రైతాంగానికి వరదాయిని ‘వార్ధా’ బ్యారేజీ

By: కొండపల్లి వేణుగోపాల రావు

గోదావరి బేసిన్లో తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బ్యారేజి కట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటీవల వార్తా పత్రికలలో కొందరు ప్రతిపక్షాల నాయకులు తప్పు పట్టడం విస్మయం కలిగించింది. ఇది తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మాణానికి ఉన్న అననుకూల పరిస్థితులపై అవగాహన లేకుండా చేసిన వ్యాఖ్యానాలుగా భావించాలి.

ప్రత్యామ్నాయ ఆలోచన పాతదే:

ప్రభుత్వం తమ్మిడిహట్టి బ్యారేజి స్థలాన్ని మార్చాలన్న ఆలోచన చేసిన మాట వాస్తవమే. అయితే ఈ ఆలోచన ఇప్పటిది కాదు. 2016లోనే ఈ మథనం మొదలయ్యింది. 19.03.2016న హైదరాబాద్‌లో జరిగిన బి.ఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు అంతర్రాష్ట్ర సమన్వయ కమిటి మొదటి మీటింగ్‌ లోనే ఆనాటి ఉమ్మడి ఆదిలాబాద్‌ ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్‌ ఈ ప్రతిపాదనను చర్చించారు. మహారాష్ట్రా అధికారులు కూడా తమకు ప్రాజెక్టు వివరాలు పంపితే పరిశీలిస్తామని అన్నారు. ఈ చర్చ అంతా సమావేశపు మినిట్స్‌లో పొందు పరచడం జరిగింది. వార్ధాపై బ్యారేజి నిర్మాణానికి అనుకూలమా కాదా? నీటి లభ్యత ఎంత ఉంది? అన్న అంశాలను అధ్యయనం చేసి ప్రాథమిక నివేదికను సమర్పించమని కేంద్ర ప్రభుత్వ సంస్థ వాప్కోస్‌ వారికి  ప్రభుత్వం పురమాయించింది. ప్రాథమిక నివేదికను ఆదిలాబాద్‌ చీఫ్‌ ఇంజనీర్‌ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆనాటి నుంచి వార్ధాపై  బ్యారేజి నిర్మాణానికి సంబంధిచి మేధో మధనం జరుగుతూనే ఉన్నది. ప్రభుత్వం ఇటీవలే వార్ధాపై బ్యారేజి నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడం, 20-11-2021 న జిఒ 410 జారీ చేసి వార్ధా నదిపై బ్యారేజి నిర్మాణానికి సవివరమైన ప్రాజెక్టు నివేదిక (DPR) తయారు చేయమని వాప్కోస్‌ను ఆదేశించడం స్వాగతించాల్సిన విషయం.

ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు రీఇంజనీరింగ్‌:

ఇప్పుడున్న తమ్మిడిహట్టి స్థలం వద్ద  బ్యారేజి నిర్మాణానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా మొదట్లో స్థలాన్ని ఎంపిక చెయ్యడంలోనే పొరపాట్లు చేసింది. ఆ స్థలమే బ్యారేజి నిర్మాణానికి గుదిబండగా మారింది. బ్యారేజి కంట్రోల్‌ లెవెల్స్‌ అనగా పూర్తి స్థాయి నీటిమట్టం (FRL), బ్యారేజి గేటు కనిష్ట మట్టం (Sill Level), ముంపు తదితర సాంకేతిక అంశాలను నిర్ధారించేటప్పుడు మహారాష్ట్రా ప్రభుత్వాన్ని సంప్రదించలేదు. వారి అంగీకారాన్ని పొందకుండా ఏకపక్షంగా ముందుకు పోయింది. పనులు ప్రారంభించింది. బ్యారేజిని స్థలాన్ని తీసుకపోయి చాప్రాల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అతి సమీప ప్రాంతంలో పెట్టారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని 2008లోనే జఔజ ప్రభుత్వానికి లేఖ రాసింది. మహా రాష్ట్రా తమ భూభాగంలో ముంపును అనుమతించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పింది. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యతపై జఔజ సూచనలను, మహారాష్ట్రా అభ్యంతరాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్‌ చేసి తమ్మిడి హట్టి వద్ద తరలించవలసిన 20 టిఎంసిల నీటిని ఆదిలాబాద్‌ తూర్పు జిల్లా అవసరాలకు వినియోగించుకొని మిగతా జిల్లాల అవసరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన సంగతి తెలిసిందే. రీ ఇంజనీరింగ్‌ తర్వాత తమ్మిడిహట్టి బ్యారేజి నుంచి 20 టిఎంసిల నీటిని వినియోగించుకొని ఆదిలాబాద్‌ తూర్పు జిల్లాలో (ఇప్పుడు ఆసిఫాబాద్‌ మరియు మంచిర్యాల జిల్లాలు) 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది డా. బి.ఆర్‌ అంబేద్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు లక్ష్యం.

ఉమ్మడి ప్రభుత్వం ప్రతిపాదించిన తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత తగినంత లేదని చెప్పిన జఔజ తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణం అయిన మేడిగడ్డ వద్ద నీటి లభ్యత

ఉన్నదని తేల్చింది. 2017 అక్టోబర్‌లో  కేంద్ర జల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టుకు నీటి లభ్యతపై హైడ్రాలజి అనుమతిని మంజూరు చేసింది. మేడిగడ్డవద్ద 284 టిఎంసిల నీటి లభ్యత ఉన్నదని, ఈ నీటిని వినియోగించు కోవడానికి తెలంగాణా ప్రభుత్వానికి అనుమతిని ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజి అనుమతి ఇచ్చేటప్పడు ప్రాణహిత ప్రాజెక్టులో వినియోగించుకోవాల్సిన 20 టిఎంసిలను కూడా  లెక్కలోకి తీసుకున్నారు.

మహారాష్ట్రాతో ఒప్పందం చేసుకోకుండా పదేండ్ల కాలయాపన చేసి బ్యారేజి నిర్మాణాన్ని వాయిదా వేసింది ఉమ్మడి ప్రభుత్వం. తెలంగాణా ఏర్పాటు తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగాలా? మహారాష్ట్రతో అంగీకారం లేకుండా బ్యారేజి నిర్మాణం సాధ్యమా? అంతర్రాష్ట్ర ఒప్పందం లేకుండా కేంద్రం నుంచి అనుమతులు రాబట్టడం సాధ్యమా? బ్యారేజి నిర్మాణం కాకుండా కాలువలలోకి నీరు పారుతుందా?

మహారాష్ట్రాతో చరిత్రాత్మక ఒప్పందం:

తెలంగాణా ప్రభుత్వం మహారాష్ట్రా వ్యక్తం చేసిన అభ్యంతరాలను పట్టించుకున్నది. వారు కోరుతున్నట్టు బ్యారేజి FRLని 152 మీ.ల నుంచి 148 మీ.లకు తగ్గించి బ్యారేజి నిర్మాణానికి అంగీకరించింది. మహారాష్ట్రాలో ముంపుని గణనీయంగా తగ్గించింది. పొరుగు రాష్ట్రాలతో  ఘర్షణ వైఖరిని విడనాడి, ఇచ్చి పుచ్చుకునే వైఖరితో మహారాష్ట్రాతో చరిత్రాత్మక  ఒప్పందం కుదుర్చుకున్నది. దశాబ్దాలుగా అంతర్రాష్ట్ర వివాదాల్లో మగ్గుతున్న పెన్‌గంగ, ప్రాణహిత బ్యారేజీల నిర్మాణానికి, అదనంగా గోదావరిపై మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణానికి మహారాష్ట్రా అంగీకారాన్ని పొందింది. వీటిల్లో పెన్‌గంగ, మేడిగడ్డ బ్యారేజిల నిర్మాణ పనులు పూర్తి అయినాయి. ఇప్పుడు ప్రాణహిత బ్యారేజిపై కూడా స్పష్టత వచ్చింది. తమ్మిడిహట్టి వద్ద నుంచి ఆదిలాబాద్‌ జిల్లా అవసరాలకు తీసుకునే నీరు 20 టిఎంసిలు. బ్యారేజిని 148 మీటర్ల FRLతో నిర్మించడానికి మహారాష్ట్రా అంగీకరించింది.

అయితే బ్యారేజి స్థలం చాప్రాల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అతి సమీప ప్రాంతంలో ఉన్నది కాబట్టి జాతీయ వన్య ప్రాణి బోర్డు నుంచి, పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు రాకుండా బ్యారేజి నిర్మాణానికి పూనుకోలేము.

వార్ధాపై బ్యారేజి ఎందుకు?

ఇక తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి aశ్రీఱస్త్రఅఎవఅ్‌ నదీ ప్రవాహానికి  40 డిగ్రీల కోణంలో(skew) రావడం వలన బ్యారేజి పొడవు పెరిగింది. మట్టికట్టలు, కాంక్రీట్‌ బ్యారేజి కలుపుకొని మొత్తం పొడవు 6.45 కి మీ. ఈ డిజైన్‌ తో 2007-08 రేట్లతో అంచనా వ్యయం 1700 కోట్లు. ఇప్పటి రేట్లతో సుమారు 2500 కోట్లు అవుతుంది. సాధారణంగా నీటి ప్రవాహం బ్యారేజీకి లంబ కోణంలో (90 డిగ్రీలు) ఉండాలి. Skew బ్యారేజి డిజైన్లు తయారు చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇకపోతే అక్కడి నుండి తీసుకోబోయే నీరు 20 టిఎంసిలు మాత్రమే. బ్యారేజి FRLను 148 మీటర్లకు తగ్గించిన తర్వాత నీటి నిల్వ 1.50 టిఎంసిలు మాత్రమే. వార్ధా నదిలో నికర నీటి లభ్యత (net water availability) చూసినప్పుడు 45 టిఎంసిలు ఉన్నట్టు వాప్కోస్‌ ప్రాథమికంగా అంచనా వేసింది. కాబట్టి ఆదిలాబాద్‌ జిల్లా అవసరాలకు 20 టిఎంసిలు వార్ధా నదిలో నుంచే పొందవచ్చు. బ్యారేజి స్థలాన్ని5 కిలోమీటర్లు వార్ధా నది ఎగువన ఆసిఫాబాద్‌ జిల్లా, కౌటాలా మండలంలోని వీర్దండి గ్రామ సమీపానికి మారిస్తే బ్యారేజి పొడవు 632 మీటర్లకు తగ్గిపోతుంది. బ్యారేజి FRL 160 మీటర్ల వద్ద నీటి నిలవ 4 టిఎంసిలు ఉంటుంది. బ్యారేజి అంచనా వ్యయం 1000 కోట్ల లోపే ఉంటుంది. వార్ధా నదికి రెండు వైపులా కర కట్టలను నిర్మిస్తే ముంపు కూడా నది గర్భంలోనే ఉండేటట్టు చేయవచ్చు. మేడిగడ్డ,  అన్నారం, సుందిళ్ళ బ్యారేజిలను ఈ పద్ధతినే నిర్మించారు.

పై పట్టికను పరిశీలిస్తే తమ్మిడిహెట్టి వద్ద 6.45 కి మీ పొడవైన బ్యారేజి నిర్మిస్తే 107 గేట్లు పెట్టాల్సి వచ్చేది. నీటి నిలువ కేవలం 1.50 టిఎంసిలు మాత్రమే. తమ్మిడిహట్టి బ్యారేజీకి ఎడమ వైపున ఆనుకొనే చాప్రాల్‌ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం ఉన్నది. ఈ కారణంగా పర్యావరణ అను మతి పొందడం అతి దుర్లభం. 1.5 టిఎంసిల నిలువ కోసం ఇంత పొడవైన బ్యారేజీని 2500 కోట్లతో నిర్మించాల నడం భావ్యమా? సుమారు 1500 కోట్లు ఆదా అవుతున్న వార్ధా బ్యారేజి ప్రతిపాదనను కూడా విమర్శించడం సమంజసమా?

వార్ధా బ్యారేజీలో నిల్వ ఉండేది 4 టిఎంసిలు మాత్రమే. ఈ నిల్వ కారణంగా మేడిగడ్డ బ్యారేజీకి జరిగే నష్టం శూన్యం. పైగా వైన్‌ గంగ నదికి ఏ అడ్డంకి లేదు కనుక ఆ నీరు నేరుగా మేడిగడ్డకు చేరు కుంటాయి. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజి నిర్మించినా అక్కడ నిల్వ ఉండేది 1.50 టిఎంసిలు మాత్రమే. కాబట్టి బ్యారేజి ఎక్కడ నిర్మించినా మేడిగడ్డ వద్ద నీటి లభ్యతకు ఎలాంటి ముప్పు లేదు. ఈ విష యంలో విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవ్వాళ్ళ ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల సాగు నీటి అవసరాలకు భంగం వాటిల్లకుండా తమ్మిడి హట్టి బ్యారేజి ఖర్చు తగ్గించాలని, ముంపు తగ్గించా లని, కేంద్ర అనుమతులకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అడ్డంకి కాకూడదని వార్ధాపై బ్యారేజి నిర్మాణాన్ని తలపెడితే విమర్శలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం, రాజకీయాలు చేయడం తగదు. అన్ని సానుకూలతలు ఉన్న వార్ధా బ్యారేజి నిర్మాణాన్ని స్వాగతించాలి. ఆసిఫాబాద్‌, మంచి ర్యాల జిల్లాల రైతాంగానికి మేలు చేకూర్చే ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించవద్దని ఒక విశ్రాంత ఇంజనీరుగా కోరుకుంటున్నాను.