రాష్ట్రంలో తగ్గిన నిరుద్యోగిత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న పలు ఆచరణాత్మక విధానాల వల్ల రోజు రోజుకీ నిరుద్యోగిత రేటు క్షీణిస్తూ వస్తున్నది. కోవిడ్-19 తొలి, మలి దశలతో పాటు మూడో దశ ముప్పును కూడా ఎదుర్కున్న రాష్ట్రం, అప్పటి నష్టాన్ని అధిగమించడానికి, ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొన్నదని చెప్పాలి. అందుకు ప్రబలమైన తార్కాణమే ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎమ్‌ఐఈ)’ వెల్లడిరచిన నివేదిక. సీఎమ్‌ఐఈ దేశవ్యాప్తంగా సేకరించిన గణాంకాల ప్రకారం.. దేశంలో అత్యంత స్వల్ప నిరుద్యోగిత రేటును కలిగి వున్న రాష్ట్రం తెలంగాణ అని తేలింది. 2022 జనవరి మాసంలో తెలంగాణ రాష్ట్రంలో 0.7 శాతం మాత్రమే నమోదైందని సీఎమ్‌ఐఈ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 2022 జనవరిలో చాలావరకు తగ్గి 6.57 శాతానికి పరిమితం అయ్యింది. 2021మార్చి తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి నిరుద్యోగిత రేటు. ఈ జనవరిలో పట్టణాల్లో 8.16 శాతం నిరుద్యోగ రేటు వుండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇది 5.84 శాతంగా నమోదైంది. 2021 డిసెంబర్‌లో నిరుద్యోగ రేటు 7.91 శాతంగా నమోదు కాగా.. పట్టణాల్లో ఇది 9.3శాతం, గ్రామాల్లో 7.28 శాతంగా నమోదైంది.
2021 డిసెంబరు నాటికి దేశంలో 5.3 కోట్ల మంది నిరుద్యోగులున్నారని సీఎమ్‌ఐఈ అంచనా వేసింది. ఇందులో కూడా ఎక్కువగా మహిళలే వున్నారు. వీరిలో కూడా 3.5 కోట్ల మంది పని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నవారు కాగా, మిగతా వారు మాత్రం పని దొరికితే చేయడానికి సిద్ధంగా ఉన్నారని సీఎమ్‌ఐఈ పేర్కొన్నది.
నిరుద్యోగం రేటులో తెలంగాణ రాష్ట్రం తర్వాత స్థానాల్లో గుజరాత్ (1.2 శాతం), మేఘాలయ(1.5 శాతం), ఒడిశా (1.8 శాతం)లున్నాయి. హరియాణా రాష్ట్రంలో నిరుద్యోగ రేటు అతి ఎక్కువగా 23.4 శాతం, రాజస్థాన్‌లో 18.9 త్రిపుర 17.1 శాతం, జమ్మూ కాశ్మీర్ 15.0శాతం, ఢల్లీి 14.0 శాతం, హిమాచల్ ప్రదేశ్ 13.9 శాతం,బీహార్ 13.3 శాతం, గోవా 11.6 శాతం, పంజాబ్ 9.0 శాతం, జార్ఖండ్ 8.9 శాతం, అస్సాం 8.5 శాతం, పుదుచ్చేరి 7.8 శాతం, పశ్చిమ బెంగాల్ లో 6.4 శాతం చొప్పున నమోదైనట్లు సీఎమ్‌ఐఈ తన నివేదికలో పేర్కొన్నది.