విజయ దశమి
By:- వొజ్జల శరత్ బాబు

మ.అదిగో ! దుర్మద పూరితుల్ కలిన హాహాకారముల్ రేపుచున్
సదయుల్ గాక జనాళికెల్ల సుఖమున్ శాంతంబు లేకుండగన్
మదహస్తంబుల చేష్టలన్గలిగి యమ్మాహీషులన్మించుచున్
కదలన్ జూతురె వారినణ్చగను రా! కాళీ స్వరూపోద్ధతిన్ 1
ఉ.కొందరు చిన్నవారి నికకొందరు వారికి నీడు వారిని
న్కొందరు పెద్దవారలగు కొమ్మల కోమల జీవితంబులన్
చిందర వందరల్ సలుప చిత్తము వచ్చిన రీతి జేయు వా
రందరి తీరులన్ మలుప రావలె కాళిగ లోకకాంతికిన్ 2
కం.ఉమ్మడి కుటుంబ పానం
దమ్మును తొలగించ బోక తత్కార్యాళిన్
ఇమ్ముగ పెంచుచు నడుపుచు
నిమ్మగు స్వార్థంబు జంపు నిఖిలేశ్వరివే! 3
ఉ.రాక్షస కృత్యముల్ పెరిగి రక్షణ లేకజనంబు భీతితో
వీక్షణ జేయుచున్ వణుకు వెన్నున బుట్టెడి దుష్కృతాలకున్
సాక్షులు గాగ ధాత్రి మన జాలుట కష్టమె బ్రోవ రమ్ము ప
ద్మాక్షి! కృపామతల్లి! వరదాయిని! తారిణి! లోకపావని! 4
కం.అనునిమిషము నిను గొలుతును
మనసున, జగతిన శుభకర మగువిధి నడుపన్
కనుమ! విలువలిక తరుగని
ఘన నవ గమనపు పథముల గరపుము జననీ! 5
ఉ.పెంచిన వారినెల్లెడల బెంచుట న్యాయమ? శ్రీమయీ! ధరన్
ఇంచుక తిండికెల్లపుడు నెన్ని విధంబుల బాధనొందుచున్
మించిన దుఃఖబాగులయి మేనును వీడెదరట్టి లోకమం
దించుక చూపు ప్రేమ సిరి కీశ్వరివే ! జగ మెల్ల గొల్తురే! 6
సీ. ఏ విద్య జ్ఞానమ్ము నెప్పుడు శోభిల్ల
జేయునో యావిద్య చిక్కు నటుల
ఏ విద్య సంస్కార మేర్పడు దీప్తుల
నిచ్చునో యావిద్య నేర్చు నటుల
ఏ విద్య గురుభావ మెచ్చించి శిష్యుల
న్నిలుపునో యావిద్య నిగురు నటుల
ఏ విద్య సద్భక్తి నింపుగా దేదీప్య
పరచునో యావిద్య పట్టు నటుల
తే.గి. నేటి వారల నిప్పుడు నిండు తనపు
నిష్ఠ సహృదయ శీలము నేర్పు కలిగి
నడుపు టక్షరమ్ములనిమ్ము! జడిమ తొలగు
విధము బ్రాహ్మిణీ ! భారతీ! వేడుచుంటి ! 7
మానిని. వైద్యము విద్యల నంగడి వస్తువు వైనము కాగ నివారణ సా
ధూద్యమ శైలి మహోజ్జ్వల రీతి విమోకము జేయుచు నుద్ధతి స
ద్విద్యల జ్యోతులు వేడ్కగ నిచ్చుచు ధీరుల తేజము దీప్తము నౌ
సేద్యము సల్ప నిశీధుల వారణ జేయుమ శారద! శ్రీహితమై 8
తే.గీ. అంబ! నిను నమ్మి వేడెద సంబరమున
మొరల నాలకించెడి యమ్మ ముద్దరాల!
శోభ గూర్చవె మర్త్యుల వైభవముకు
నీవు తక్కొండురులనమ్మ నిజము సుమ్మి! 9
కం. శ్రీ మాతా ! కల్యాణీ!
నీ మాహాత్మ్యంబు జెప్ప నే నేవ్వండన్
మా మా దౌక్కార్యంబుల్
వేమార్లైనన్ సభక్తి వేడన్ బ్రోవే! 10