|

విజయసోపానాలపై నడిపే విజయదశమి

By: డా|| అయాచితం నటేశ్వర శర్మ

tsmagazine

ప్రతి ఏడాదీ ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్షంలో దశమి నాడు సకలజనావళి జరుపుకునే పండుగ ‘విజయదశమి’. దీనికే ‘దసరా’ అని మరొకపేరు. విజయదశమి పండుగను గూర్చి ప్రాచీన ధర్మ శాస్త్రాలు వివరించి ఇలా చెప్పాయి.

”అశ్వినస్య సితే పక్ష దశమ్యాం తారకోదయే
సకాలో విజయోనామ సర్వకామార్థ సాధకః”

అంటే ఆశ్వీయుజ మాసంలోని శుక్ల పక్ష దశమినాడు ప్రాతః కాలంలో చుక్కలు ఉదయించగా ఏర్పడే కాలానికి ‘విజయం’ అని పేరు. అది సర్వకామనలనూ తీర్చే చక్కని ముహూర్తం. ఈ పవిత్రదినాన ప్రతి వారూ శమీవృక్షాన్ని (జమ్మిచెట్టును) పూజించాలనీ, అలా పూజిస్తే అన్నింటి లోనూ విజయం లభిస్తుందనీ శాస్త్ర వాక్యం – శమీ వృక్షానికి గల మహిమ ఎలాంటిదో కూడా ఈ గ్రంథాలలో చక్కగా చెప్పబడింది.

‘శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ
శమీ శమయతే పాపం శమీ కంటకలోహితా
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ
కరిష్యమాణయాత్రాయాం యథాకాలం సుఖంమయా
తత్ర నిర్విఘ్న కర్త్రీ త్వం భవ శ్రీరామపూజితే !’

అంటే – జమ్మి చెట్టు పాపాలను పోగొడుతుంది. శత్రువులను నిర్మూలిస్తుంది. అజ్ఞాతవాససమయంలో అర్జునుని ధనుర్బాణాలను రక్షించింది. రామునికి ప్రియాన్ని కలిగించింది. జమ్మిచెట్టు ముండ్లతో కూడి ఉండడం వల్ల శత్రువులను దుర్భేద్యంగా ఉంటుంంది. చూడగానే పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. కార్యార్థం లేదా విజయార్థం యాత్ర చేసే మానవాళికి ఆటంకాలను తొలగించి విజయాలను సాధించి పెడుతుందని అర్థం. ఇంతటి మహిమగల ‘శమీ’ పూజతో కూడిన పుణ్యదినం కనుకనే ఈ పవిత్ర దినానికి ‘విజయ దశమీ’ అనే పేరు వచ్చింది.

పూర్వం రాజులు తమ రాజ్యవిస్తరణ కోసం ఈ విజయదశమి నాడే జైత్రయాత్ర ప్రారంభించేవారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దినాన ప్రకృతిలో ‘అపరాజిత’ అనే శక్తి ఆవహించి ఉంటుందనీ, ఆ శక్తి పరాజయం లేని విజయాలను అందిస్తుందనీ జనుల విశ్వాసం. ఈ దినాన సాయంకాల వేళ జనులందరూ ‘సీమోల్లంఘనం’ (ఊరిపొలిమేరలు దాటి వెళ్లడం) చేస్తారు. అలాగే పాలపిట్టను దర్శిస్తారు. పాలపిట్ట విజయానికీ, శుభానికీ సంకేతం అందుకే ఈ దినాన పాలపిట్టను చూస్తే సంవత్సరం పొడుగునా అడుగడుగునా విజయాలే లభిస్తాయనీ, అపజయాలు అసలే ఉండవనీ నమ్మకం అందరిలో నెలకొని ఉంది.

ఆశ్వీయుజ మాసం శక్తి పూజకు అనువైంది. ‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా, నమస్తస్యై నమస్తస్యై, నమస్తస్యై నమోనమః’ అని దేవీ మహత్మ్యం చెబుతోంది. అంటే ఈ ప్రపపంచంలోని అన్ని ప్రాణులలోను, పరమేశ్వరి శక్తి రూపంలో ఉంటుంది కనుక ఆ శక్తికి నమస్కరించాలి’ అని అర్థం. మానవ ప్రపంచాన్నే కాదు, సమస్త విశ్వాన్నీ, విశ్వాంతరాళాన్నీ ఏదో శక్తి నడుపుతోందనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. ఆ శక్తి అన్నింటికీ అతీతురాలు. ఆమెకు పుట్టుకలూ, చావులూ లేవు. ఆమె ఎల్లవేళలా నిలిచి ఉండే శాశ్వత స్వరూపిణి. ఆమె వల్లనే బ్రహ్మకు సృజన శక్తి, విష్ణువుకు పాలన శక్తి, శివునికి లయ శక్తి లభిస్తున్నాయి. ఆమె కనులు తెరిస్తే సృష్టి జరుగుతుంది. కనులు మూస్తే అంతా ప్రళయంలో లీనమైపోతుంది. మహాలక్ష్మీ, మహా సరస్వతి అని ఎన్నో పేర్లున్నాయి. లలితా దేవిగా లోకాన్ని చల్లగా కాపాడుతుంది. దుర్గగా దుష్టరాక్షసులను సంహరిస్తుంది. త్రిపుర సుందరిగా ఎవరూ చేరుకోలేని అత్యున్నత స్థానంలో నిలిచి ఉంటుంది. మహాకాళిగా రౌద్రరూపాన్ని ధరించి ప్రళయకాలంలో అన్నింటినీ తనలో లీనం చేసుకుంటుంది. మహాలక్ష్మిగా అపారసంపదలను కురిపిస్తుంది. మహా సరస్వతిగా జ్ఞానాన్ని లోకానికి పంచుతుంది. ఇలా ఆమె ఎన్నో రూపాలను ధరిస్తుంది. అన్ని రూపాలూ విశ్వ కల్యాణం కొరకే. దుష్టతను రూపుమాపి, మంచిని లోకంలో నిలపడం కోసమే అనేక రూపాలలో దర్శనమిస్తుంది. ఆమెను తలిస్తే చాలు మనస్సు ఆనందపారవశ్యంలో తేలియాడుతుంది. ఆమె త్రిభువనాలకూ రక్షణ కవచం ఆమె వల్లనే దేవతలకు సైతం ఎన్నో మహిమలు వచ్చాయి. ఇలా శక్తి స్వరూపాన్ని గూర్చి వేదాలు మొదలుకొని ఆపార వాఙ్మయమంతా వర్ణించింది. ఆమె మహిమను వర్ణించడానికి మానవులకు శక్తి చాలదు. దేవతలు కూడా ఆమె స్వరూపాన్ని పూర్తిగా తెలుసుకోలేరు.

శరదృతువులో వచ్చే ఆశ్వీయుజమాసారంభ దినం అయిన పాడ్యమి నుండి మొదలుకొని మానవులు శరన్నవరాత్రోత్సవాలు జరుపుకుంటారు. శక్తి స్వరూపాన్ని రోజుకొక్క రూపంలో ధ్యానిస్తూ పూజిస్తారు. శరత్కాలంలో చంద్రునికాంతి స్వచ్ఛంగా ఉంటుంది. దినానికొక్క కళగా వర్ధిల్లే చంద్రకళలో శక్తిని ఆరాధించడం పరిపాటి సప్తమీ తిథినాడు సరస్వతీ పూజ చేస్తారు. సరస్వతీ దేవి జ్ఞానదాయిని పుస్తకరూపిణి కనుక పుస్తక పూజతో సరస్వతీ దేవిని ఆరాధించడం సంప్రదాయంగా మారింది. కొందరు ఈ దినాన తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి, విద్యాభ్యాసం ప్రారంభం చేయిస్తారు. జ్ఞానం లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ సాధ్యంకాదు. మనిషి తన ప్రయత్నంలో సఫలీకృతుడు కావాలంటే జ్ఞాన సముపార్జన తప్పనిసరి జ్ఞానం ద్వారా లభించే సామర్థ్యమే సకల సంపదలనూ ప్రసాదిస్తుంది. సాధారణంగా సప్తమి నాడు మూలా నక్షత్రం సంభవిస్తుంది. సరస్వతీ దేవి పుట్టిన మూలా నక్షత్రం అందరికీ ఆరాధ్యమైంది. ఈ దినాన వాగ్ధేవిని పూజించిన వారికి సమస్త జ్ఞాన సంపద వశమౌతుందని విశ్వాసం.

అష్టమినాడు దుర్గాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన దినంగా సంప్రదాయం చెబుతోంది. దుర్గతులను నాశనం చేసి సుగతులను ప్రసాదించే దుర్గాదేవిని ఆయుధ రూపిణిగా ఈ దినాన ఆరాధిస్తారు. మానవ జీవనోపయుక్తాలైన యంత్రాలనూ, పరికరాలకూ, వాహనాలకూ, ఆయుధాలకూ, వస్తు సామాగ్రికీ పూజలు చేసి అవి దేవీ రూపాలుగా భావించడం జనులకు ఆనవాయితీగా మారింది.

నవమీ తిథిని ‘మహానవమి’ అనీ, ‘మహర్నవమీ’ అనీ పిలుస్తారు. ఈ దినాన శక్తి నవయౌవనంలో షోడశ వత్సర ప్రాయంలో ఈ జగత్తును అనుగహ్రిస్తుందని విశ్వాసం. అందుకే నిత్య యౌవనాన్ని కోరే మానవాళి మహర్నవమినాడు దేవిని ఆరాధిస్తారు. విశేష పూజలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నవమీ తిథినాడు దేవీ రూపంలో పదహారు కళలు విలసిల్లుతూ ఉంటాయని భక్తుల నమ్మకం.

ఇలా పండుగలన్నీ మానవాళికి అభ్యుదయాన్నీ, శ్రేయస్సునూ ప్రసాదించేందుకే నిర్దేశింపబడినాయి. ఏ పూజ అయినా త్రికరణశుద్ధిగా చేయాలి. అప్పుడే దివ్యశక్తి మనిషిని ముందుకు నడిపిస్తుంది. మనిషిలో ఆత్మశక్తిని పెంపొందింపజేసేవే పూజలూ, వ్రతాలూ, పండుగలూ. కనుక వీటిని మానసిక భావనతో చూచినప్పుడు మనిషిలో కలిగే పవిత్రత, స్థైర్యం, ధైర్యం, ఉల్లాసం అతని జీవితాన్ని ఆనందమయం చేస్తుంది. ఈ విజయదశమి కూడా అందరికీ కోరిన ఫలాలను అందించాలని కోరుకుందాం !