ఎ.ఎన్‌.ఆర్‌. పేరుతో అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు

ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు పుట్టిన రోజు సందర్భంగా, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ స్ఫూర్తితో 1080 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకుంటున్నట్లు నటుడు నాగార్జున ప్రకటించారు.

హైదరాబాద్‌ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్‌ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కు ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఎం.పీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అటవీ పార్కు అభివృద్ధికి ముఖ్యమంత్రి సంకల్పించిన హరిత నిధి (గ్రీన్‌ ఫండ్‌)కి రెండు కోట్ల రూపాయల చెక్‌ను అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.

మన పరిసరాలు, రాష్ట్రం, దేశం కూడా ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో, ‘తెలంగాణకు హరితహారం’ స్ఫూర్తితో ఎం.పీ సంతోష్‌ కుమార్‌ ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ ప్రారంభించారని, ఈ కార్యక్రమంలో తాను స్వయంగా పాల్గొని పలు సార్లు మొక్కలు నాటానాని నాగార్జున తెలిపారు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ద్వారా అడవి దత్తతకు నాగార్జున ముందుకు రావటాన్ని ఎంపీ సంతోష్‌ కుమార్‌ ప్రశంసించారు. చెంగిచర్ల ఫారెస్ట్‌ బ్లాక్‌ లో దివంగత అక్కినేని నాగేశ్వరరావు పేరుపై అర్బన్‌ పార్కు అభివృద్ధితో పాటు, ఖాళీ ప్రదేశాల్లో దశల వారీగా లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీ వెల్లడిరచారు. దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్‌కే ఉందని, రాజధాని చుట్టూ వున్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్ధరణ చేయటం, అర్బన్‌ పార్కుల ఏర్పాటుకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ తమవంతు ప్రయత్నం చేస్తుందని సంతోష్‌ అన్నారు. దీనికోసం సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అటవీశాఖ స్పెషల్‌ సెక్రటరీ ఏ. శాంతి కుమారి, పీసీసీఎఫ్‌ ఆర్‌. శోభ, పీసీసీఎఫ్‌ (ఎస్‌.ఎఫ్‌) ఆర్‌.ఏం. డోబ్రియల్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, హైదరాబాద్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఏం.జె. అక్బర్‌, మేడ్చల్‌ జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్లు, హైదరాబాద్‌ డీఎఫ్‌ఓ జోజి, డీఎఫ్‌ఓ అశోక్‌, అక్కినేని నాగార్జున ఇతర కుటుంబ సభ్యులు సుప్రియ యార్లగడ్డ, సురేంద్ర యార్లగడ్డ, సుమంత్‌ కుమార్‌, సుశాంత్‌, నాగ సుశీల, లక్ష్మీ సాహిత్య, సరోజ, వెంకట నారాయణ రావు, జ్యోత్స్న, అనుపమ, అదిత్య, సంగీత, సాగరిక, తదితరులు పాల్గొన్నారు.