లక్ష్యాన్ని మించి వృక్షార్చన
జీవకోటికి ప్రాణాధారమైన మొక్కలను కాపాడాలన్న సదుద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం సందర్బంగా తెలంగాణ హరిత శోభితమైంది. ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్బంగా కోటి వృక్షార్చన కార్యక్రమానికి పిలుపునిచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు ఎంపీ సంతోష్ కుమార్, మరో మారు రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.. అతి తక్కువ సమయంలోనే ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. విజయవంతమైన ఈ కార్యక్రమం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ స్పందిస్తూ తాను స్వయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రామగుండం, గోదావరిఖని, సింగరేణి ఏరియా, సుల్తానాబాద్, చొప్పదండి నియోజక వర్గంలో వెడురుగట్ట, కుదురుపాకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎంపి వెంకటేశ్, ఎంఎల్ఎలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, సుంకె రవిశంకర్ ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలతో కలిసి అయా ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.

ఉదయం ఆరు గంటల నుండే ప్రారంభమైన మొక్కలు నాటే కార్యక్రమం, సాయంత్రం దాకా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం గ్రామాల్లోనే 2 కోట్ల 5 లక్షలు మొక్కలు నాటడం జరిగిందని సమాచారం. అలాగే జిహెచ్ఎంసి మేయర్, కార్పొరేటర్ లు కలిపి హైదరాబాద్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు, 142 మున్సిపాలిటీలలో ఛైర్మన్ లు, కౌన్సిలర్ల సహకారంతో 25 లక్షలు మొక్కలు, అన్ని కాలనీ సంఘాలు, ఇతరులు కలిసి 20 లక్షల మొక్కలు, అటవీ శాఖ పరిధిలోని ఖాళీ స్థలాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 50 లక్షల మొక్కలు నాటడం జరిగింది. హెచ్ఎండిఎ పరిధిలో ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 20 లక్షలు మొక్కలు నాటినట్లు సమాచారం. ఈ తీరున రాష్ట్ర వ్యాప్తంగా అందిన సమాచారం ప్రకారం మొత్తం 3 కోట్ల 30 లక్షల మొక్కలు నాటినట్లు సమాచారం.