| |

వెండి తెరపై కత్తి వీరుడు!

వెండి తెరపై కత్తి వీరుడురెండు దశాబ్దాలకు పైగా వందలాది తెలుగు జానపద చిత్రాల్లో కథానాయకునిగా నటించి వెండితెరపై తన ఖడ్గ విన్యాసంతో స్వైర విహారం చేసిన కథా నాయకుడిగా చరిత్రకెక్కిన ఎకైక మహానటుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు. మొత్తం భారతీయ సినిమా రంగంలో పలుభాషలలో, జానపద సినిమాలలో హీరోలుగా నటించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ వారంతా కేవలం ఈ కోవకు చెందిన సినిమాలకే పరిమితమై తమ సినీ ప్రస్థానాన్ని కొనసాగించలేదు.

టి.ఎల్‌. కాంతారావుగా, కత్తియుద్ధాల రాకుమారుడిగా తెలుగు సినిమా అభిమానులందరికి చిరపరిచితులైన వీరు తెలంగాణ నుండి సినిమాల్లోకి వెళ్లి ఒకవెలుగు వెలిగిన హీరోలలో అగ్రశ్రేణిలో నిలిచిపోయారు. కాంతారావు పేరు చెప్పగానే మనకు వెంటనే పలు జానపద, పౌరాణిక చిత్రాలు, వాటిలో ఆయన పోషించిన పాత్రలు మన కళ్లముందు మెదుల్తాయి. మన తెలంగాణ ప్రాంతంనుండి, సినిమాల్లోకి వెళ్లి స్వయంకృషి, పట్టుదల, నటనా ప్రతిభలతో వెండితెర కలల రాకుమారుడుగా ఒక వెలుగు వెలిగిన మహానటుడు మన కాంతారావు.

నిజాం రాజ్యంలోని నల్గొండ జిల్లా కోదాడ దగ్గరలోని గుడిబండ గ్రామంలో కేశవరావు, సీతారామమ్మ దంపతులకు 1925 నవంబరు 16న జన్మించారు టి.ఎల్‌. కాంతారావు. మూడేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. కోదాడలో ఉర్దూ భాషలో వల్తానియా (7వ తరగతి) వరకే చదువుకున్నారాయన. పసితనంలోనే నాటకాల పట్ల శ్రద్ధ పెంచుకున్న కాంతారావు నాటకాల్లో చిన్న చిన్న వేషాలు వేశాడు. 15వ ఏట చదువు వదులుకుని స్వంత వూరిలోనే వంశపారంపర్యంగా సంక్రమించే పటేల్‌ నౌకరీలో కుదురుకున్నాడు. పటేల్‌ మాటంటే వూరంతా శిలాశాసనంగా పాటించే కాలమది. గౌరవమర్యాదలకు కొదవే లేదు. అయినా ఆయనకు నాటకాలంటే ఉన్న మోజు తగ్గలేదు. ఎక్కడ నాటకాలు వేసినా వెళ్లి చూసివచ్చేవాడు. ఒకసారి ఆ వూరిలోకి సురభి నాటక కంపెనీ వచ్చింది. వారంతా కొంత కాలం అక్కడ నివాసముండి వరుసగా నాటకాలు వేయడానికి గ్రామ పెద్ద కాంతారావు అనుమతి కోసం వచ్చారు. ఎలాగు తను అనుమతిస్తే గానీ నాటకం ఆడరని ‘నాకు మీ నాటకంలో వేషం ఇస్తే ఊర్లో నాటకాలు వేయిస్తా’ నని మొండికేశాడు. తప్పేదిలేక వాళ్లు ఒప్పుకున్నారు. అలా తొలి సారిగా సురభి సమాజంలో ఆయన బ్రహ్మవేషం వేశారు. ఆ తరువాత ‘మధుసేన’, ‘కనకతార’, ‘గయోపాఖ్యానం’, ‘మేవాడ్‌’, బొబ్బిలి (హిందీ) నాటకాల్లో నటించారు.

1950లో మద్రాసు చేరుకున్న కాంతారావు తన మిత్రుడు టి. కృష్ణ ద్వారా హెచ్‌.ఎం. రెడ్డి రాగిణీ సంస్థలో చేరి మొదటిసారి ‘నిర్దోషి’ (1951) చిత్రంలో గుంపులో ఒకడిగా ఒక రైతు వేషంలో డైలాగు పలికిన విధానాన్ని చూసిన దర్శకుడు హెచ్‌.ఎం. రెడ్డి కాంతారావులో దాగివున్న నటుడ్ని గుర్తించారు. ఇక నుండి ”ఇతనికి ఇలాంటి వేషాలివ్వద్ద” ని సెట్లోనే డిక్లేర్‌ చేసి, ఆ తరువాత కాంతారావుతో ‘నువ్వే నా తర్వాతి సినిమా హీరోవ’ ని అభినందిస్తూ చెప్పారు. అలా 1953లో వచ్చిన ‘ప్రతిజ్ఞ’ మన కాంతారావు హీరోగా నటించిన తొలి సినిమాగా తెలుగు, తమిళ వెర్షన్‌లలో కూడా విడుదలైంది.

‘ప్రతిజ్ఞ’ విజయవంతమైనా రెండేళ్లపాటు కాంతారావుకు ఏ చిత్రం లోనూ అవకాశం రాలేదు. కాగా విఠలాచార్య ‘కన్యాదానం’ (1955)లో అవకాశమిచ్చారు. అలా విఠలాచార్య – కాంతారావుల కాంబినేషన్‌ మొదలై ఆ తరువాత జానపద చిత్రాల పరంపర తెలుగునాట ఒక ట్రెండ్‌ని సృష్టించింది. కన్నడిగుడైన విఠలాచార్య కాంతారావుకు జానపదాల్లో త్వరగా నిలబెట్టి నట్లే నిలబెట్టి బ్రహ్మాండంగా డబ్బుచేసుకున్నాడు. కాంతారావు ఆర్ధికపరమైన ఎత్తులు తెలీకపోవడం వల్ల విలన్‌గా వేసిన రాజనాలకు ఎక్కువ పారితోషికం ఇచ్చి ఈయనకు తక్కువగా చెల్లించేవారు. ఇదే విషయాన్ని కాంతారావు తన చివరి రోజుల్లో ఒకసారి మహబూబ్‌నగర్‌కి వచ్చినపుడు ‘అందరూ అనుకుంటారు విఠలాచార్య వల్ల నేను జానపద హీరోగా నిలబడ్డానని. కానీ ఆయన నా వల్ల సినిమాలు తీసి లక్షలు సంపాదించి నాకు పారితోషికం విషయంలో అన్యాయం చేసిన విషయం చాలా మందికి తెలియదు’ అన్నారు. అయినా సరే కాంతారావు తన ఆత్మకథలో విఠలాచార్య ఫోటోను ఒక పేజీ నిండా వేసి తనను జానపద హీరోగా తీర్చిదిద్దినవాడని గౌరవం ప్రకటించుకున్నాడు. అది మన తెలంగాణ వాడి హృదయ సంస్కారం.

జానపద కథానాయకుడు

జానపద సినిమాహీరోగా కాంతారావు ఆ తరువాత జయవిజయ (1959), సహస్రశిరచ్ఛేద అపూర్వ చింతామణి, కనకదుర్గ పూజా మహిమ (1960), వరలక్ష్మీవ్రతం (1961), స్వర్ణగౌరి, మదన కామరాజుకథ, నువ్వా-నేనా (1962), దేవసుందరి, గురువును మించిన శిష్యుడు, సోమవారవ్రతమహత్మ్యం (1963), బంగారు తిమ్మరాజు, నవగ్రహ పూజా మహిమ, తోటలో పిల్ల – కోటలో రాణి, మర్మయోగి (1963), విజయ సింహ, ప్రతిజ్ఞా పాలన, ఆకాశరామన్న, జ్వాలా ద్వీప రహస్యం, ప్రచండభైరవి, సింహాచల క్షేత్రమహిమ, పక్కలో బల్లెం (1965), భూలోకంలో యమలోకం (1966), అగ్గిదొర, దేవుని గెలిచిన మానవుడు, ఇద్దరు మొనగాళ్లు, కంచుకోట రహస్యం, చిక్కడు-దొరకడు (1967), వీరపూజ, అగ్గి మీద గుగ్గిలం, భలే మొనగాడు, దేవకన్య, దేవుడిచ్చిన భర్త, పేదరాశి పెద్దమ్మ కథ, రాజయోగం, రణభేరి (1968), పంచకళ్యాణి దొంగలరాణి, బొమ్మలు చెప్పిన కథ, రాజసింహ, ఉక్కు పిడుగు, గండరగండడు, ఏకవీర (1969), మెరుపువీరుడు, జన్మభూమి, సుగుణసుందరి కథ, రైతేరాజు, ఖడ్గవీర (1970), కత్తికికంకణం, అందంకోసం పందెం, అడవి వీరులు వంటి యాభైకిపైగా చిత్రాల్లో నటించారు.

ఎన్టీఆర్‌కి కాంతారావంటే సోదరభావం. ‘జయసింహ’ (1955) వేషం ఇప్పించిందీ ఈయనే. ఆ తరువాత ”లవకుశ” లో లక్ష్మణుడి పాత్రతో కాంతారావు పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. వీరిద్దరూ కలిసి ‘గౌరీమహత్మ్యం’, ‘శభాష్‌రాముడు’, ‘భట్టి విక్రమార్క’, ‘రక్తసంబంధం’, ‘భీష్మ’, ‘ఆప్తమిత్రులు’, ‘నర్తనశాల’, ‘దేశద్రోహులు’, ‘ఆడబ్రతుకు’, వంటి చిత్రాల్లో నటించారు. ఆ రోజుల్లో పౌరాణిక, సాంఘికాల్లో ఏ.ఎన్‌.ఆర్‌., ఎన్‌.టీ.ఆర్‌.లు ఒక వెలుగు వెలిగిపోతుండగా, తనదైన విభిన్నశైలిలో కాంతారావు జానపదాల్లో నటిస్తూనే శాంతి నివాసం, చివరికి మిగిలేది, మాంగల్యం, పెళ్లికానిపిల్లలు, బికారిరాముడు, ఎదురీత, మంచిరోజులు వస్తాయి, శ్రీమతి వంటి సాంఘికాల్లో, శ్రీ కృష్ణ రాయబారం, నర్తనశాల, మైరావణ, పాండవ వనవాసం, వీరాభిమన్యు, వీరాంజనేయ, భీమాంజనేయ యుద్ధం, శ్రీ కృష్ణ మహిమ, సతీ అరుంధతి, ఉషా పరిణయం, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం వంటి పౌరాణికాల్లో శ్రీ కృష్ణుడు, రాముడు, అర్జునుడు పాత్రలను పోషించారు. ఆ రకంగా కాంతారావు ఆల్‌రౌండర్‌గా రాణించారు.

అయితే నిర్మాతగా సప్తస్వరాలు, గండరగండడు, ప్రేమ జీవులు, గుండెలు తీసిన మొనగాడు, స్వాతిచినుకులు చిత్రాలు తీసి ఆర్థికంగా నష్టపోవడంతో ఆయన జీవితంలో ఒడిదుడుకులు మొదలైనవి. అంతలోనే చిత్ర పరిశ్రమ హైదరాబాదుకు మారింది. మద్రాసులో ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని హైదరాబాదుకు వచ్చారు. కానీ అవకాశాలు రాలేదు. తప్పదని ఒకనాడు హీరోగా నటించిన ఆయన 50 టీ.వి. సీరియల్స్‌లో చిన్న చిన్న వేషాలు వేశారు. శంకర్‌దాదా జిందాబాద్‌ (2007) ఆయన నటించిన చివరి చిత్రం.

కేరళ కణ్ణన్‌

మలయాళంలో భక్త కుచేలలో కృష్ణుడుగా నటించి కణ్ణన్‌గా ప్రశంసలందుకుని, కన్నడంలో ‘కంఠీరవ’, ‘ఆశాసుందరి’ చిత్రంలోనూ నటించారు. తమిళులైతే ఆయనను ఆంధ్రా ఎంజిఆర్‌ అని పిలుచుకునేవారు. వయసు పైబడినందున ముత్యాలముగ్గు, ఓ సీత కథ, గుణవంతుడు, ఎదురీత, ఊరికిమొనగాడు, మనవూరి పాండవులు, అల్లూరి సీతారామరాజు వంటి చిత్రల్లో క్యారెక్టర్‌ రోల్స్‌ చేశారు. అయితే ‘బికారి రాముడు’, ‘ఎదురులేని మనిషి’, ‘దేవుడు చేసిన మనుషులు’ చిత్రాల్లో నెగెటివ్‌ షేడ్స్‌ రోల్స్‌లో కనిపించారు. నాయికలుగా సావిత్రితో మొదలుకుని షావుకారు జానకి, దేవిక, రాజశ్రీ, కృష్ణ కుమారి, భారతి, శారద, విజయలలిత వంటి హీరోయిన్లతో కాంతారావు కాంబినేషన్‌ విజయసూత్రమైంది.

అయిదున్నర దశాబ్దాల తన సినీ సేవలకు గాను కాంతారావు ప్రజలచే అందుకున్న గౌరవాలు అనేకం. వంద చిత్రాలు పూర్తయిన సందర్భంగా కోదాడలో ‘నటప్రపూర్ణ’గా గౌరవించబడ్డారు. ఎన్‌.టి.ఆర్‌. ఆత్మగౌరవ పురస్కారం. రామినేని ఫౌండేషన్‌ అవార్డు. 1963 లవకుశ చిత్రంలో లక్ష్మణుడి పాత్రకు ఉత్తమ సహాయనటునిగా జాతీయ అవార్డు, పాలకొల్లులో అల్లు రామలింగయ్య స్వర్ణకమలంతో సన్మానం అందుకున్నారు. ఇంకా 1987లో వంశీ అవార్డు, సామర్లకోటలో అభినందన వారి నాగయ్య అవార్డు 2000 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య పురస్కారంతో గౌరవింపబడ్డారాయన.

అయితే జనం మెచ్చిన నటుడైన కాంతారావుకు ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం ఇవ్వకపోవడం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పక్షపాత ధోరణికి నిదర్శనం. ఇంకా 1951లో పరిశ్రమలోకి వచ్చిన కాంతారావును ”పద్మ” అవార్డులకు సిఫారసు చేయని సర్కారు 1970ల్లో వచ్చిన చిరంజీవి, మోహన్‌బాబు, బ్రహ్మానందం వంటి వారికి వాటిని ఇప్పించుకుని అగౌరవపరచింది. ఆ మహానటుడు 2009 మార్చి 22న 86వ ఏట మరణించారు. ఏది ఏమైనా మన జానపద సినీ కథానాయకుడుగా కత్తిపట్టి మెరుపువేగంతో శత్రువును మట్టికరిపించే విజయ సింహుడుగా, రాకుమారిని రక్షించే ఖడ్గవీరునిగా ఎన్నో అపూర్వమైన పాత్రలకు ప్రాణం పోసి తెలుగు సినీ కళామతల్లి నుదుట సింధూరమై నిలిచిన తెలంగాణ మణి దీపం మన తాడేపల్లి లక్ష్మీకాంతారావు. అందుకే తెలంగాణ ప్రభుత్వం కాంతారావు సతీమణికి ఆర్థిక సహగాయం అందించి ఆదుకుంది.

నారదుడంటే కాంతారావే…

1జానపదాల్లోనే గాక పౌరాణికాల్లోను గొప్పగా గుర్తుండిపోయే పాత్రలు చేశారు. వాటిలో ప్రధానమైనది నారదుని వేషం. ఇప్పటికీ సినిమా నారదుడంటే కాంతారావే మనకు గుర్తొస్తారు. కాంతారావు కన్నా ముందు, ఆ తరువాత చాలా మంది నారదవేషం వేశారు గానీ ఆయనలా ఎవరూ మెప్పించలేకపోయారు. ఎన్టీఆరే ఒకసారి కాంతారావు మాత్రమే ఈ వేషం వేయగలడు, తనెప్పుడూ ఈ వేషం వేయనని చెప్పేశారు. నారదపాత్ర విషయానికి వస్తే కాంతారావు నారదుడుగా ‘గంగాగౌరీ సంవాదం’ (1958)తో మొదలుకొని ‘దీపావళి’ (1960) ‘సీతారామ కళ్యాణం’ (1961) ‘మోహినీ రుక్మాంగద’ (1962) ‘శ్రీ కృష్ణార్జున యుద్ధం’ (1963), ‘శ్రీ కృష్ణ తులాభారం’, ‘శ్రీ కృష్ణపాండవీయం’ (1966), ‘శ్రీ కృష్ణ సత్య’ (1970), ‘సతీ సావిత్రి’ (1978) చిత్రాల్లో నటించారు.