ఏడాదిలోపు పట్టణాల్లో ప్రతి ఇంటికి అర్బన్ భగీరథ నీళ్ళు

పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటి వసతి కల్పించడానికి ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనుగుణంగా అర్బన్‌ భగీరథ పథకం ఏర్పాటుచేసి ఆయా పట్టణాల్లో అవసరమైన పైపులైన్‌ల నిర్మాణం, ట్యాంకుల నిర్మాణం చేపట్టడానికి నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డుకు అవతల ఉన్న పట్టణాలకు, లోపల ఉన్న పట్టణాలకు, అలాగే రాష్ట్రంలో ఉన్న ఇతర పట్టణాలకు అర్బన్‌ భగీరథలో భాగంగా మంచినీటి వసతి కల్పించనున్నారు. దీనికి గాను 2022-23 బడ్జెట్‌లోనే నిధులు కేటాయించారు. ఔటర్‌ రింగురోడ్డుకు బయట ఉన్న పట్టణాలకు రూ. 800 కోట్లు, లోపల ఉన్న పట్టణాలకు రూ. 700 కోట్లు కేటాయించారు. దీన్ని మూడు ప్యాకేజీలుగా విభజించారు.

మొదటి ప్యాకేజీలో కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, పెద్దపల్లి, వేములవాడ, నిర్మల్‌, భైంసా, మందమర్రి, మంచిర్యాల, కాగజ్‌నగర్‌, బెల్లంపల్లి మొత్తం 11 పట్టణాలు ఉన్నాయి. ఈ ప్యాకేజీకి రూ. 478 కోట్లు ఖర్చుచేయనున్నారు. రెండవ ప్యాకేజీలో జనగామ, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్‌, ఇల్లందు, సత్తుపల్లి, పాల్వంచ, మధిర మొత్తం 9 పట్టణాలు ఉన్నాయి. ఈ ప్యాకేజీకి రూ. 374 కోట్లు ఖర్చుచేయనున్నారు.

మూడవ ప్యాకేజీ కామారెడ్డి, బోధన్‌, జహీరాబాద్‌, సంగారెడ్డి, సదాశివపేట, భువనగిరి, తాండూరు, వికారాబాద్‌, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నారాయణ్‌పేట, అచ్చంపేట, కల్వకుర్తి, ఐజ, బాదేపల్లి, నాగర్‌కర్నూల్‌ మొత్తం 18 పట్టణాలు ఉన్నాయి. ఈ ప్యాకేజీకి రూ. 580 కోట్లు ఖర్చుచేయనున్నారు. మూడు ప్యాకేజీలకు 38 పట్టణాల్లో రూ. 1,432 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఇప్పటికే పైపులైన్లనిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. 2023 మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోను అర్బన్‌ భగీరథ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ నల్లా నీటిని అందించనున్నారు. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 141 పట్టణాల్లో ఇంటింటికీ నల్లా కనెక్షన్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో రూ.6,578 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటికే అత్యధిక పట్టణాల్లో పనులు పూర్తయ్యాయి. మరో 38 పట్టణాల్లో అర్బన్‌ భగీరథ పనులు నడుస్తున్నాయి. పట్టణాల్లో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, ఇండ్లకు కూడా నల్లా కనెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా పైపులైన్‌లు వేస్తున్నారు.

భవిష్యత్తులో ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే నల్లా కనెక్షన్‌ ఇచ్చేవిధంగా జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ లోపల ఉన్న పట్టణాలు, గ్రామాల్లో నల్లా కనెక్షన్ల కోసం రూ.750 కోట్లతో 164 రిజర్వాయర్లు, 1,600 కిలోమీటర్ల పైపులైన్ల నిర్మాణం పనులు పూర్తిచేశారు. ప్రతి వ్యక్తికి రోజుకు పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తారు. మొత్తంగా 2023 మార్చి నాటికి రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలలో ప్రజలకు భగీరథ నీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.