాలేదు. ఎన్నో పోరాటాలు, త్యాగాలు, ఆత్మబలిదానాలు, నిర్భంధాలు, లాఠీదెబ్బలు, ఉవ్వెత్తున కెరటంలా ఎగసిపడిన తెలంగాణ జన సమూహాలు, కదలివచ్చిన సర్వజనులు.అంతిమంగా తుదిసమరానికి కథానాయకుడు కె. చంద్రశేఖర రావు ఆమరణ నిరాహారదీక్షతో కేంద్రప్రభుత్వం దిగిరాకతప్పలేదు. ఇది ఎవరి దయాభిక్షమో కాదు, పోరాడి సాధించుకున్న రాష్ట్రం.

ఒకప్పటి తెలంగాణ ప్రాంతం ఎలా ఉండేది? నేడు తెలంగాణ రాష్ట్రం ఎలా ఉంది? ఈ రెంటికీ మధ్య అసలు ఏం జరిగింది ? సుస్పష్టంగా తెలియజెప్పేదే గటిక విజయ్‌ కుమార్‌ రాసిన ఈ పుస్తకం. సీనియర్‌ జర్నలిస్టుగా, ముఖ్యమంత్రికి ప్రజాసంబంధాల అధికారిగా పనిచేస్తున్న విజయ్‌ కుమార్‌ ప్రజా ఉద్యమాలపైన, ప్రభుత్వ పథకాలపైన ఎంతో అవగాహనతో రాసిన పుస్తకం ఇది.

తెలంగాణకు మూడులక్షల ఏండ్ల చరిత్ర ఉన్నదంటూ ప్రారంభించిన ఈ పుస్తకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వివిధ పోరాటాలు, ఉద్యమాలు, వాటికి దారిని తీసిన పరిణామాలు, ఆయా ఉద్యమాలకు నాయకత్వం వహించిన మహామహులగురించి, పోరాటాలకు స్ఫూర్తినిస్తూ, ఉద్యమాలను రగుల్కొల్పిన ఉద్యమసాహిత్య తరంగాల గురించి ఈ పుస్తకంలో వివరంగా వివరించారు.

ఈ పుస్తకాన్ని కేవలం ఓ బొమ్మల పుస్తకంలా తిరగేస్తే ప్రయోజనం లేదు. ఇందులోని ప్రతిపేజీ పూర్తిగా చదవాలి. అవగాహనచేసుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే, మన రాష్ట్రంలోని మన పూర్వీకులు అక్రమాలను, అన్యాయాలను ఎదిరించే క్రమంలో ఎంత గోసపడ్డారో, ఎంత తపన, ఎంత రక్తం ధారపోశారో తెలిస్తే ఈ పుస్తకం చదివిన ప్రతి తెలంగాణ బిడ్డ మనస్సు బరువెక్కుతుంది. కొన్ని సంఘటనలు రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తాయి. అంతలోనే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఆనందం,ఆతరువాత వివిధరంగాలలో దేశానికే ఆదర్శంగా ఎదుగుతున్న తీరు మనం గర్వపడేలా చేస్తుంది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు తెలుసుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది.

ఉద్యమ రథసారథి కె. చంద్రశేఖర రావు రాష్ట్ర తొలిసారథికావడం, పాలనాపగ్గాలను చేతబట్టి రాష్ట్రాన్ని నడిపిస్తున్నతీరు తెన్నులు, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళనుంచీ నేటివరకూ పాలనాపరమైన సవాళ్ళను, ఎదురైన అవరోధాలు, అవాంతరాలను చెదరని గుండె ధైర్యంతో, సడలని పట్టుదలతో ఎదిరించి నిలచి లక్ష్యాలను సాధించిన వైనాలను, రాష్ట్రాభివృద్ధికోసం, ప్రజా సంక్షేమం కోసం రూపొందించి అమలుచేస్తున్న వందలాది పథకాల గురించి విజయ్‌ కుమార్‌ అక్షరరూపంలో మన ముందుంచారు.

ఇంతటి సమాచారాన్ని సేకరించి, ఒకచోట గుదిగుచ్చి మనకు అందించిన రచయిత కృషి ప్రశంసనీయం. నేటి తరాలవారికే కాదు, ఇక ముందుతరాల వారికి కూడా తెలంగాణ గురించి తెలిపే ఒక కరదీపిక ఇది. ఈ పుస్తకం ఎంతగా జనబాహుళ్యాన్ని చేరగలిగితే, అంతప్రయోజన కరంగా ఉంటుంది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన అభినందన సందేశంలో పేర్కొన్నట్టుగా ఈ పుస్తకం ప్రతి ఒక్కరికీ ఓ రిఫరెన్స్‌ బుక్‌ లాగా ఉపయెగపడుతుంది. తెలంగాణ గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి దోహదపడుతుంది.ఈ పుస్తకానికి తెలంగాణ జాతి గర్వించే చిత్రకారుడు ఏలె లక్ష్మణ్‌ తీర్చిదిద్దిన ముఖచిత్రం, సందర్భానుసారంగా ప్రముఖ కార్టూనిస్ట్‌ శంకర్‌ గీసిన క్యారికేచర్లు మరింత శోభను చేకూర్చాయి.

– కె.యస్‌.యస్‌.