శోభకృతు యుగాదికి స్వాగతం
By:-మద్దూరి రామమూర్తి
స్వాగతమార్యులార ! నవ వత్సర వేళను రమ్య సాహితీ
సాగర వీచికా వితతి సంతత సంచరదంతరంగులై
సాగుడు మీరటంచు మనసార శుభమ్ముల గోరి ప్రేముడిన్
స్వాగత గీతికా రవ వసంతము జల్లుచు స్వాగతించెదన్
మన్నన తోడ మమ్ముగను మంత్రులకున్ గుణమాన్యులైన స
ర్వోన్నత సాధికారులకు నున్నతులై వెలుగొందు వారి కా
పన్నుల గాచు దాతలకు వంద్యులునైన రసజ్ఞపాళికిన్
యెన్నగ శోభకృత్ సతము నిండగు కోర్కెల నేలుగావుతన్
సమ్మక్క సారక్క సంస్క ృతీ విభవమ్ము భద్రమ్ము గోరుచు స్వాగతించ,
బోనాల పండగ నీ నామ మెదనెంచి హర్షముప్పొంగ నాహ్వాన మొసగ,
బతుకమ్మ తల్లి సన్నుతుల నొసంగుచు రమణీయరీతి హారతు లసంగ,
భద్రాద్రి రామయ్య భవ్య మనస్కుడై ప్రీతి నాశీస్సులన్ బిలుచుచుండ,
నవని బంగారు తెలగాణ యశము నిండ కాకతీయుల శిల్ప విజ్ఞాన గరిమ
దిశల వెలుగొంద శారదా తేజ మలర యిలకు రావమ్మ ఓ శోభకృతు నమోస్తు !
పికములు లేవు, లేవు కనువిందొనరించెడి పూలు, యిం
చుకయును కానరావు ఋతు శోభలు, తుమ్మెద పాటలా పరా
చికముల మాటలే, భువిని జేరితి వెట్టుల స్వాగతింతు మీ
ప్రకట యుగాది వేళ పెను భారము శోభకృతూ ! వచింపగా.
పులుపున్ కారము చేదు తీపి వగరుప్పున్ బోలు మేధస్సుతో
నలరన్ జేయగ స్వాగతించితిమి నూత్నాబ్దమ్మ ! సంతోష సం
తులితానంద మయ ప్రపంచమును ప్రాదుర్భావమున్ జేయ నీ
చెలిమిన్ గోరితి శోభకృత్ సతతమున్ శ్రేయమ్ములందించుమా !