ఓటరు తీర్పు

మన దేశంలోని లోక్‌సభ ఎన్నికల కోలాహలం గత కొన్ని నెలలుగా కొనసాగుతోంది. లోక్‌సభతో పాటు మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ సహా మరికొన్ని రాష్ట్రాల శాసన సభలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఏడు దశలలో జరుగుతున్న ఈ ఎన్నికలలో ఇప్పటికి నాలుగు దశల పోలింగ్‌ ముగిసింది. ఐదు, ఆరు, ఏడు దశల పోలింగ్‌ ఈనెల 19 తో ముగుస్తుంది. మన రాష్ట్రంలోని లోక్‌సభా స్థానాలకు తొలిదశలోనే ఏప్రిల్‌ 11న పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది.

తెలంగాణలోని 17 లోక్‌సభా స్థానాలకు జరిగిన ఎన్నికలలో 62.69 శాతం పోలింగ్‌ జరిగింది. అత్యధికంగా ఖమ్మం స్థానంలో 75.28 శాతం, అత్యల్పంగా హైదరాబాద్‌ లో 44.75 శాతం పోలింగ్‌ జరిగింది. విద్యావంతులు అధికంగా ఉన్న హైదరాబాద్‌ వంటి మహానగరంలో పోలింగ్‌ శాతం తగ్గడం కొంత ఆలోచించవలసిన విషయమే. పోలింగ్‌ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం కృషి చేసినప్పటికీ ఆశించిన రీతిలో ఫలితం ఇవ్వలేదు.

తెలంగాణలోని నిజామాబాద్‌ లోక్‌సభా స్థానంలో అత్యధిక సంఖ్యలో 185 మంది అభ్యర్థులు రంగంలో నిలవడంతో ఇక్కడ సజావుగా ఎన్నిక నిర్వహించడం ఎన్నికల సంఘానికి ఓ సవాలుగా నిలిచింది. అయినప్పటికీ, చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 27 వేల అత్యాధునిక ఈవీఎంలను వినియోగించి ఈ నియోజకవర్గంలో విజయవంతంగా పోలింగ్‌ నిర్వహించ గలిగారు. ఇక పోలీస్‌ యంత్రాంగం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో కీలకపాత్ర పోషించి అభినందనలు అందుకుంది.

తొలిదశలో ఏప్రిల్‌ 11న మన రాష్ట్రంలో పోలింగ్‌ జరుగగా, ఫలితాల కోసం నెల రోజులకు పైగా ఎదురుచూడవలసి రావడం కూడా ఫలితాలపట్ల కొంత ఉత్సుకతను కల్గిస్తోంది. ఇటు రాజకీయ పక్షాలు, ప్రజలు ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు ఈనెల 23న కౌంటింగ్‌ అనంతరం వెల్లడి కానున్నాయి.

పోలింగ్‌ అనంతరం ఈవీఎంలు పోలీసుల మూడంచెల పహరాలో సురక్షితంగా భద్రపరచి ఉన్నాయి. పోలింగ్‌ వలెనే కౌంటింగ్‌ కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం, అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉంది. దేశంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తారన్న విషయం త్వరలో వెల్లడి కానుంది.

కాగా, మన రాష్ట్రంలో ఎం.పి.టి.సి, జడ్పీటిసి స్థానాలకు కూడా ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. ఈనెల 6,10,14 తేదీలలో మూడుదశల్లో బ్యాలెట్‌ పద్ధతిలో పోలింగ్‌ జరుగనుంది. అయితే, లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతనే, ఈనెల 27న ఈ ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.