సంపూర్ణంగా సహకరిస్తాం.. పెట్టుబడులతో రండి..

  • ఫ్రాన్స్‌ పారిశ్రామిక వేత్తలకు మంత్రి కేటీఆర్‌ పిలుపు

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహాకారాలు అందిస్తుందని ఫ్రాన్స్‌ పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. ఫ్రాన్స్‌ ఎగువసభలో (సెనేట్‌) జరిగే ‘యాంబిషన్‌ ఇండియా ` 2021’ సదస్సులో పాల్గొని, ‘గ్రోత్‌`డ్రాఫ్టింగ్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ ఇండో ఫ్రెంచ్‌ రిలేషన్స్‌ ఇన్‌ పోస్ట్‌ కొవిడ్‌ ఎరా (కొవిడ్‌ తర్వాత భారత్‌`ఫ్రాన్స్‌ మధ్య సంబంధాలు) అనే అంశంపై కీలకోపన్యాసం చేయడానికి కేటీఆర్‌ ఫ్రాన్స్‌ వెళ్ళారు. మంత్రి తన పర్యటనలో పారిస్‌ నగరంలో పలువురు పారిశ్రామిక వేత్తలను కలిసి తెలంగాణలో ఉన్న వనరులు, మార్కెటింగ్‌ వ్యవస్థ, ప్రభుత్వ సహకారం గురించి విఫులంగా వివరించారు. 

ముఖ్యంగా సౌందర్య సాధనాలు, క్షిపణులు తదితర రక్షణ రంగ ఉత్పత్తులు, హెలికాప్టర్లు, విమానాల విడిభాగాల ఉత్పత్తులు చేసే పరిశ్రమల యాజమాన్యాలతో కేటీఆర్‌ చర్చించారు. తెలంగాణలో ఇప్పటికే హెలికాప్టర్‌, విమానాల విడిభాగాలు తయారవుతున్నాయని, మీరు కూడా పెట్టుబడులు పెడితే అన్ని విధాల సహకరిస్తామన్నారు. వైమానిక, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత విశ్వసనీయ గమ్యస్థానంగా ఉందని తెలిపారు. క్షిపణి తయారీ పరిశ్రమలకు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. సౌందర్య సాధనాల ఉత్పత్తులు కూడా భారత్‌లో మంచి మార్కెట్‌ను కలిగి ఉన్నాయన్నారు. కరోనా కల్లోలంలో కూడా సౌందర్య సాధనాల మార్కెట్‌ బాగా జరిగిందని కేటీఆర్‌ పారిశ్రామిక వేత్తలకు వివరించారు. తెలంగాణలో మార్కెట్‌ ఏర్పాటు ద్వారా దేశమంతా వ్యాపారం నిర్వహించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. 

మొదటి రోజు ఫ్రెంచ్‌ ప్రభుత్వ డిజిటల్‌ అఫైర్స్‌ అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌ తో సమావేశం అయ్యారు. ఇన్నోవేషన్‌, డిజిటలైజేషన్‌, ఓపెన్‌ డేటా వంటి వాటిపై తెలంగాణ, ఫ్రాన్స్‌ మధ్య పరస్పర సహకారం అందించుకునే విషయం చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇన్నోవేషన్‌, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి జరుగుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఓపెన్‌ డేటా పాలసీ, రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న డిజిటల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌లకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ అంబాసిడర్‌ హెన్రీ వర్డియర్‌కు వివరించారు. అలాగే తెలంగాణలోని అంకుర సంస్థలకు ఫ్రాన్స్‌లో, ఫ్రాన్స్‌లోని అంకుర సంస్థలకు తెలంగాణలో వ్యాపార, వాణిజ్య అవకాశాలు కల్పించడం గురించి కూడా వివరమైన చర్చ జరిగింది.

రెండవ రోజు పారిస్‌లోని ప్రసిద్ధ క్షిపణుల తయారీ సంస్థ ఎంబీడీఏ డైరెక్టర్లు బోరిస్‌ సాలోమియాక్‌, పోల్‌నీల్‌ లివిక్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు జీన్‌మార్క్‌ పెరాడ్‌తో, ఏరో క్యాంపస్‌ అక్విటిన్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం కాస్మోటిక్‌ వ్యాలీ డిప్యూటీ సిఇఓ ఫ్రాంకీ బెచెరోతో సమావేశమయ్యారు. తమ రాష్ట్రానికి వచ్చి పర్యటించా ల్సిందింగా ఆయా పారిశ్రామిక వేత్తలను మంత్రి కేటీఆర్‌ ఆహ్వానించారు. అనంతరం ఫ్రాన్స్‌లో భారత రాయబారి జావేద్‌ అష్రఫ్‌తో సమావేశమయ్యారు. పారిస్‌లో పారిశ్రామిక, వ్యాపార వేత్తలతో జరిగిన సమావేశాల గురించి కేటీఆర్‌ భారత రాయబారికి వివరించారు. పెట్టుబడుల సమీకరణకు సహకరించాలని కోరారు. 

ఈ సమావేశాలలో ఫ్రాన్స్‌ లో భారత డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ కే.ఎం. ప్రఫుల్ల చంద్ర శర్మ, తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, డైరెక్టర్‌ డిజిటల్‌ మీడియా కొణతం దిలీప్‌, డైరెక్టర్‌ ఏవియేషన్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.