|

ప్రజా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నం

దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా ఎన్నదగిన మహోద్యమాన్ని సాగించి, సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం నేటితో ఐదు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకుని, ఆరో వసంతంలోకి అడుగు పెడుతున్నది. తెలంగాణ నేడు ఒక సఫల రాష్ట్రంగా పురోగమిస్తున్నది. మొక్కవోని దీక్షతో, అభ్యుదయ పథంలో ఉజ్వల ప్రస్థానాన్ని సాగిస్తున్నది. గడిచిన కాలాన్ని ఒకసారి పునరావలోకనం చేసుకుంటే, ఈ ఐదేళ్ళలో మనం ఎన్నో అవరోధాలను అధిగమించగలిగాం. మరెన్నో అసామాన్య విజయాలను సాధించగలిగాం. ఒక రాష్ట్ర చరిత్రలో ఐదేళ్ళు చాలా చిన్న కాలం. అయితే మనం సాధించిన ఫలితాల రీత్యా ఈ ఐదేళ్ళు ఎంతో విలువైన కాలం.

అనేక అపనమ్మకాలు, అనుమానాల నడుమ ఏర్పడ్డ రాష్ట్రం, అనతి కాలంలోనే వాటన్నింటినీ పటాపంచలు చేసింది. ఎక్కడా తొట్రుపాటు, తడబాటు లేకుండా పాలనలో పరిణతిని ప్రదర్శించింది, ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు లేకుండా శాంతిని, సామరస్యాన్ని కాపాడుకుంటూ ప్రగతి పథంలో దూసుకు పోతున్నది.

తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదని, తెలంగాణ వస్తే గాడాంధకారం అలుముకుంటుందని, తెలంగాణ రాష్ట్రంగా మనుగడ సాగించలేదని సమైక్య పాలకులు జోస్యాలు చెప్పిన్రు, జోకులు వేసిన్రు. కానీ, నవ్విన నాపచేనే పండిందన్నట్లుగా, తెలంగాణ ప్రగతిపథంలో పరుగులు తీస్తుంటే అపహాస్యం చేసినవాళ్లు అవాక్కవుతున్నారు. ఇది తెలంగాణ ప్రజలు, ప్రభుత్వం ఏకతాటిపై నిలిచి, పట్టుదలతో ప్రయత్నించి సాధించిన సమష్టి విజయం.

రాష్ట్ర సాధన కోసం రాజీలేని పోరాటం చేసిన వాళ్లే, నూతన రాష్ట్రాన్ని ప్రగతిదారుల్లో నడిపిస్తారని తెలంగాణ ప్రజలు మాపై పెట్టుకున్న విశ్వాసాన్ని మేము నూటికి నూరు శాతం నిలబెట్టుకున్నాం. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ సమ ప్రాధాన్యం ఇస్తూ, పునర్నిర్మాణానికి నడుంబిగించాం. ప్రభుత్వం పనితీరును మెచ్చి ప్రజలు తమ హృదయంలో మాకెంతటి స్థానం ఇచ్చారన్న దానికి గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అద్దం పట్టినయి.

పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంటు ఎన్నికల దాకా ప్రతీ ఎన్నికలో విజయాన్ని కట్టబెడుతూ ప్రజలు మాకు తిరుగులేని బలాన్ని అందిస్తున్నారు. ప్రజల దీవెనలే కొండంత అండగా భావిస్తూ తెలంగాణ సర్వతో ముఖాభివృద్ధికి పునరంకితమవుతున్నాము.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో అవలంబించిన సమర్ధవంతమైన ఆర్థిక విధానాల వల్ల, రాజకీయ అవినీతికి అవకాశం లేకుండా చేయడం వల్ల, ఆర్థిక క్రమశిక్షణను పాటించడం వల్ల తెలంగాణ నేడు ఒక బలమైన ఆర్థిక శక్తిగా, పురోగామి రాష్ట్రంగా నిలదొక్కుకున్నది. మన రాష్ట్రం గడిచిన ఐదేళ్లలో సగటున 16.5 శాతం ఆదాయ వృద్ధిరేటును సాధించింది. ఈ ధోరణి ఇదే విధంగా కొనసాగి భవిష్యత్తులో రాష్ట్ర ఆదాయం మరిన్ని రెట్లు పెరిగే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. రాష్ట అభివృద్ధిని విస్తృతపరచడానికి ఇది సానుకూల పరిణామం.

అర్ధ శతాబ్దంగా తెలంగాణ ఎదుర్కొంటున్న అనేక జఠిల సమస్యలకు ఈ ఐదేళ్ళలో శాశ్వత పరిష్కారాలను చూపగలిగాం. ఒకటొకటిగా ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే మునుముందు మనముందు నిలిచిన పెను సమస్య కరెంటు సంక్షోభం. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని నమ్మిన వాళ్ళం. అసాధ్యం అనుకున్న రాష్ట్రాన్నే సాధించుకున్న వాళ్ళం. చిత్తశుద్ధితో విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కదిలినం. అతి తక్కువ కాలంలో కరెంటు సమస్యను సంపూర్ణంగా అధిగమించినం. విద్యుత్‌ వ్యవస్థను అధ్వాన్న స్థితి నుంచి అద్భుతం అనే స్థాయికి తీసుకు రాగలిగినం. తెలంగాణలో ఒకనాడు కరెంటు ఉంటే వార్త, నేడు పోతే వార్త. తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుందో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క విషయం చాలు. యావత్‌ దేశంలో వ్యవసాయంతో సహా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతర నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని సంతోషంగా ప్రకటిస్తున్నాను. విద్యుత్‌ సరఫరాలో వచ్చిన గుణాత్మకమైన మార్పు ఇటు వ్యవసాయరంగానికి అటు పారిశ్రామికరంగానికి నూతనోత్తేజాన్ని కలిగించింది.

కరెంటు తర్వాత మనం తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకున్నం. మంచినీటి సమస్య సమగ్ర పరిష్కారం కోసం చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం సఫలం అవుతుండడం ప్రజల కళ్ల ముందే దృశ్యమానంగా ఉంది. ఇంత భయంకరమైన వేసవి ఎండల్లోనూ ప్రజలు తాగునీటి కోసం గోసపడడం లేదు. నీళ్ళ కోసం మైళ్ళ దూరం నడిచి వెళ్లే బాధలు పడలేదు. గతంలో సర్వత్రా కనిపించే బిందెల ప్రదర్శనలు బంద్‌ అయ్యాయి. మిషన్‌ భగీరథ ప్రజలను ఆ బాధల నుండి విముక్తి చేసింది. మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావచ్చినయి. ఏనుగెళ్లింది తోక చిక్కింది అన్నట్లు కొంచెం పని మాత్రమే మిగిలింది. గ్రామీణ ప్రాంతాల్లో మిషన్‌ భగీరథ పనులు 97 శాతం పూర్తయినయి. జూలై చివరి నాటికి వందకు వంద శాతం పూర్తవుతయి. పట్టణ ప్రాంతాల్లోనూ యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయబోతున్నాం.

నిరుపేదలకు అండగా
సమాజం చివరి అంచున, నిస్సహాయంగా నిలిచిపోయిన నిరుపేద వర్గాలకు నిజమైన చేయూత అందించడమే ప్రథమ ప్రాధాన్యతగా నిర్ణయించుకున్నాం. అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రారంభించుకున్నాం. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, నేత గీత కార్మికులు, వృద్ధ కళాకారులు, బోదకాలు బాధితులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఒకరేమిటి! ఎవరైతే పేదరికంతో విలవిలలాడుతున్నారో వారందరినీ గుర్తించి, కనీస జీవన భద్రత కలిగించే విధంగా ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తూ ఆదుకుంటున్నది. ఎక్కడా మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా పేదలకు అందుతున్న ఆసరా పింఛన్ల పథకం నాకు అత్యంత, సంతృప్తినీ, సంతోషాన్ని కలిగిస్తున్న పథకం. తెలంగాణ ఏర్పడిన వెంటనే 200 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు పెంచి అందించిన పెన్షన్‌ ను ఇప్పుడు 2,016కు పెంచుతున్నాం. వికలాంగుల పెన్షన్‌ ను 1500 రూపాయల నుంచి 3,016 రూపాయలకు పెంచుతున్నాం. వృద్దాప్య పెన్షన్‌ వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి, కొత్తగా మరో ఆరేడు లక్షల మందికి పెన్షన్‌ అందించబోతున్నాం. పెంచిన పెన్షన్లను జూలై 1 నుంచి లబ్ధిదారులకు అందిస్తామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. పేదల ప్రజలకు లభిస్తున్న భరోసా, భద్రత ప్రభుత్వానికి అత్యంత సంతృప్తి కలిగిస్తున్నది.

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు అచ్చంగా నా మానస పుత్రికలు. ప్రభుత్వం అందించే ఒక లక్షా నూట పదహార్ల ఆర్థిక సహాయంతో అడ పిల్లల పెండ్లిండ్లు చేసిన పేద కుటుంబాల ఆశీస్సులే మా ప్రభుత్వానికి పెట్టని కోటలైనాయి. బలహీన వర్గాల వారికి ఆత్మగౌరవంతో కూడిన నివాసం అందించాలనే పట్టుదలతో రెండు బెడ్రూంల ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. బడులలో, హాస్టళ్ళలో విద్యార్థులకు పెడుతున్న సన్నబియ్యం అన్నం పరిపాలనలో మానవీయ కోణానికి నిదర్శనంగా నిలుస్తున్నది.

గర్భిణులకు పౌష్టిక ఆహారం అందించే ఆరోగ్యలక్ష్మి, ఆసుపత్రి ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన కెసిఆర్‌ కిట్స్‌ పథకాలు మహిళా సంక్షేమానికి నూతన నిర్వచనంగా నిలిచినాయి.

గ్రామీణ జీవితంలో మెరుగైన మార్పులు రావాలని ఆశించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా బలమైన అడుగులు వేయగలిగాం. శిథిలమైన చెరువులను పునర్జీవింప చేసేందుకు ప్రారంభించిన మిషన్‌ కాకతీయ సత్ఫలితాలను ఇవ్వడమే కాకుండా ఆదర్శవంతమైన అభివృద్ధి నమూనాకు నిదర్శనంగా అంతర్జాతీయంగా ప్రశంసలను పొందింది. చరిత్రలో ఎన్నడూ ఎరుగని రీతిలో వ్యవసాయ అనుబంధ వృత్తులకు ప్రోత్సాహాన్ని కలిగించే పథకాలను మనం అమలు చేసుకుంటున్నాం. పెద్ద ఎత్తున జరుగుతున్న గొర్రెల పంపిణీ గొల్ల కుర్మల దగ్గర జీవ సంపదను పెంచింది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో చేపల పెంపకానికి కావాల్సిన చేప విత్తనాన్ని ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేసింది. రాశుల కొద్దీ ఉత్పత్తవుతున్న మంచినీటి చేపలకు మార్కెట్లో మంచి డిమాండు ఏర్పడింది. దీంతో బెస్త, బోయ, ముదిరాజు తదితర మత్స్యకారులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించటంతో పాటూ వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.

చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల ఆత్మహత్యలను నివారించడంలో తెలంగాణ ప్రభుత్వం చాలా వరకు సఫలమైంది. బతుకమ్మ చీరెల తయారీని చేనేత కార్మికులకు అప్పగించి వారికి నిరంతరం పని దొరికేలా చేసింది. 50 శాతం సబ్సిడీతో రంగులు, రసాయనాలు అందించటం వంటి సంక్షేమ చర్యలతో చేనేత పవర్‌లూమ్‌ కార్మికులకు కొంత ఊరట కలిగింది. ఈ దిశగా మరింత కృషి జరగాల్సి ఉంది.

తెలంగాణ సమాజం బహుళత్వాన్ని గౌరవించే సమాజం. విభిన్న మతాల, జాతుల ప్రజలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూనే పరస్పరం ఇచ్చి పుచ్చుకొంటూ సహజీవనం సాగిస్తున్నారు. తెలంగాణలో నెలకొన్న ఈ సామరస్య సంస్కతినే మహాత్మాగాంధీ, గంగా జమునా తెహజీబ్‌గా ప్రస్తుతించారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వారసత్వ విలువను కాపాడుతూ సర్వమత సమాదరణను పాటిస్తున్నది. బతుకమ్మ, బోనాలు, రంజాన్‌, క్రిస్ట్‌మస్‌ పండుగలను రాష్ట్ర పండుగలుగా గుర్తించి అధికారికంగా జరుపుతున్నది. ఈ పండుగల సందర్భంగా పేద కుటుంబాలకు ఉచితంగా నూతన వస్త్రాలను పంపిణీ చేస్తున్నది. ఆలయాల అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఒకటవ తేదీనే వేతనాలు అందే విధంగా సంస్కరణ తెచ్చింది. ధూప, దీప నైవేద్య పథకం కింద ఆలయాలలో పూజాదికాలు నిర్వహించేందుకు ఇచ్చే మొత్తాన్ని పెంచింది. మసీదులలో ఇమాంలకు, మౌజాన్లకు 5,000 రూపాయల భృతిని అందిస్తున్నది.

ప్రతీ సామాజిక వర్గము తమ అస్తిత్వ ఆకాంక్షలను వ్యక్తం చేసున్న సందర్భమిది. ఆయా కులాల విశిష్ట సంస్కృతికి ప్రతీకలుగా, సామాజిక వికాసానికి వేదికలుగా ఆత్మ గౌరవ భవనాలను రాజధాని నగరమైన హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఇందుకోసం స్థలాలను కేటాయించింది. త్వరలోనే భవనాల నిర్మాణం ప్రారంభమవుతుంది.

విద్యా, వైద్య రంగాలలో ప్రమాణాలను మెరుగు పరచడంలో తెలంగాణ ప్రభుత్వం సఫలమైంది. అట్టడుగు వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అనే లక్ష్యంతో నూతనంగా 608 రెసిడెన్షియల్‌ స్కూళ్ళను ఏర్పాటు చేసింది. ఈ ఆవాస పాఠశాలల్లో శిక్షణ పొందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో మన రాష్ట్ర కీర్తి పతాకాన్ని ఎగురవేస్తున్నారు.

ప్రజా వైద్యం పై విశ్వాసం పెరిగే విధంగా ప్రభుత్వం ఆసుపత్రుల పనితీరును మెరుగు పరిచింది. ముఖ్యంగా జిల్లా నుండి నియోజకవర్గ స్థాయి వరకు దవాఖానాలలో పడకల సంఖ్యను పెంచింది. వ్యాధి నిర్ధారణ, అత్యవసర చికిత్సలకు కావాల్సిన వసతులను పరికరాలను సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డయాలసిస్‌ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది.

అంధత్వ నివారణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కంటి వెలుగు పేద ప్రజలకు పెద్ద వరంగా మారింది. దృష్టి లోపాల నివారణ కోసం ఇంత పెద్ద ఎత్తున కంటి పరీక్షలు వైద్యం, మందులు, కళ్ళద్దాలు ఉచితంగా అందించే పథకం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదు. త్వరలో దంత, చెవి, ముక్కు, గొంతు వ్యాధుల నివారణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం ప్రారంభిస్తుంది. సమగ్ర వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి, తెలంగాణ ఆరోగ్య సూచిక (హెల్త్‌ ప్రొఫైల్‌) రూపొందించేందుకు ప్రభుత్వం కషి చేస్తుంది.

తెలంగాణ అనుభవించిన ఇతర దుఃఖాలన్నీ ఒక ఎత్తయితే, ఒక్క సాగునీటి కోసం అనుభవించిన దుఃఖం ఒక్కటే ఇంకో ఎత్తు. తలాపున గోదావరి, పక్కనే కృష్ణమ్మ పారుతున్నా, మడి తడిపే నీళ్లకు నోచుకోక తెలంగాణ గొడగొడ ఏడ్చింది. రాజులు తవ్విన చెరువులు పూడుకుపోయినయి. రైతులు తవ్వుకున్న బావులు ఎండిపోయినయి. కడతామన్న ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయి నయి. పాతాళానికి జారిన నీళ్లను తోడేందుకు బోరు బావులు దిక్కయినయి. ఆ బోర్లు కూడా ఎండిపోతే, ఆత్మహత్యలే శరణ్యమయినయి. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప తమ పొలాలకు నీళ్లు మల్లవని తెలుసుకున్న జనం నిప్పుల ఉప్పెనగా మారిన్రు. తెలంగాణ సాధించిన్రు. బీళ్లకు నీళ్లు మళ్లించే గురుతర బాధ్యతను మా భుజస్కందాల మీద మోపిన్రు.

నెరవేరుతున్న కల
రైతన్నల కలలను నెరవేర్చే ఈ సవాల్‌ను స్వీకరించి, కోటికి పై చిలుకు ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు గోదావరి, కృష్ణా నదుల మీద ఏకకాలంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి పూనుకున్నాం. మొదటి దశలో పెండింగ్‌ ప్రాజెక్టులను వాయువేగంతో పూర్తి చేసి, కరువు విలయతాండవం చేసే ఒక్క మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగాం. పాలమూరులో అర్ధభాగం పచ్చని పంటలతో కళకళలాడేటట్టు చేసుకున్నం. నడి వేసవిలో కూడా నిండిన చెరువులు మత్తళ్లు దుంకే సన్నివేశాన్ని ఆవిష్కరించుకున్నం. కృష్ణా జలాల్లోని తెలంగాణ వాటాను సమగ్రంగా వినియోగించుకుని మహబూబ్‌ నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ప్రాంతాలను సస్యశ్యామలం చేసే దిశగా పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకుంటున్నం.

గోదావరి నది మీద నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ తలరాతను మార్చేయబోతున్నది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మాణమయిన అతిపెద్ద ప్రాజెక్టుగా కాళేశ్వరం చరిత్రలో నిలవబోతున్నది. రెండున్నర ఏండ్ల అతి తక్కువ సమయంలోనే ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించగలగడం ప్రభుత్వ సమర్ధతకు, సాంకేతిక ప్రతిభకు నిదర్శనం. ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన ఓ పంపుహౌజు వద్ద భారీ మోటార్లతో నిర్వహించిన వెట్‌ రన్‌ విజయవంత

మయింది. వచ్చే నెల చివరి నుంచి మేడిగడ్డ బ్యారేజి ద్వారా రోజు రెండు టిఎంసిల చొప్పున గోదావరి నీటిని ఎత్తిపోయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. వచ్చే ఏడాది నుంచి 3 టిఎంసిలను ఎత్తిపోసేందుకు వీలుగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి, కరీంనగర్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, జనగామ, మహబూబాబాద్‌, సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి, జగిత్యాల, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలలో 45 లక్షల ఎకరాల్లో రెండు పంటలు పండేందుకు చాలినంత సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరదాయనిగా అవతరించబోతున్నది. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తు దాకా నీళ్ళను ఎత్తిపోసే ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు నీటి పారుదల శాఖ సన్నద్ధంగా ఉంది. భూగర్భాన్ని తొలచి నిర్మించిన సొరంగాల గుండా ప్రవహించి వచ్చే, గోదావరి జలాలు తెలంగాణ పొలాలను తడుపుతుంటే రైతుల బతుకులు బాగుపడే రోజు దగ్గరలోనే వుందని తెలియచేస్తున్నాను.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మొత్తం, మహబూబాబాద్‌ జిల్లాలో కొంత భాగానికి పుష్కలంగా సాగునీరు లభించే విధంగా సీతారామ ఎత్తిపోతల పథకం యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం అవుతున్నది. జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్భన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లాల సాగునీటి అవసరాలు సంపూర్ణంగా తీర్చేందుకు వీలుగా దేవాదుల ప్రాజెక్టు స్థాయిని మరింత పెంచి నిర్మించుకుంటున్నం.

తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత తెలంగాణలో ఎటు చూసినా పచ్చనిపైర్లే దర్శనమిస్తాయి. తెలంగాణలో కరువు అనే మాట ఇకముందు కనిపించదు, వినిపించదు. 365 రోజులూ తెలంగాణ చెరువులు, రిజర్వాయర్లు, బ్యారేజీలు నిండు కుండలను తలపిస్తాయి. ఏటా రెండు పంటలు పండి, ధాన్యపు రాశులతో తెలంగాణ అన్నపూర్ణగా అవతరిస్తుంది. పెరిగే వ్యవసాయ ఉత్పత్తులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. నదిపొడవునా నిలిచే నీళ్లు, నిండుగా జలాశయాలు, పెరిగే భూగర్భ జలాలతో తెలంగాణ ఎకానమీ మాత్రమే కాదు, ఎకాలజీ అంటే పర్యావరణం కూడా మారిపోతుంది.

సాగునీటి సమస్యతో పాటు రైతాంగం ఎదుర్కుంటున్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. రాష్ట్రం ఏర్పడి, అధికారంలోకి వచ్చిన మొదటి దశలోనే రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేసి, ఊరటనివ్వగలిగాం. ఇప్పుడు మరోసారి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయ బోతున్నాం. ఎరువులు, విత్తనాల కోసం గతంలో మాదిరిగా రైతులు అగచాట్ల పాలు కాకుండా, తగిన జాగ్రత్తలు తీసుకుని సకాలంలో అందించగలుగుతున్నాం. 24 గంటల ఉచిత విద్యుత్తుతో రైతాంగంలో కొత్త ఆశల్ని కల్పించగలిగాం.

రైతులకు పంట కాలంలో కావల్సిన పెట్టుబడిని అందించడం కోసం ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం రైతుల హృదయాల్లో హర్షం నింపింది. ఎకరానికి నాలుగువేల చొప్పున రెండు పంటలకు ఏడాదికి 8 వేలు అందించి, పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన అగత్యాన్ని నివారించగలిగాం. ఈ పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, కేంద్ర ప్రభుత్వానికి కూడా రైతుబంధు ఆదర్శమైంది. కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకానికి మన రైతుబంధు పథకమే ప్రేరణ. ఐక్యరాజ్య సమితి సైతం రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని గొప్ప పథకాల్లో ఒకటిగా పేర్కొని, ప్రశంసించింది. రైతుబంధు పథకం ద్వారా అందించే మొత్తాన్ని ఎకరానికి సంవత్సరానికి 8 వేల నుంచి 10 వేలకు పెంచి, ఈ సంవత్సరం నుంచే అందిస్తున్నామనే శుభవార్తను రైతు లోకానికి తెలియచేస్తున్నాను.

ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే, అతని కుటుంబం అగాధం అయిపోవద్దని ఎంతో ఆలోచించి ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. బీమా ప్రీమియంను పూర్తిగా ప్రభుత్వమే చెల్లించి, మరణించిన రైతు కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా మొత్తాన్ని సత్వరమే అందించు కోగలుగుతున్నాం. రైతాంగంలో నిస్పృహను తొలగించి, కొత్త ఉత్సాహాన్ని కలిగించడంలో ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించింది. ప్రభుత్వ పథకాలు రైతులు బలవన్మరణాలకు పాల్పడకుండా బతుకుమీద ఆశనూ, భవిష్యత్తుపై నమ్మకాన్నీ కలిగిస్తున్నాయి.

క్రాప్‌ కాలనీలు…
ఇప్పటి దాకా నేను వివరించిన వ్యవసాయ కేంద్రిత పథకాల వల్ల పంటలు బాగా పండడంతోపాటు, పెట్టుబడి సమస్య కూడా తీర్చగలిగాం. అయితే, ఈ చర్యల ఫలితంగా భవిష్యత్తులో ఇబ్బడి ముబ్బడిగా పంటలు పండుతాయి. పండిన పంట మంచిధర లభించేందుకు అవసరమైన సమగ్ర విధాన రూపకల్పనకు ప్రభుత్వం పూనుకున్నది. రైతులందరూ ఒకే పంట వేయడం వల్ల, డిమాండ్‌ తగ్గి తగిన ధర రాకుండా పోయే ప్రమాదాన్ని నివారించేందుకు క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నేలల రకాలను, వాతావరణ పరిస్థితులకు అనువైన పంటలు వేయించి వాటిని నియంత్రిత పద్ధతిలో మార్కెట్‌ కు తరలించే విధంగా సంస్కరణలు తీసుకురాబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పేలా చేసి, రైతాంగానికి గిట్టుబాటు ధర లభించే విధంగా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దుక్కి దున్ని విత్తనం వేసిన దగ్గర నుంచి పండిన పంటను మంచి ధరకు అమ్ముకునే దాకా అన్ని సమయాల్లోనూ రైతాంగానికి దిశా నిర్ధేశనం చేసే విధంగా రైతు సమన్వయ సమితుల పాత్ర క్రియాశీలం చేయబోతున్నాం.

నేను స్వయంగా రైతును. మట్టిని నమ్ముకుని బతకడంలో ఉన్న మాధుర్యం నాకు తెలుసు. చేసిన కష్టం మట్టి పాలైపోతే కలిగే ఆవేదనా నాకు తెలుసు. అందుకే నేను కంటున్న కల ఒకటే రైతుల తలరాతలు మారాలె. వ్యవసాయం లాభసాటి కావాలె. రైతుల నెత్తిమీద అప్పుల భారం తొలగిపోయి, ప్రతీ రైతు దగ్గర ఎంతో కొంత నగదు నిల్వ ఉండే పరిస్థితి రావాలె. భారతదేశంలో ధనవంతులైన రైతాంగం ఎక్కడున్నారంటే, తెలంగాణలో అనే చెప్పుకునే రోజులు రావాలని నేను ప్రగాఢంగా ఆకాంక్షిస్తున్నాను. ఈ కల నెరవేరేదాకా అవిశ్రాంతంగా పరిశ్రమిస్తాను. అంకితభావంతో కృషి చేస్తాను. భగవంతుడు నాకిచ్చిని శక్తి, యుక్తులన్నింటినీ ఈ పవిత్ర లక్ష్యం కోసం ధారపోస్తానని మనవి చేస్తున్నాను.

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఎంతో విశిష్టమైనది. పచ్చదనం తరిగిపోవడం వల్ల ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న తీరును మనమందరం చూస్తూనే ఉన్నాం. ఇది ప్రకృతి వైపరీత్యం ఎంతమాత్రం కాదు. ఖచ్చితంగా మానవ తప్పిదం. ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే భూమ్మీద మనిషి మనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. జీవనం దుర్భరంగా మారిన తర్వాత ఎంత సంపద ఉన్నా, ఎన్ని సౌకర్యాలున్నా, ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా ఏ ప్రయోజనమూ ఉండదు. మన నిర్లక్ష్యాన్ని రాబోయే తరాలు ఏమాత్రం క్షమించవు. వేసవి తాపాన్ని తప్పించుకునేందుకు శీతల ప్రాంతాలకు పోయే బదులు, మనమున్న చోటనే శీతల వాతావరణం నెలకొనే విధంగా పచ్చదనాన్ని పెంచుకోవడమే వివేకం అనిపించుకుంటుంది. పచ్చదనాన్ని 33 శాతం పెంచడానికి ప్రారంభించిన హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు విధిగా పాల్గొనాలె. విరివిగామొక్కలు నాటాలెనని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. లక్ష్యసిద్ధి, చిత్తశుద్ధితో పనిచేసి హరిత తెలంగాణను ఆవిష్కరించుకోవాలె. సస్యశ్యామల, సమశీతల తెలంగాణ రూపొందాలె.

స్థానిక సంస్థలకు నిధులు
ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు క్షేత్రస్థాయిలో ప్రతిఫలించాలంటే పరిపాలనా వ్యవస్థలు క్రియాశీలంగా మారాలి. కానీ దశాబ్దాల తరబడి తెలంగాణలో సాగిన అస్తవ్యస్త విధానాల వల్ల స్థానిక పాలనా వ్యవస్థలు చతికిలపడిపోయాయి. వాటి కర్తవ్యాలను మరిచి, దశ దిశను కోల్పోయినాయి. ఒకనాడు ఒక ఉద్యమంగా ప్రారంభమయిన పంచాయతీ రాజ్‌ వ్యవస్థ నేడు ఒక అవశేషంగా మిగిలిపోయింది. నిర్వీర్యమైపోయిన స్థానిక సంస్థలకు తిరిగి జవసత్వాలు కల్పించకుండా మనం ఆశించిన కల నెరవేరదు. అందుకే ప్రభుత్వం స్థానిక సంస్థల పనితీరును పునర్నిర్వచిస్తూ నూతన పంచాయతీ రాజ్‌ చట్టానికి రూపకల్పన చేసింది. ఈ చట్టం వెలుగులో పంచాయతీ రాజ్‌ సంస్థలకు నిర్ధిష్టమైన విధులను, బాధ్యతలను నిర్ధేశిస్తూ, కావాల్సిన నిధులను క్రమం తప్పకుండా ప్రభుత్వం సమకూరుస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 1,229 కోట్ల రూపాయలను కేటాయించింది. కేంద్ర నిధులతో సరిసమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో 1,229 కోట్లు కేటాయిస్తుంది. అంటే గ్రామీణ స్థానిక పరిపాలనా సంస్థలకు ఏటా మొత్తం 2,458 కోట్ల రూపాయల చొప్పున నిధులు అందుతాయి. 500 జనాభా కలిగిన చిన్న గ్రామ పంచాయతీకి కూడా ఏడాదికి 8 లక్షల రూపాయల అభివద్ధి నిధులు అందుతాయని తెలియచేస్తున్నాను. వీటికి తోడు గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు కూడా స్థానిక సంస్థలకు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో గ్రామ పంచాయతీలకు నిధుల కొరత అనే సమస్య ఉండదు.

నూతన పంచాయతీ రాజ్‌ చట్టం పరిధిలో గ్రామ పరిపాలనలో అవినీతికి ఆస్కారం ఉండకూడదు. పంచాయతీ రాజ్‌ వ్యవస్థలో పనిచేసే ప్రజాప్రతినిధులు, అధికారులకు గ్రామాల పారిశుధ్యం పాటించడం, పచ్చదనం పెంచడం విధిగా పాటించవలసిన నిబంధన. తమ విధుల నిర్వహణలో విఫలమయిన వారిని ఈ చట్టం ఉపేక్షించదు. కఠినమైన శిక్షలు విధిస్తుంది. పదవుల నుంచి తొలగిస్తుంది. ఈ చట్టాన్ని కఠినంగా అమలు పరచడం ద్వారా గ్రామాలన్నీ పరిశుభ్రతకు, పచ్చదనానికి పట్టుగొమ్మలుగా మారి కళకళలాడేలా చేయాలన్నది ప్రభుత్వ ఆశయం. ఏ గ్రామ పంచాయతీకి ఆ గ్రామ పంచాయతీ, అందులోని ప్రజలు ఈ లక్ష్యం సాధించడానికి సంసిద్ధం కావాలి.

పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పరిపాలనలో క్రమబద్ధతను, జవాబుదారీ తనాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం నూతన పురపాలక చట్టాన్ని రూపొందిస్తున్నది. ఈ చట్టం ద్వారా పట్టణాలు, నగరాలు అడ్డదిడ్డంగా, అస్తవ్యస్తంగా పెరగకుండా ఉండేందుకు కావాల్సిన కఠిన నియమాలను ఈ చట్టం నిర్ధేశిస్తుంది. అవినీతికి ఏమాత్రం ఆస్కారమివ్వని విధంగా, తప్పు చేసేందుకు అవకాశమిచ్చే లొసుగులు లేకుండా కట్టుదిట్టం చేసే నిబంధనలు ఈ చట్టంలో ఉండబోతున్నాయి.

మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా వ్యవస్థలు, చట్టాలు కూడా మారాలె. లేకపోతే మార్పులను అందిపుచ్చుకోవడంలో సమాజం వెనుకబడుతుంది. కాలం చెల్లిన భావనలతో మన వ్యవస్థలు ఇంకా కొనసాగుతుండడం విచారకరం. చేసే పని మారినా, పేరు మారని భావదారిద్య్రంలో వ్యవస్థలు నడుస్తున్నాయి. ఉదాహరణకు భూమి శిస్తు వసూలు చేసే కాలంలో రెవెన్యూ శాఖ ఏర్పడింది. భూమి శిస్తు అనే మాటే ఇప్పుడు లేదు. రెవెన్యూ వసూలు చేసే పని పోయినా, ఆ శాఖకు రెవెన్యూ అనే పేరు పోలేదు. అదే విధంగా రెవెన్యూను కలెక్ట్‌ చేసే బాధ్యత పోయినా, కలెక్టర్‌ అనే మాట మారలేదు. ఇటువంటి అసంగతమైన విషయాలు చట్టంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఫ్యూడల్‌ కాలంలో రూపొందించిన చట్టంలో అవినీతికి ఆస్కారమిచ్చే లొసుగులు అట్లే ఉన్నాయి. భూరికార్డుల ప్రక్షాళనకు పూనుకున్న సందర్భంలో ఈ లోపాలన్నీ ప్రభుత్వ సంకల్పానికి అడ్డుగోడలుగా మారినాయి. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ చట్టాన్ని పునరావలోకనం చేయడానికి, పునస్సమీక్షించడానికి ప్రభుత్వం పూనుకున్నది. భూముల క్రయ విక్రయాలలో, పేరు మార్పిడిలో, వారసత్వ హక్కులు కల్పించడంలో, రిజిస్ట్రేషన్‌ సందర్భంలో ఏర్పడుతున్న అవకతవకలవల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ చట్టం అమలులో ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఆశిస్తున్నది, ఆహ్వానిస్తున్నది. ప్రభుత్వం, ప్రజలు సమష్టి కషితోనే ఆశించిన సంస్కరణ సాకారమవుతుంది.

నేను ఇప్పటి వరకు చెప్పిన కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం, కొత్త మున్సిపల్‌ చట్టం, కొత్త రెవెన్యూ చట్టం పకడ్బందీగా అమలు కావడం కోసం పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నాను. తమ దైనందిన అవసరాల కోసం ఈ మూడు శాఖలతో ప్రజలు సంబంధం కలిగి ఉంటారు. మనమందరం స్థిరచిత్తంతో, దృఢ చిత్తంతో ఈ మూడు శాఖల నుంచి అవినీతిని పారద్రోల గలిగితే ప్రజలకు పరిపాలనా వ్యవస్థల మీద నమ్మకం, గౌరవం పెరుగుతాయి.

తెలంగాణ ప్రజలకు మొదటి నుంచీ సామాజిక లక్ష్యాలను సాధించే చైతన్యం ఉంది. సంఘటితంగా ఉద్యమించి ఫలితాలను సాధించిన అనుభవమూ ఉంది. స్వరాష్ట్ర సాధన కోసం మనం చేసిన మహోన్నత పోరాటం దేశ చరిత్రలో నూతన అధ్యాయాన్ని రచించింది. సామాజిక ఉద్యమాలకు ఒక అధ్యయన అంశంగా మన ఉద్యమ చరిత్ర నిలిచింది. ఇంతటి ఘన లక్ష్యాన్ని సాధించిన మనం సుపరిపాలన కోసం కావాల్సిన మార్పులను సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. కావాల్సిందల్లా సంకల్ప శక్తి, సమన్వయ దృష్టి. ఈ దిశగా మనందరం పట్టుపట్టి, జట్టుకట్టి ముందడుగు వేయాలి. అవినీతికి అడ్డుకట్టలు వేస్తూ, పారదర్శక పరిపాలనలో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పాలి.

జై హింద్‌

జై తెలంగాణ