|

పర్యావరణ సాహిత్యానికి ప్రాణ చైతన్యం వృక్ష వేదం

By: డా. కోయి కోటేశ్వరరావు, డా. జె. నీరజ

DCIM\100MEDIA\DJI_0011.JPG

ఈ భూమిపై మానవ పరిణామానికి పూర్వం నుండే, చెట్లు సకల జీవజాలానికి అవసరమైన ఆహారం, ఆక్సిజన్‌ను అందిస్తున్నాయి. అటు పిమ్మట ఈ భూగోళంపైకి అతిథిలా వచ్చిన మనిషి, క్రమంగా అన్నింటిపై ఆధిపత్యం సాధించి, ఇతర జీవరాసులు బ్రతకటానికి అవసరమైన వాతావరణాన్ని నాశనం చేస్తూ, అదే అభివృద్ధి అని విర్రవీగుతున్నాడు. కానీ క్రమంగా, తాను చేస్తున్న తప్పులకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. చెట్టు మనిషికి అవసరమైన నీడ, నీరు, నిప్పు ఇస్తుంది. ప్రాణవాయువై, ఔషధమై కాపాడటమే కాక ఎన్నో అదనపు అవసరాలను అందిస్తుంది. ఆధునిక జీవనశైలిలో వాటి విలువ పెరుగుతూనే ఉంది. మనిషి పచ్చదనం ప్రాముఖ్యతను గమనిస్తున్నాడు కానీ, తన బాధ్యతలను విస్మరిస్తున్నాడు.

అడవులు, పచ్చదనం, పర్యావరణాన్ని పణంగా పెడుతూ పెరుగుతున్న నగరీకరణ పర్యవసానమే మండుతున్న ఎండలు, అపసవ్య వర్షాలు, అంతుపట్టని వాతావరణ మార్పులు. ఈ వైరుధ్యాల మధ్య, మరి మనం ఏం చేయాలి అన్నదే మన ముందున్న ప్రశ్న…ఈ ప్రశ్నకు సమాధానమే పచ్చదనాన్ని పెంచటం, పర్యావరణాన్ని పరిరక్షించి రాబోయే తరాలకు భద్ర భూగోళాన్ని అందించటం.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించిన ‘హరితహారం’ స్ఫూర్తితో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. పర్యావరణ పరిరక్షణా ఉద్యమంలో సంతోష్‌ కుమార్‌ తలపెట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం చారిత్రాత్మకమైనదని దేశంలో చర్చ జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ప్రతిష్టను పెంచటంలో ఆయన నిబద్ధతతో కృషి చేస్తున్నారు. ఎందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులను, టాలీ వుడ్‌, బాలీవుడ్‌, క్రీడా దిగ్గజాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి యువతను హరిత కార్యకర్తలుగా మలచడంలో ముందంజలో ఉన్నారు. అంత కడివెడు పాలపై ఒకింత మీగడ పేరినట్లుగా  మనకు మిగులును గతము లోపలి మంచి అని డా.సి.నారాయణరెడ్డి అన్నట్లుగా ప్రాచీన వాఙ్మయంలోని పర్యావరణ యెరుకను ‘వృక్షవేదం’ ప్రపంచానికి చాటిచెప్తుంది. ఇవ్వాళ పర్యావరణ ఉద్యమకారులు, వైజ్ఞానికవేత్తలు చెప్తున్న ఎన్నో విషయాలు మన ప్రాచీన సాహిత్యంలో ఉన్నాయని వృక్షవేదం గుర్తుచేస్తున్నది.  ఇప్పటివరకు వెలువడిన పర్యావరణహిత సాహిత్యంలో ఈ గ్రంథం ఒక మేలిమలుపు. ఈ నేపథ్యంలో  విద్యార్థినీవిద్యార్థుల్లో పర్యావరణ స్పృహను, సృజనాత్మక ప్రతిభను పెంపొందింప జేయాలనే సంకల్పంతో ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ సాహిత్యాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనే ఉత్తమ సంకల్పంతో ‘వృక్షవేదం’ పుస్తక పరిచయ సభను, పర్యావరణ పరిరక్షణ పునరంకిత సభను, ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు కవితా రచన పోటీ నిర్వహించాము.

జూమ్‌ వేదిక ద్వారా జనవరి 29వ తేదీ ఉ.9.30 గం. కళాశాల ప్రిన్సిపాల్‌ డా.వి.విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశం మధ్యాహ్నం 1.00 గం. వరకు సాగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సభలో విశిష్ట అతిథిగా ప్రముఖ కవి, గాయకులు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌, ఆత్మీయ అతిథులుగా కళాశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకులు డా.జి.యాదగిరి, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు డా.రాజేందర్‌ సింగ్‌, అకడమిక్‌ గైడెన్స్‌ అధికారి డా.ఘన్‌ శ్యామ్‌ పాల్గొన్నారు. ప్రముఖ పర్యావరణవేత్త, పద్మశ్రీ వనజీవి రామయ్య, ప్రముఖ విమర్శకులు ఎం.నారాయణ శర్మ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. తెలుగు శాఖ అధ్యక్షులు శ్రీమతి అవధానం సుజాత పాల్గొన్న ఈ సభను తెలుగుశాఖ సహాయ ఆచార్యులు డా.జె.నీరజ, డా.కోయి కోటేశ్వర రావు సమన్వయం చేశారు. 

విధిగా మూడుమొక్కలు నాటాలి.. సంతోష్‌ కుమార్‌

ముఖ్యఅతిథి జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ పుట్టిన రోజునాడు విధిగా మూడు మొక్కలు నాటి, వాటిని కన్నబిడ్డల్లా సంరక్షించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి గత ఇరవయ్యేళ్లుగా అత్యంత సన్నిహితంగా మెలిగే మహాద్భాగ్యం తనకు లభించిందని, వారొక నడిచే విజ్ఞాన సర్వస్వమని, లివింగ్‌ లెజెండ్‌ అని కొనియాడారు. ముఖ్య మంత్రి ప్రారంభించిన హరితహారం స్ఫూర్తితో తాను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని, మహోన్నతమైన హరితహారం లక్ష్యాలను, ఆశయాలను ఆచరణాత్మకంగా ముందుకు తీసుకు వెళ్లడమే తన ధ్యేయమని చెప్పారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన హరితహారం కార్య క్రమాన్ని కేంద్రమంత్రి  ప్రకాశ్‌ జావదేకర్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ప్రశంసించారని అన్నారు. భారతదేశ పర్యావరణ ఉద్యమానికి హరిత హారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాలు సరికొత్త ఉత్తేజాన్ని అందించాయని సంతోష్‌ కుమార్‌ వివరించారు. కీసర అటవీప్రాంతాన్ని తాను దత్తత తీసుకొని కోట్లాది రూపాయలు వెచ్చించి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని, ఈ స్ఫూర్తితో ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కృషిలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని, ఇది తనకు మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటున్నదని  అన్నారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమం పట్ల యువత, విద్యార్థులు త్వరగా ఆకర్షితులు కావటానికే తాను ప్రముఖ బాలీవుడ్‌, టాలీవుడ్‌  సినిమా హీరోలను, రాజకీయ ప్రముఖులను, అంతర్జాతీయ క్రీడాకారులను ఇందులో భాగస్వాములను చేశానని సంతోష్‌ కుమార్‌ అన్నారు.

త్వరలో భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి కూడా గ్రీన్‌ ఛాలెంజ్‌ని స్వీకరించేలా తాను విజ్ఞప్తి చేస్తానని సంతోష్‌ కుమార్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రభుత్వ కళాశాలల ప్రాంగణాలను ఆకుపచ్చని వనాలుగ తీర్చిదిద్దాలని కళాశాల విద్యాఅధికారులకు ఆయన సూచించారు. రేపటితరం భద్రమైన భవిష్యత్తు కోసం ఈ తరాన్ని పచ్చదనం వైపు నడిపించాలని పిలుపునిచ్చారు. కళాశాల విద్యార్థులు హరిత సైనికుల్లా ముందుకు కదిలి పుడమితల్లి ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. ప్రతి విద్యార్థి మొక్కను నాటి, ఆ సెల్ఫీని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయాలని చెప్పారు. పర్యావరణ విద్యను తప్పనిసరి పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు. డా.బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, గాంధీ లాంటి నాయకులు చెట్లు నాటుతున్న చిత్రాలను కరెన్సీ నోట్ల మీద ముద్రిస్తే అందరికీ ప్రేరణగా ఉంటుందని ఆయన సూచించారు.

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఆశయాలను  అక్షరబద్ధం చేయాలనే లక్ష్యంతో వృక్షవేదం గ్రంథాన్ని వెలువరించినట్లు చెప్పారు. వృక్షవేదం పర్యావరణ ఉద్యమానికి ప్రాణ చైతన్యాన్ని అందిస్తుందని సంతోష్‌ కుమార్‌ వివరించారు. ఎంతో విలువైన ‘వృక్షవేదం’ పుస్తకాన్ని రూపొందించటంలో విశేషంగా కృషిచేసిన ఈ గ్రంథ సంపాదకుడు, ప్రముఖ కవి గాయకులు దేశపతి శ్రీనివాస్‌ని, ఇందుకు సహకరించిన ప్రముఖ విమర్శకులు నారాయణ శర్మని అభినందించారు.

సిటీ కళాశాలను దత్తత తీసుకుంటా

వంద సంత్సరాల ఘన చరిత్ర కలిగిన సిటీ కళాశాలను తాను దత్తత తీసికొని, ప్రభుత్వ సహకరంతో అభివృద్ధి చేస్తానని సంతోష్‌ కుమార్‌ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పర్యావరణ పునరంకిత సభను నిబద్ధతతో నిర్వహించిన తెలుగు శాఖ అధ్యాపకవర్గాన్ని, కళాశాల ప్రిన్సిపాల్‌ డా. విజయలక్ష్మిని, కవితల పోటీలో బహు మతులు పొందిన శ్రీనిధి (ప్రభుత్వ సిటీ కళాశాల), శ్యామల (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల), హైమావతి (ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కరీంనగర్‌)ని అభినందించారు.

ఔషధం కాని మొక్క అవనిలో లేదు: వనజీవి రామయ్య

ఈ పర్యావరణ పునరంకిత సభలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న పద్మశ్రీ వనజీవి రామయ్య మాట్లాడుతూ, ఆట పాటల ద్వారా చెట్ల ప్రాముఖ్యతను బాల్య దశ నుండే  విద్యార్థులకు ప్రబోధించాలని సూచించారు. పిల్లలకు చిన్నతనం నుండే మట్టిలో మాణిక్య మున్నదని, పుడమిలో పండు ఉన్నదని చెప్తూ నీటిలోని చేపకు గాలం వేసినట్లు, పుడమిలోనే పండుకు మొక్క అనే గాలం వేయాలంటూ  మొక్కల పట్ల ప్రేమను, చెట్ల సంరక్షణ బాధ్యతను నేర్పాలని సూచించారు. చెట్టును మించిన దైవంలేదని, ఔషధం కాని మొక్క అవనిలో లేదని అన్నారు. విద్యార్థులు, యువత తమ సమయాన్ని కేవలం ఆటలతో గడిపేయక, బంగారు తెలంగాణతో పాటు ఆరోగ్య తెలంగాణ నిర్మించాలని అన్నారు. వృక్షవేదం పుస్తకాన్ని విద్యార్థులు విధిగా అధ్యయనం చేయాలని అన్నారు. కరెన్సీ నోట్లపై చెట్టు నాటుతున్న బొమ్మను ముద్రిస్తే నిరక్ష రాస్యులకు, భాషతో సంబంధం లేకుండా పర్యావరణ స్పృహ కలుగుతుందని చెప్పారు.

విద్యార్థులు హరితసైనికుల్లా పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాలి: డా.వి.విజయలక్ష్మి 

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమం ద్వారా ప్రజలలో పర్యావరణ స్పృహను కలిగిస్తున్నారని, ఈ స్ఫూర్తితో విద్యార్థులు హరితసైనికుల్లా పర్యా వరణ పరిరక్షణకు పూనుకోవాలని, వృక్షవేదం పుస్త కాన్ని ఒక పాఠ్యగ్రంథంగా పరిగణించాలని సూచించారు ప్రభుత్వ సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌ డా. వి.విజయలక్ష్మి. వివిధ రంగాల్లోని ప్రముఖులను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం ద్వారా, ఈ కార్యక్రమానికి భారతదేశంలో ఒక హైప్‌ క్రియేట్‌ చేశారని అందుకు సంతోష్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. అశోకుడు చెట్లు నాటించెనని చరిత్ర పాఠాల్లో చదువుకున్నాము. సంతోష్‌ కుమార్‌ ఆ పనిని మరింత బాధ్యాతాయుతంగా చేస్తున్నారని ప్రతి నిత్యం దినపత్రికల్లో, టివి చానళ్ళలో చూస్తున్నాం అని అన్నారు.

చెట్టుకు కూడా జీవించే హక్కు ఉంటుంది: దేశపతి శ్రీనివాస్‌

ఈ కార్యక్రమంలో విశిష్టఅతిథిగా పాల్గొన్న ప్రముఖకవి, ప్రజాగాయకులు దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఏదైనా ఒక అసాధారణమైన కార్యాన్ని సాధించాలంటే చాలా ఉపపత్తి, వనరులు అవసరం అనుకుంటారు అందరూ. కానీ వాటన్నింటికీ మించి ఉండవలసింది కార్యదీక్ష, చిత్తశుద్ధి అని, అది మనం వనజీవి రామయ్య నుంచి గ్రహించవచ్చని, అలా ఆయన మొక్కలు నాటుకుంటూ తన వంతు పచ్చదనాన్ని అందిస్తున్న విషయం ప్రభుత్వం సైతం గుర్తించి పద్మశ్రీతో గౌరవించిందని అన్నారు. ‘వృక్షవేదం’ పుస్తకాన్ని పర్యావరణ ఉద్యమానికి ఒక తాత్త్వికభూమికను ఏర్పరచాలనే ఉద్దేశంతోనే  ప్రచురించినట్లు తెలిపారు. మనిషికి జీవించే హక్కు ఉన్నట్లుగానే చెట్టుకు కూడా జీవించే హక్కు ఉంటుందని, ఆ పవిత్రమైన హక్కును అందరూ కాపాడాలని అన్నారు. ప్రకృతిలో మమేకమై జీవించే నైజాన్ని అలవరుచుకోవాలని చెప్పారు.

పుడమి మీద మొక్కలను నాటినట్లుగానే, విద్యార్థుల మనోభూమిలో అక్షరాల విత్తనాలను నాటితే అవి ఫలించి, పుష్పిస్తాయనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాలాలు గతితప్పుతున్నాయని, గ్లోబల్‌ వార్మింగ్‌ మనకొక హెచ్చరిక చేస్తున్నదని, దీనిని గుర్తించి సత్వరమే స్పందించకపోతే భూగోళం, అగ్నిగోళంగా మారుతుందని హెచ్చరించారు. టిబెట్‌ లో వానపాములను కూడా తమ పూర్వీకులుగా గౌరవిస్తారని, భూమి మీదకి అతిథిలా వచ్చివెళ్లే మనిషి ఇక్కడి జీవజాలంతో కలసి మెలసి ఉండాలని సూచన చేశారు. వృక్షాలను నరకటం కూడా ఒక రకమైన హత్య అని దేశపతి శ్రీనివాస్‌ అన్నారు. వృక్షఫలాలను ఆరగిస్తూ, చెట్టుకు చేటు చేస్తే, ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటుందని ఆయన హితవు పలికారు. ప్రాచీన కవులు వృక్షాల పట్ల గొప్ప అవ్యాజమైన ప్రేమను, అనురాగాన్ని తమ కావ్యాలలో ప్రకటించారు. వారి సాహిత్యం అద్భుతమైన వన వర్ణనలతో నిండివుందని, అమూల్యమైన ఆ సారస్వత సంపదను, ఆ హరిత విలువలను ఈ తరం అందిపుచ్చుకోవాలని అన్నారు. ప్రకృతి సూత్రాలకు వ్యతిరేకంగా మనం జీవిస్తున్నందువల్లే పేరు తెలియని వ్యాధుల బారిన పడుతున్నామని అన్నారు. వైదిక సాహిత్యంతో పాటు నీతి శాస్త్రం, రామాయణ మహాభారతం, గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఒక ప్రతిష్ఠాత్మకమైన ఆకుపచ్చని ఉద్యమానికి నాంది పలికిందని ఆయన విశ్లేషించారు.

మహోన్నత జ్ఞాన ప్రకాశం

ఈ సందర్భంగా దేశపతి సిటీ కళాశాలతో తనకున్న అనుబం ధాన్ని, సిటీ కళాశాల బహుముఖీన వైభవాన్ని గుర్తుచేసుకున్నారు. ఇది మగ్దూం మొయినుద్దీన్‌ నడయాడిన కళాశాలగా, ఆయన జ్ఞాన ప్రకాశం నెలకొన్న కళాశాలగా, వారి కవితాలహరి ఉప్పొంగిన కళాశాలగా తనకు ఎనలేని గౌరవమని అన్నారు. ముల్కీ పోరాటానికి నారు పోసి, నీరు పోసిన కళాశాలగా, తెలంగాణ ఉద్యమానికి బీజావాపనం చేసిన కళాశాల అని అభివర్ణించారు. సిద్ధిపేట మాజీ శాసన సభ్యులు ఈ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ కళాశాల స్ఫూర్తితో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారని, ఒక శత వసంతాల చరిత్ర కలిగిన కళాశాల అని గుర్తు చేసుకున్నారు. సిటీ కళాశాల భవనమే ఒక అరుదైన నిర్మాణమని, తెలంగాణకు గర్వకారణమని, గత వంద సంవత్సరాలుగా సంపద్వంతమైన విద్యాబోధనకు ఇది ఆలవాలమని ప్రశంసించారు. ఇలాంటి ఉన్నత విద్యా సంస్థలోని తెలుగు శాఖ వృక్షవేదం పుస్తక పరిచయ  కార్యక్రమం నిర్వహించటం అభినందనీయమని అన్నారు. విద్యార్థులను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా ఇలాంటి కార్యక్రమాలద్వారా వారిలో జ్ఞాన విస్తృతిని కలుగజేయాలని ఆయన సూచించారు.

మనిషి మనుగడకు జీవవైవిధ్యం అత్యవసరం: డా.జి.యాదగిరి

మానవ మనుగడకు జీవ వైవిధ్యం అత్యంతావశ్యకమని, ప్రపంచ మానవాళి నిర్లక్ష్యం వలన పర్యావరణం దెబ్బతిని ప్రకృతి కన్నెర్ర చేస్తున్న విషయాన్ని ఇప్పుడి ప్పుడే మనిషి గ్రహిస్తున్నాడని కళాశాల విద్యాశాఖ జె.డి. డా. జి. యాదగిరి అన్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్‌ ఛాలెంజ్‌ ఇండియా లాంటి అవగాహనా కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడ తాయని, తద్వారా భవిష్యత్తరాలకు పచ్చని పుడమిని అందించిన వారమవుతామని అన్నారు. కళా శాలలకు అధికారులు, అతిథులు విచ్చేసినప్పుడు, వివిధ కార్యక్ర మాల ప్రారంభంలో కూడా మొక్కలు నాటడం, వాటి సంరక్షణ బాధ్యతను విద్యార్థులకు అప్ప చెప్పటం ఒక సంప్రదాయంగా పాటిస్తున్నామని చెప్పారు.

ప్రాచీన సాహిత్యం పర్యావరణ హితబోధిని : నారాయణ శర్మ

ప్రకృతిని గురించి, ప్రకృతితో మానవ సహజీవనం గురించి ప్రాచీన సాహిత్యంలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు విస్తృతంగా చెప్పాయి. ‘వృక్షవేదం’ పుస్తకం వెలువరించాలనుకున్నప్పుడు ప్రాచీన సాహిత్యాన్ని పరిశీలిస్తే, ఒక్క కాళిదాసు ఋతు సంహారంలోనే పర్యావరణ స్ఫృహను కలిగించే శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. అసలు ప్రకృతి ప్రస్తావన ఒక వాక్యంలోనైనా చేయని రచనలేవీ మన ప్రాచీన సాహిత్యంలో లేవు. అయితే ఒకే కవి శ్లోకాలు కాకుండా ఎక్కువ మంది కవుల రచనలలోని శ్లోకాలను ఒక కాలక్రమానుసారంగా ఎంపిక చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని దేశపతి ఒక మంచి కాన్సెప్టును చెప్పారు. దానిని అనుసరిస్తూ చెట్లను ఎందుకు గౌరవించాలి, ఎలా సంరక్షించుకోవాలో చెప్పిన ఉత్తమమైన శ్లోకాలను ఎంపిక చేసి వాటిని తెలుగు, హిందీ, ఇంగ్లీషులోకి అనువాదం చేయటం జరిగింది. అలాగే మనకు ప్రాచీన భాషలలో ప్రకృత సంబంధమైన భాష ప్రాకృత భాష. మన తెలంగాణ ప్రాంతానికి చెందిన హాలుడు రచించిన ‘గాథా సప్తశతి’ నుండి కూడా శ్లోకాలను ఎంపిక చేశాము. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో ఈ విధంగా తనను భాగస్వామిని చేసినందుకు ఎంపి సంతోష్‌ కుమార్‌కి, దేశపతి శ్రీనివాస్‌కి ధన్యవాదాలు తెలియజేశారు.

సుందర్‌ లాల్‌ బహుగుణ, వనజీవి రామయ్య స్ఫూర్తితో సాగుదాం: రాజేందర్‌ సింగ్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ 20 సంవత్సరాల క్రితమే  సిద్ధిపేటలో ప్రారంభించిన హరిత హారం కార్యక్రమం గురించి ఏంపి సంతోష్‌ కుమార్‌ ప్రస్తావించారు. తాను సిద్ధిపేట కళాశాలలో పనిచేస్తున్నపుడు ఆ కార్యక్రమంలో పాలుపంచుకున్నానని గుర్తుచేసుకున్నారు. వృక్షవేదం పుస్తకం అన్ని కళాశాలల లైబ్రరీలలో అందుబాటులో ఉంటే బాగుంటుందని ఆర్జేడి ఆకాంక్షను వ్యక్తం చేయగా, సంతోష్‌ కుమార్‌ సానుకూలంగా స్పందిస్తూ అన్ని కళాశాలలకు ఎన్ని పుస్తకాలు అవసరమవుతాయో తెలియజేస్తే పంపించే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

వనాల పునరుద్ధరణకు ‘వృక్షవేదం’ స్ఫూర్తి : సుజాత

ప్రాచీన సాహిత్యంలో ప్రస్తావించిన ఆశ్రమాలు పర్యావరణ పరిరక్షణకు ఎంతో దోహదం చేశాయని, ఆనాడు విద్యాలయాలకు ఈ ఆశ్రమాలే ఆలవాలంగా నిలిచాయని తెలుగు శాఖ అధ్యక్షులు అవధానం సుజాత గుర్తు చేశారు. ఇప్పుడు  హరిత హారం, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాల ద్వారా మళ్ళీ ఆశ్రమాలు పునరుద్ధరణ జరగాలని ఆకాంక్షించారు.

హరితహారం స్ఫూర్తితో రాశివనం : శంకర్‌

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కామారెడ్డి తెలుగు సహాయ ఆచార్యులు డా.వి.శంకర్‌ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మానస పుత్రిక ‘హరిత హారం’ స్పూర్తితో తమ కళాశాల ఆవరణలో 12 ఎకరాలలో అనేక రకాల మొక్కలు, చెట్లతో రాశివనం పేరుతో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. ఇప్పుడు సంతోష్‌ కుమార్‌ పిలుపును అనుసరించి తమ కళాశాల విద్యార్థులను గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగస్వామ్యులను చేస్తామని, ఈ చైతన్యాన్ని కొనసాగించ టానికి ‘వృక్షవేదం’ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు.

‘వృక్షవేదం’ పుస్తక పరిచయ సభ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన కవితా రచన పోటీకి విద్యార్థుల నుండి అనూహ్య స్పందన లభించింది. ఈ కవితలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేయటానికి న్యాయనిర్ణేతలుగా తెలంగాణ విశ్వవిద్యాలయ తెలుగు శాఖ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.వి.త్రివేణి,

ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ సహాయ ఆచార్యులు డా.ఎస్‌. రఘు వ్యవహరించారు. ఈ పోటీలలో శ్రీనిధి (ప్రభుత్వ సిటీ కళాశాల, హైదరాబాద్‌), శ్యామల (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల), దాసరి హైమావతి (ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కరీంనగర్‌) ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందగా, రవిశంకర్‌, అంజలి, స్వాతి ప్రోత్సాహక బహుమతులు పొందారు. ఈ కార్యక్రమం తమకు ఎంతో స్పూర్తిదాయకంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు.