|

జయీభవ.. దిగ్విజయీభవ విజయదశమి…

  • మాశర్మ

ఈ పేరులోనే విజయం, దశ రెండూ దాగి వున్నాయి.దశ తిరగాలంటే, విజయం వరించాలంటే ‘అమ్మ’ను, ముగురమ్మల పూలపుటమ్మను, దుర్గమ్మను పూజించాలి. నవరాత్రులు, పది రోజులు పవిత్ర హృదయంతో పండుగ చేసుకోవాలి. ఈ సందర్భంలో, ఈ సంరంభంలో బమ్మెర పోతన్నను తలవాల్సిందే. ఆ పద్య చరణమ్ములను కొలవాల్సిందే.

ఇది మామూలు పదాలతో, పాదాలతో కూడిన పద్యం కాదు.మంత్రాక్షర మహితమైనది. బీజాక్షర సహితమైనది. దుర్గాదేవి/లలితాదేవి మంత్రానికి మహాకవి పోతనామాత్య పద్యరూపాన్ని ఇచ్చాడు. ఈ పద్యం చదువుకుంటే చాలు, ఆ  మంత్రాన్ని ఉపాసించినట్లేనని పెద్దలు చెబుతారు. మహత్త్వము, కవిత్వము, పటుత్వము, సంపదలు ప్రాప్తిస్తాయన్నది సారాంశం. అదే ఫలశృతి. అందుకే, విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో, ఈ పద్యాన్ని అమ్మవారి సన్నిధిలో అక్షరాకృతిలో ఉంచారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః = ఇదీ మంత్రం. ఇవన్నీ బీజాక్షరాలతో కూడుకున్నవి.ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ చదువరాదని నియమం. శుచి, శుభ్రతతో తయారై ఉపాసించాలి. ఏ మంత్రమైనా నియమనిష్ఠలతోనే పఠించాలి. ఆ నియమాలు, మంత్ర రహస్యాలు బాగా ఎరిగివున్న పోతన్న అందరి సౌలభ్యం కోసం భాగవత పద్యాలలో వాటిని ఇమిడ్చాడు. అటువంటి వాటిల్లో ఇది గొప్ప పద్యం. విజయదశమి వేళలలో చదువుకుంటే సర్వం సిద్ధిస్తాయని విశ్వసించాలి. విశ్వసించడం వైదిక ధర్మం. ఓం = మహత్త్వము, ఐం = కవిత్వ శక్తి, హ్రీం = పటుత్వము, శ్రీం = ఐశ్వర్యము, సంపదలు. పద్యంలో అడుగడుగునా ‘అమ్మ’ శబ్దం కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటుంది. అమ్మ = శ్రీమాత. వీటన్నిటిని కలుపుతూ పద్యంగా అల్లాడు పోతన్న. ఈ పద్యం చదువుకుంటే చాలు భయాలన్నీ తొలగిపోతాయి, జయాలన్నీ కలుగుతాయి. 

జయ శుభకారిణి, విజయరూపిణి అయిన దుర్గమ్మను భక్తి శ్రద్ధలతో పూజించే గొప్పకాలం దసరా మహోత్సవం. దసరా పండుగ శోభ నిన్న మొన్నటి వరకూ పల్లెసీమలలో గొప్పగా విలసిల్లేది. పట్టణీకరణ నేపథ్యంలో, ఆ ప్రాభవం కొంత తగ్గినా, వైభవం సరికొత్త రూపాలను సంతరించు కొంటోంది. అయ్యవారికి చాలు అయిదు వరహాలు.. పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు… అని పాడుకుంటూ విద్యార్థులు సందడి చేసే దృశ్యాలు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ పల్లెల్లో కనిపించేవి. ‘దసరా’ హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ. శ్రీరామ చంద్రుడి నుంచి ఇప్పటి పాలకుల వరకూ అందరూ దుర్గమ్మను కొలుస్తూనే ఉన్నారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ  కలిసి తొమ్మిదిరోజులవుతాయి. పదవరోజు దశమి. నవరాత్రులు, విజయదశమి కలిసి ‘దసరా’గా జరుపుకుంటాం. ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచారం.

ఈ నవరాత్రులను ‘శరన్నవ రాత్రులు’ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక అలా పిల్చుకొంటాం. ‘శక్తి’ని ఆరాధించడం, సర్వశక్తి స్వరూపమైన దుర్గమ్మను ఉపాసించడం ఈ వేళలలో చేసే ముఖ్యమైన కార్యం. దస్‌ + హరా = దసరా. రావణాసురుడి పదితలలు నరికి సంహరించిన సందర్భంగా జరుపుకొనే విజయోత్సవం కూడా ఈ మహోత్సవం. దేవీ నవరాత్రులలో విశేష పూజలు చేయడం మన ఆచారం. ముగురమ్మలైన మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతిని ఆరాధించుకుంటాం.

ఒక్కొక్కరికీ మూడు రోజుల చొప్పున పూజలు నిర్వహిస్తూ ఉంటాం. బొమ్మలకొలువు పెట్టడం కూడా వేడుకల్లో ఒక భాగం. అమ్మవారిని ఒక్కొక్కరోజు ఒక్కొక్క రకంగా విశేషంగా అలంకరించడం, ఆ దర్శనం పొందడం సర్వ ఫలదాయకం. మన తెలంగాణలో తొమ్మిది రోజుల పాటు ‘బతుకమ్మ’ ఆడడం మన ప్రత్యేకం. బతుకమ్మ (గౌరి) పండగ లేదా సద్దుల పండగ చాలా ప్రసిద్ధం. బతుకమ్మను పూలతో అందంగా అలంకరించడం, ఆటపాటలతో ఆనందించడం, చివరి రోజున నిమజ్జనం చేయడం భారతదేశంలో కేవలం తెలంగాణలో మాత్రమే జరిగే గొప్ప సంబురం. ఈ అపురూప దృశ్యాలను కొన్ని కోట్లమంది దర్శించి, పులకించడం ‘బతుకమ్మ పండుగ’లోని విశేషం. ఇక తంగెడు పూలశోభ గురించి చెప్పక్కర్లేదు. అది సుందరం, సుమనోహరం. 

రామాయణ, మహాభారత కాలం నుంచి ‘విజయదశమి’ విశిష్టమైనదిగా పేరుకెక్కినది. ధర్మం – అధర్మం మధ్య జరిగే యుద్ధంలో చివరికి ధర్మమే గెలుస్తుందని పురాణ, ఇతిహాసాలు చెబుతూనే ఉన్నవి. జగదంబయైన దుర్గాంబ మహిషాసురుడిపై నవరాత్రులు యుద్ధం చేసి, వాడిని వధించి, జయించింది. ఆ సందర్భాన్ని పదవరోజు ‘సంబురం’గా జరుపుకుంటున్నాం. అదే దశమి, అదే విజయదశమి. అజ్ఞాత వాసం కోసం విరాటరాజు కొలువుకు వెళ్లే సందర్భంలో, పాండవులు తమ అత్యంత శక్తివంతమైన ఆయుధాలన్నింటినీ జమ్మిచెట్టుపై ఉంచుతారు. వాటిని తిరిగి బయటకు తీసింది కూడా విజయదశమినాడే,అని భారత కథలు చెబుతున్నవి. దసరా వెనకాల ఉన్న పురాణ గాథలు పుణ్య పూజితాలు.’ దేవీ నవరాత్రులు’ జరుపుకొనే వేళలలో ‘శ్రీ లలితా సహస్ర నామ’ పారాయణం నిత్యం చేయడం సర్వ శుభప్రదం. ‘దశ హరా’ అంటే, పది పాపాలను హరించేది అని కూడా దైవజ్ఞులు చెబుతుంటారు. మన ఆచార వ్యవహారాలన్నీ శాస్త్రీయమైనవే. మానసిక, శారీరక, సామాజిక ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొనే పూర్వులు పండుగలను రూపకల్పనం చేశారు.

అందులో ఋతువుల పాత్ర ప్రశస్తమైంది. శరదృతువుకు ముందు వర్షఋతువు ఉంటుంది. విస్తారమైన వర్షాలు కురవడం వల్ల చీమలు, దోమలు, కీటకాలు ప్రబలుతాయి. ఈ కాలంలో ప్రజలు జ్వరాలు, రోగాలతో బాధపడుతూ వుంటారు. వీటికి ‘యమద్రంష్టము’లని పేరు. మహిషము మొదలైన జంతువులను దేవి చంపివేస్తుందని ‘దేవీ భాగవతం’ చెబుతోంది. ఈ ఋతువులలో చేసే కార్యాల వల్ల, ఆహార నియమాల వల్ల, ఉపవాసాల వల్ల, జీవనశైలిలో వచ్చే మార్పుల వల్ల రోగాలను జయించి మంచి ఆరోగ్యవంతులమవుతాం. ధ్యాన, జపాదుల వల్ల మానసిక ఆరోగ్యం, మేధో పటుత్వం పెరుగుతుంది. ‘దురుడు’అనే రాక్షసుని అమ్మవారు జయించడం వల్ల ‘దుర్గ’ అనే పేరు వచ్చిందని అంటారు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు వచ్చింది. నవదుర్గలుగా అవతారమెత్తింది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చండ, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి అనే పేర్లు ఏర్పడినట్లు చెబుతారు. పరాశక్తి స్వరూపమైన అమ్మవారిని ఆరాధించడం, నియమనిష్ఠలతో గడపడం, సంయమనం పాటించడం, సర్వ జీవుల పట్ల, తోటి మనుషుల పట్ల సమ భావంతో మెలగడం వల్ల సర్వమూ వశమవుతాయి. విజయదశమి ఎందరికో విజయాన్ని చేకూర్చిందని చరిత్ర చెబుతోంది. ‘అమ్మ’ను నమ్ము కున్న వారికి అంతటా విజయమే వరిస్తుంది.అభయమిచ్చే అమ్మ పక్కనుంటే అన్నీ శుభములే.