‘వందేమాతరం’ ఇంటిపేరయింది!

By: సంబరాజు రవిప్రకాశ రావు

స్వాతంత్య్ర పోరాటంలో భారతీయులందరిలో స్ఫూర్తి నింపిన తారకమంత్రం ‘వందేమాతరం’. అలాంటి మహత్తరమైన పదాన్ని తన ఇంటిపేరుగా సుస్థిరం చేసుకున్న దేశభక్తుడు వావిలాల రామచంద్రరావు, ఉరఫ్‌ వందేమాతరం రామచంద్రరావు. ఈయన 1917 ఏప్రిల్‌ 25న జోగులాంబ గద్వాల జిల్లా అలంపురం మండలం క్యాతూరు గ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, రామారావు. రామచంద్రరావుకు ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు. వీరి అన్న వీరభద్రరావు కూడ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న దేశభక్తుడు. రామచంద్రరావు గద్వాలలో ప్రాథమిక విద్యను, కర్నూలులో ఉన్నత పాఠశాల విద్యను, హైదరాబాద్‌ సిటీ కళాశాలలో డిగ్రీ చదువును పూర్తి చేశాడు. విద్యార్థి దశలోనే ఆర్య సమాజం వైపు ఆకర్షితుడైన వందేమాతరం రామచంద్రరావు సీతారాంబాగులో దాని శాఖను ప్రారంభించి ప్రజలలో చైతన్యం కల్గించాడు.

ఆర్య సమాజ ప్రభావంతో దేశభక్తి, హైందవమతానురక్తి, భక్తి విశ్వాసాలు, వేదాధ్యయనం మొదలైనవి రామచంద్రరావు మదిలో బలంగా నాటుకున్నవి. ఆర్య సమాజంలో కార్యకర్తగా పనిచేస్తూ కార్యదర్శిగా ఎదిగాడు. క్రమంగా దానిని నడిపించే నాయకుడుగా పరిణమించాడు.

వందేమాతరం రామచంద్రరావు డిగ్రీ చదివిన తర్వాత ఉస్మానియాలో ‘లా’ చదివారు. తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మరాఠీ, ఆంగ్ల భాషలపై వీరికి మంచి పట్టు ఉండేది. ఇంగ్లీషులో ధారాళంగా మాట్లాడగలగడంతో పాటు రచనా నైపుణ్యం కూడా ఉండేది. దేశ భక్తుల చరిత్రలను అధ్యయనం చేసి స్ఫూర్తి పొందిన రామచంద్రరావు ధైర్య సాహసాలకు, దీక్షా పట్టుదలకు పెట్టింది పేరు.

ఆనాటి హైదరాబాద్‌ ఆస్థానంలో నిజాం దురాగతాలు, దుర్మార్గపు చర్యలు అత్యంత హేయంగా ఉండేవి. హిందూ మతాన్ని అణచివేయడానికి, తెలుగు భాషను రూపుమాపడానికి అనేక కుట్రలు జరిగేవి. ఆ సమయంలో వందేమాతరం సోదరులు నిజాంను ఎదిరించారు. తమ ధిక్కార స్వరాన్ని వినిపించారు. చరిత్రలో నిలిచిపోయారు. అటు నిజాంను, ఇటు కాశీం రజ్వీని ఎదుర్కొంటూ ఆర్య సమాజ కార్యకలాపాలను విస్తృతం చేసిన వారిలో వందేమాతరం రామచంద్రరావు, నారాయణ పవార్‌లు ముఖ్యులు. హిందువులను ముస్లిమ్‌లుగా మార్చాలన్న దూరాలోచనను అడుగడుగునా ఎదుర్కొన్నారు. తెలంగాణ మొత్తం తిరిగి ఆర్య సమాజ శాఖలను స్థాపించిన ఘనత వందేమాతరానికి దక్కుతుంది. ఆర్య ప్రతినిధి సభకు అధ్యక్షుడుగా పనిచేశారు. హిందూ స్వయం సేవక్‌ సంఘ్ ను స్థాపించి వేలాది యువకులకు శిక్షణ ఇప్పించాడు. ప్రజలలో నిజాంను ఎదుర్కొనే శక్తిని కల్పించాడు. ‘హిందూ సంఘటనే’ అనే పుస్తకం రాశాడు.

హైదరాబాద్‌ సంస్థానంలో 1937వ సంవత్సరంలో వందేమాతర గీతం నిషేధానికి గురైంది. వందేమాతరం రామచంద్రరావు తన 20 సంవత్సరాల లోపు వయసు లోనే వందేమాతర గీతాన్ని పాడినందుకు జైలుకు వెళ్లాడు. చంచల్‌గూడ జైలులో రెండు నెలల భయంకర కారాగారాన్ని అనుభవించాడు. అక్కడే వీరికి రామానంద తీర్థతో పరిచయం కల్గింది. జైలులో ఇతర ఆర్య సమాజ వ్యక్తులతో కలిసి సంధ్యావందనంతో పాటు వందేమాతర గీతాలాపన చేసేవాడు. జైలు ఉన్నతాధికారులు హెచ్చరించినా దానిని మానలేదు.

1939 ఫిబ్రవరి 7వ తేదీన రామచంద్రరావు తీవ్రమైన శిక్షకు గురైనారు. ‘వందేమాతరం’ ఆపాల్సిందిగా తీవ్రంగా కొట్టారు. స్పృహ తప్పాడు. ఈ ఘటనను స్వామి రామానంద తీర్థ తన ‘హైదరాబాద్‌ స్వాతంత్య్ర పోరాటం`అనుభవాలు, జ్ఞాపకాల’లో నమోదు చేశాడు.

‘వందేమాతరం’ అనేది ఆయన ధీరత్వంతో, పౌరుషంతో సాధించుకున్న బిరుదు. ఆయన పేరుతో ముడిపడి కలిసిపోయి కీర్తిపతాకగా ఉంది. ` స్వామి రామానందతీర్థ.

రామచంద్రరావుకు ‘వందేమాతరం’ బిరుదును ప్రదానం చేసినవారు వీరసావార్కర్‌. 1939 డిసెంబర్‌ నెలలో పండరిపూర్‌లో సావార్కర్‌ను కలుసుకున్నాడు. ఆ మరుసటి రోజు జరిగిన బహిరంగసభలో బిరుదు ప్రదాన ప్రకటనను సావార్కర్‌ చేశాడు. అప్పటి నుండి ఈయన ఖ్యాతి దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. సావార్కర్‌ నుంచి ప్రేరణ పొందిన రామచంద్రరావుకు ఆయనంటే చాల గౌరవభావం ఉండేది. సావార్కర్‌ శతజయంతి సందర్భంగా 1983లో ‘ప్రిన్స్‌ అమాంగ్‌ పేట్రియాట్స్‌ వీర సావార్కర్‌’ అను పుస్తకాన్ని రామచంద్రరావు ఆంగ్లంలో రాశాడు.

ప్రభుత్వ రహస్యాలను కనిపెడుతున్నాడనే అభియోగంతో వందేమాతరం మరోసారి జైలుకు వెళ్లాడు. 13 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం రెండు సంవత్సరాలకు కుదించింది. 1940లో మరోసారి ఈయన అరెస్టై 1941లో విడుదలయ్యాడు. హైదరాబాద్‌ సంస్థానంలో భారత ఏజెంట్‌గా ఉన్న జనరల్‌ కె.ఎం. మున్షీకి వందేమాతరం సహకారం మరువలేనిది. నిజాం తయారు చేయదలుచుకున్న కొత్త ఆయుధాలకు సంబంధించిన రహస్యాలను, తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఛేదించి మున్షీకి తెలిపారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు వీరు మరోసారి జైలుకు వెళ్లారు. హైదదాబాద్‌ సంస్థానం భారత దేశంలో కలవడానికి వందేమాతరం తన శాయశక్తులా కృషి చేశారు.

నిజాం రాజ్యం భారత్‌లో చేరిన తర్వాత వీరు సహకారోద్యమంలో, కార్మిక ఉద్యమంలో పనిచేశారు. ఆయా రంగాల సంక్షేమానికి కృషి చేశారు. 1957, 1962, 1967 ఎన్నికలలో పోటీ చేశారు. 1962లో కె.వి. రంగారెడ్డిపై విజయం సాధించారు.

1969 తెలంగాణ తొలిదశ ఉద్యమానికి వందేమాతరం ఊతంగా నిలిచారు. 1978 నుండి 1981 వరకు అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. పాలనా భాషగా తెలుగును అమలు పర్చడానికి తీవ్రంగా కృషి చేశారు. 1981లో అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి అధ్యక్షులయ్యారు. ఈ కేంద్రం ద్వారా 1983, 1984 సంవత్సరాలలో అఖిల భారత స్థాయి తెలుగు సభలను జరిపించిన ఘనత వీరికే దక్కింది. వీరి ఆధ్వర్యంలో 1980వ సంవత్సరంలో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి స్థాపన జరిగింది. దీనికి వారు చాలాకాలం వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ఆ సమితి నేటికీ ఉంది.

జీవితమంతా దేశభక్తి కార్యక్రమాలకే అర్పించిన వందేమాతరం సేవలు, ధైర్యం, పోరాటతత్త్వం మరిచిపోలేనివి. వందేమాతరం ధర్మపత్ని కమలాబాయి. ఈ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. వారిపేర్లు దుర్గేశ నందిని, ఆదిత్య ప్రసాద్‌.

సుమారు 84 సంవత్సరాలు జీవించిన వందేమాతరం రామచంద్రరావు నవంబర్‌ 27, 2001వ తేదీన మరణించారు. నిరంకుశత్వాన్ని నిర్భయంగా ప్రశ్నించిన వారి తత్త్వం మరపురానిది. దేశమాత సేవకోసం ప్రాణాలను పణంగా పెట్టిన వారి ఆదర్శం నిత్య స్మరణీయం. జాతిపట్ల, మతంపట్ల వారికున్న గౌరవభావం, భక్తి విశ్వాసం ఆచరణీయం.