దేశానికే ఆదర్శం వరంగల్‌ కోర్టుల భవన సముదాయం: సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించి, ఆధునికంగా తీర్చిదిద్దితే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని, ఈ ఆధునిక వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ముందువరసలో ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అన్నారు. వరంగల్‌లో రూ. 10 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన కొత్త కోర్టు భవనాల సముదాయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మతో కలిసి ప్రారంభించారు. అనంతరం కోర్టు ఆవరణలో న్యాయవాదులను ఉద్ధేశించి ప్రసంగించారు.

కోర్టుల్లో మౌలిక వసతుల కల్పనకు కేంధ్రప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రాలు నిధులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కొన్ని రాష్ట్రాలలో వారి వాటాను సరిగా ఇవ్వడంలేదన్నారు. తెలంగాణ మాత్రం రాష్ట్ర నిధులతోనే కోర్టు భవనాలను నిర్మించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. ఇది తెలంగాణ గొప్పతనమన్నారు. వరంగల్‌ కోర్టు భవనాల సముదాయ నిర్మాణం నా కలలకు ప్రతిరూపంగా జరిగింది. ఇక్కడి ఏర్పాట్లను పుస్తకం, వీడియోలుగా రూపొందిస్తే మిగతా రాష్ట్రాల్లోని న్యాయస్థానాలకు పంపించి దీన్ని నమూనాగా తీసుకోవాలని చెబుతానని అన్నారు. ఈ భవన సముదాయం దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తుందని జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ప్రశంసించారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ‘ఇండియన్‌ జ్యుడీషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌’ ను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి, న్యాయ మంత్రిత్వశాఖకు లేఖ రాయడం జరిగిందన్నారు. కేంద్రం నుంచి ఇంతవరకు స్పందన లేదన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి అన్ని కోర్టుల్లోను వరంగల్‌ కోర్టు తరహాలో వసతులు ఏర్పాటు చేస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. వరంగల్‌ కోర్టు భవనాల నిర్మాణాల కోసం కృషిచేసిన జస్టిస్‌ నవీన్‌రావును అభినందించారు.

హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ మాట్లాడుతు, రాష్ట్రంలో వరంగల్‌ కోర్టుల తరహాలోనే ఇతర కోర్టుల్లో కూడా మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అన్ని వసతులు ఉన్న కోర్టుల్లో విచారణ ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్‌ ఉజ్వల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావు, వరంగల్‌ కోర్టుల ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి నందికొండ నర్సింగరావు, వరంగల్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేపీ ఈశ్వరనాథ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి, న్యాయవాదులు పాల్గొన్నారు.