వైవిధ్యం భరితం ‘ఇత్తు’ కథా సంపుటి

వైవిధ్యం-భరితం-ఇత్తు-కథా-సంపుటిదేశ చరిత్రలో అద్వితీయమైన ఉద్యమం తెలంగాణ ఉద్యమం.అందులో మలిదశ ఉద్యమం మరింత ప్రభావవంతమైనది. ఎంతో మంది కవులను, రచయితలను, కళాకారులను ఈ మలిదశ ఉద్యమం వెలుగులోకి తెచ్చింది. ప్రతి ఒక్కరు వారసత్వ మూలాల్ని, సంస్కృతీ బీజాల్ని వెతుక్కోవటం మొదలు పెట్టారు. ఆ ఉద్యమ స్ఫూర్తి, కుటుంబ సంబంధాలను చిత్రీకరించే రచయితల్ని కూడా సామాజిక అంశాలను ఇతివృత్తంగా తీసుకునే స్థితికి తీసుకవచ్చింది.

కవిత్వం, పాటలు ఉధృతంగా వస్తున్న క్రమంలో నిశ్శబ్ధంగా తెలంగాణ ప్రాంత దోపిడీకి, రైతాంగ దుస్థితికి కారణాలు వెతుకుతూ కొత్త తరహా కోట్ల వనజాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెచ్చిన తొలి కథాసంపుటి ‘‘ఇత్తు’’.తన కథల్లో కొన్నింటికి, శైలి రూపు దిద్దుకొనే క్రమంలో ఉపన్యాసాల ద్వారా ఎందరినో ప్రభావితం చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రికి ఈ కథా సంపుటిని అంకితమివ్వడం సముచితమని పిస్తది.

ఈ సంపుటిలో మొత్తం పన్నెండు కథలున్నాయి. ఒక్కో కథ ఒక్కో వైవిధ్యానికి సంబంధించినది. విలక్షణమైనవి. ఇతివృత్తంలో గాని, శైలీకరణలోగాని ప్రత్యేకతను సంతరించుకొన్నవి. ఇందులో ఇత్తు, బహుముఖం, తార్నమ్‌కాయ్‌చోరి లాంటి కథలు వివిధ సందర్భాల్లో బహుమతులు పొందినవి.

ఈ సంపుటిలో ‘ఇత్తు’ కథ అందరికి అన్నంపెట్టే రైతు ఆత్మహత్యల వైపు చూస్తున్న వైనం, పట్టెడన్నం కోసం విలవిలాడటం వంటి ధైన్యస్థితికి ప్రధాన కారణం స్వంతంగా విత్తనాలు తయారుచేసుకోకపోవడమే. ప్రాణప్రదంగా రైతు విత్తనాలు శుద్ధి చేసుకుని దాచుకొన్న రోజుల్లో రైతు గౌరవనీయమైన జీవితం గడిపి అన్నదాతగా పేరుగడిరచింది ఆ కాలంలోనే. టర్మినేటర్‌ విత్తనాలు, నకిలీ విత్తనాలు రైతాంగాన్ని సంక్షోభంలో ముంచేసింది.

ల్గురికి అన్నం పెట్టే రైతు నగరాలకు వలస లొచ్చి అన్నం అమ్ముకొనే హోటల్‌ వ్యాపారంలో దిగజారి మానసికంగా కృంగిపోతున్న వైనం, తెలంగాణ గ్రామీణ రైతుల జీవన దుస్థితికి దర్పణం పట్టే కథ.

ఈ సంపుటిలోని తొలికథ ‘సముద్రం’ రచయిత్రి బతుకులోతుల్ని ఆవిష్కరించిందనే చెప్పాలి. పాలమూరు వలస కూలీల దైన్యమైన బతుకులకు వాస్తవ దర్పణమిది. చేస్తున్న చేనేత కులవృత్తి పొట్టనింపనప్పుడు పొట్టచేతపట్టుకొని బొంబాయికి వలసపోయిన పాలమూరు చేనేత కార్మికుని దీనగాథ ఇది. ఆకలి, ఆనారోగ్యం తనదికాని, తనకు రాని పనుల్లో బలవంతంగా నెట్టివేయబడటం, భార్యను, పిల్లలను కోల్పోవడం, వారసత్వంగా వచ్చిన ఉన్న పొలాన్ని ‘సెజ్‌’ మహమ్మారి కబళించడం పాఠకుని కదిలించి కన్నీరు పెట్టిస్తుంది. అనేకమైన ఊహించని మలుపులతో రచయిత్రి కథనం నడిపిన తీరు ప్రశంసనీయం. సమస్యల్ని, పరిష్కారాల్ని మనముందుంచే కథ ఇది.

ప్రభుత్వ శాఖల్లో అధికారవర్గాల్లో, కిందిస్థాయి ఉద్యోగుల్లో, పాలనా వ్యవస్థలో వ్యవస్థీకృతమైన అవినీతిని, లంచగొండి తనాన్ని బహుముఖాలుగా విస్తరించాల్సిన మనుషుల అంత రంగాలను నిర్భయంగా బట్టబయలు చేసిన సాహసోపేతమైన కథ ‘బహుముఖం’ ఈ సంపుటిలో ‘చివరిగుడిసెలో గాజుకళ్ళు’, ‘రాజన్న కథలు’ ప్రత్యేకమైనవి. ‘చివరిగుడిసెలో గాజుకళ్ళు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను, వాదనల్ని బలంగా ప్రతిపాదిస్తుంది. రాజకీయ నాయకుల దుష్ప్రచారాలను సామాన్య ప్రజలు కూడా గమనించగలరనే చైతన్యాన్ని నిరూపించేకథ. అదేవిధంగా ‘రాజన్న కథ’లో తెలంగాణకు సంబంధించిన అనేక విస్మృత సాహిత్య, సాంస్కృతిక  విశేషాలు బయటపడతాయి. వాటిని తరతరాల స్ఫూర్తి సంపదగా స్మృతి చరిత్రలో దాచిపెట్టుకోవచ్చు. అలాంటి ప్రయత్నం రాజన్న కథలో దాగి వుంది. ఇంకా బతుకుసంత, మార్కెట్‌ కథలు మనల్ని సంచారజీవుల్ని చేస్తాయి.
కోట్ల వనజాత అచ్చమైన తెలంగాణవాసి. కథలోని పాత్రల పలుకుల్లో, కథనంలో తెలంగాణ తనం తాండవిస్తుంది. తెలంగాణ పలుకుబడులపై, భావ వ్యక్తీకరణపై రచయిత్రికి మంచిపట్టు వుంది. అన్ని కథలు వాస్తవ సంఘటనలను ప్రతిబింబించేవే. కథలన్నీ తెలంగాణ కథా సాహిత్య చరిత్రలో మిగిలిపోతాయని చెప్పవచ్చు. వెంటాడే కథల్ని మనకందించినందుకు ‘కోట్ల వనజాతను’ అభినందించక తప్పదు. ఈ కథా సంపుటిని సమగ్రంగా అంచనా వేసి విశ్లేంచిన డా॥ఎస్‌. రఘు ముందుమాటను అందించారు.

శ్రీ యం.దత్తాత్రేయ శర్మ